Pages

Thursday, February 23, 2012

కోటప్ప కొండ తిరణాల ..!!


పండగలెన్ని ఉన్నా,మూల నున్న ముసలమ్మను కూడా కుక్కి మంచంలోంచి లేపి పరుగులు పెట్టించే పండగ__

మా వూళ్ళో..మహాశివరాత్రి!
వారం ముందు నుంచే హడావుడి మొదలు.

కోటప్ప కొండ తిరణాల చూడాలని ఊళ్ళ నుంచి దిగే చుట్టాలూ, ఇంట్లో పిల్లలు కట్టే బుల్లి బుల్లి ప్రభలూ, తాడెత్తున లేచి ఆకాశాన్ని అంటుతాయేమో అన్నంతగా వూగి పోతూ ఎద్దుల బళ్ళ మీదా,(ఇప్పుడైతే ట్రాక్టర్ల మీద) కొండకేసి సాగే ప్రభలూ,ఊరంతా తిరణాల సందడీ, కొండ ముందు ఎకరాల కొద్దీ విస్తరించిన అంగళ్ళూ,గుట్టలు గుట్టలుగా చెరుకు  గడలూ,పసుపు కుంకుమలు కలిపిన బకెట్లతో మెట్ల పూజ చేస్తూ నడుం పడిపోతున్నా పట్టించుకోకుండా కొండెక్కే దంపతులూ...పండంగంతా మా వూర్లోనే!త్రికూట పర్వతం మీద కొలువైన త్రికూటేశ్వరుడి పండగ శివరాత్రి. ఈ దేవుడంటే చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ కొండంత భక్తి! అందుకే ప్రతి ఇంట్లోనూ ఒక కోటేశ్వర్రావు ఉంటాడు.:-))

దశాబ్దాల క్రితం, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్ళన్నీ కోటప్ప కొండ సందర్శకులతో నిండిపోవడమే కాక రైలు పైన కూడా ఎక్కి ప్రయాణించే పరిస్థితి ఉండేదట. చుట్టు పక్కల మరి కొన్ని గ్రామాల్లో స్థానిక పండగల సందర్భంగా తిరణాలలు జరిగినా ఈ స్థాయిలో భారీ ఎత్తున లక్షల్లో భక్తులు తరలి  రావడం ఇక్కడే ప్రత్యేకం!

కోటప్ప కొండ చరిత్ర

దక్ష యజ్ఞంముగిశాక మహాదేవుడు శాంతించి దక్షిణా మూర్తి రూపంలో కోటప్ప కొండ మీద అవతరించాడట. బ్రహ్మాదులు   దక్షిణా మూర్తిని  బ్రహ్మోపదేశం చేయమని కోరగా ఆయన సమ్మతించి త్రికూటాద్రి పర్వతం మీద వారికి బ్రహ్మోపదేశం చేశాడని చెప్తారు. మూడు శిఖరాలు కల్గిన పర్వతం కావడంతో ఈ కొండని త్రికూట పర్వతమని పిలుస్తారు.బ్రహ్మ,రుద్ర,విష్ణు శిఖరాలే ఈ త్రికూటాలు. రుద్ర శిఖరం మీదే శివుడు బ్రహ్మోపదేశం చేశాడని భావిస్తారు. ఈ శిఖరం మీదే కోటేశ్వర స్వామి పురాతన ఆలయం ఉంది. పక్కనే ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో ఒక రాతి మీద పోటు వేశాడని, అక్కడ జల ఉద్భవించిందని నమ్మకం. అక్కడ పాప వినాశనేశ్వర ఆలయం నిర్మించారు.
ఇక్కడికి దగ్గరలోని యల్లమంద (మునిమంద గ్రామమే కాలక్రమేణా యల్లమందగా మారిందని చెప్తారు)గ్రామంలో మునులు ఎంతోమంది నివసించేవారట.

స్థల పురాణం:

ఇక్కడ శివుడు పన్నెండేళ్ళ వటువుగా అవతరించడం వల్లను,  ఆయన బ్రహ్మచారి కావడం వల్లను,, ఇక్కడ కళ్యాణోత్సవం జరగదు,. ధ్వజ స్థంభం  కూడా లేదు.దగ్గరలోని యల్లమంద గ్రామంలో నివసించే సాలంకయ్య అనే గృహస్తు రుద్ర శిఖరం మీది స్వామికి రోజూ కొండ ఎక్కి వచ్చి పూజలు చేసేవాడు.కొన్నాళ్లకు ఒక జంగమ దేవర సాలంకయ్య ఇంటికి వచ్చి కొన్నాళ్ళు నివసించి అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు.  సాలంకయ్య ఎంత వెదికినా ఫలితం లేకపోయింది.

                                                                 

ఇలా ఉండగా అక్కడికి దగ్గర్లోని కొండ కావూరులో ఒక ఇంట్లో ఆనందవల్లి (ఈమెనే గొల్ల భామ అంటారు)అనే ఆడపిల్ల   శివభక్తురాలై,పాత కోటేశ్వర స్వామిని రోజూ పూజించేది.ఆమెకు జంగమదేవర ప్రత్యక్షంగా కనిపించడంతో నిత్య పూజలు ప్రారంభించింది.ఎంత ఎండాకాలమైనా, గొల్లభామ రోజూ కొండ ఎక్కి జంగమయ్యకు అభిషేకాలు నిర్వహించేది.ఒకనాడు అభిషేకానికి తీర్థం తెచ్చి ఉంచి,మారేడు దళాలకోసం వెళ్ళగా, ఒక కాకి వచ్చి ఆ తీర్థాన్ని నేల పాలు చేయడంతో గొల్ల భామ కోపించి ఆ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందంటారు.కోటప్ప కొండ మీద కాకులు కనిపించకపోవడానికి ఈ శాపమే కారణమంటారు.


ఎన్ని పరీక్షలు పెట్టినా గొల్లభామ రోజూ శివుడిని పూజించేందుకు వస్తుండటంతో జంగమ దేవర ఒకరోజూ  "నేనే నీ ఇంటికి వస్తాను పద, అక్కడే నన్ను పూజిద్దువు గానీ"  అని ఆమె వెనుకే బయలు దేరాడు. ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని ఆమెను ఆదేశించాడు.

ఆమె బయలు దేరాక వెనుక నుంచి భయంకరమైన ప్రళయ ధ్వనులు,ఎద్దుల గిట్టల చప్పుడు, అది దూసుకొస్తున్న శబ్దాలకు భయపడి కొంత దూరం వెళ్ళగానే గొల్ల భామ వెనుదిరిగి చూసింది. దాంతో ఆమె,జంగమ దేవర ఎక్కడివారక్కరే శిలలుగా మారిపోయారని కథనం! వారిద్దరికీ అదే ప్రదేశాల్లో సాలంకయ్య ఆలయాలు నిర్మించాడు.
                                                                           గొల్ల భామ ఆలయం


త్రికోటేశ్వరాలయానికి కాస్త దిగువగా గొల్లభామ ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా  గొల్ల భామనే దర్శించి ఆ పైనే కోటేశ్వరుడిని దర్శిస్తారు. శ్రావణ మాసంలో రుద్ర శిఖరం పైన,కార్తీక మాసంలో విష్ణు శిఖరం పైన, మహా లింగార్చన చేసి ఉపవాస జాగరణలు చేసిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.11 వ శతాబ్ది నాటికే ఇక్కడ ఆలయం ఉందని ఇక్కడ కొండ మీది శాసనాల వల్ల తెలుస్తుంది.చోళ రాజులకు పూర్వం నుంచే ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కిందట.ఇక్కడి బొచ్చు కోటేశ్వరుడికి తల నీలాలు మొక్కుబడిగా ఇస్తుంటారు.కొండ కింద ప్రసన్న కోటేశ్వరుడు,నీల కంఠేశ్వరుడు తదితర దేవాలయాలు ఉన్నాయి.

తిరణాల సంబరం:
పంటలు చేతికొచ్చే తరుణం కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పోటీలు పడి ప్రభలు కట్టుకుని కొండకు తరలి వస్తారు. ఎంత ఎత్తు ప్రభ కడితే అంత ప్రతిష్ట! అయితే ఎత్తయిన ప్రభను కొండ వరకూ సురక్షితంగా తీసుకు రావడం ఒక పెద్ద సవాలు.అందులోనూ విద్యుత్ ప్రభలైతే మరింత కష్టం. అందుకనే విద్యుత్ ప్రభలు వచ్చే మార్గాల్లో అన్ని హై టెన్షన్ తీగల్లోనూ విద్యుత్ నిలిపి వేస్తారు పండగ రోజు.


 ఇవాల్టి రోజున పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ప్రభలు కట్టి కొండకు తరలి వచ్చే గ్రామాలున్నాయి. వీటి జోరు దశాబ్దం క్రితం తగ్గు ముఖం పట్టినా....అతి చక్కని ప్రభకు బహుమతులు కూడా దేవస్థానం ప్రకటిస్తూ ఉండటంతో  ఇటీవల మళ్ళీ పుంజుకుంది.


నకరికల్లు,దేచవరం,మాచవరం,గామాల పాడు,ఈపూరు,బొమ్మరాజు పల్లి,చిలకలూరిపేట వైపు నుంచి గోవిందపురం,అప్పాపురం,కమ్మవారి పాలెం ,కావూరు,అమీన్  సాహెబ్ పాలెం,అవిశాయపాలెం ఇంకా అనేక గ్రామాల నుంచి ప్రభలు 90 అడుగుల ఎత్తు తో అందంగా రూపు దిద్దుకుని కొండకు వస్తాయి.

వీటిలో 50 ఏళ్ళ నుంచి క్రమం తప్పక వస్తున్న ప్రభలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే! అప్పాపురం ప్రభ యాభై ఎల్ల నుంచి క్రమం తప్పక వస్తుందట.ఆలయం అతి పురాతన కట్టడం అయినందున దాదాపు దశాబ్దం క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. మెట్ల దారిలో విశ్రాంతి మండపాలు నిర్మించారు. అర్థాంతరంగా ఆగిన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని స్వయంగా శివభక్తుడైన అప్పటి శాసన సభ్యుడు కోడెల శివ ప్రసాద్ పూనుకుని పూర్తి చేసి, కోటప్ప కొండ చరిత్రలో మైలు రాయిని పాతారు.

దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 41 మలుపులుండగా వీటిలో 4 కీలకమైన మలుపులు ఉన్నాయి. మూడు కీలక శిఖరాల మీదా బ్రహ్మ విష్ణు,మహేశ్వరుల భారీ విగ్రహాలను, కొండ పైన, భారీ గణేశ ప్రతిమను ప్రతిష్టించారు.


చక్కని ప్రకృతి, సందర్శకులను సేద తీర్చేలా ఘాట్ రోడ్డుని తీర్చి దిద్దారు. పచ్చని వృక్షాలు,పార్కులు,సెలయేళ్ళు,ఆట స్థలాలు ఈ రోడ్డులో కొలువు తీరాయి.ఏటా జరిగే తిరణాల లో కోట్ల రూపాయల కొద్దీ వ్యాపారం జరుగుతుంది.ఒకప్పుడు జోరుగా సాగే రికార్డింగ్ డాన్సులు శ్రీ ఈదర గోపీచంద్ నేతృత్వంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక జరిపిన పోరాటం వల్ల వెనుక బడ్డాయి. వాటిని పూర్తిగా నిషేధించినా, రాత్రి పొద్దు పోయాక తిరణాల లోని కొని చోట్ల ప్రభల మీద జరుగుతూనే ఉన్నాయని ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి.

తిరణాల ముగిసిన రెండు మూడు రోజులకు కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెట్టున వర్షం కురిసి, రద్దీ వల్ల పేరుకున్న చెత్త, అశుభ్రం అంతా కొట్టుకుపోయి కొండ శుభ్ర పడటం ప్రతి యేటా జరిగే ఒక విచిత్రం!

అత్యంత ప్రజాదరణ పొందిన మా కోటప్ప తిరణాలకు రాష్ట్ర పండుగ హోదా లభించింది ఈ ఏడాది. దీనివల్ల మరిన్ని నిధులు సమకూరి మరింత శోభాయమానంగా కోలాహలంగా తిరణాల జరుగుతుందన్నమాట
.

ఈ ఏడాది తిరణాల విశేషాలు:
జనం పోటెత్తి పోవడంతోను, VIP లు పని పాటా లేకుండా పదుల కొద్ది చుట్టాల్ని వేసుకుని దర్సనానికి రావడంతోను పాపం మన లాంటి మామూలు జనం చాలా ఇబ్బందులు పడ్డారట.  సాక్షాతూ మంత్రి కాసు కృష్ణా రెడ్డి గారే వెనుదిరిగి పోయి మళ్ళీ వచ్చారని వార్తలు. ఇదెలా ఉన్నా, మూడు రోజుల క్రితం జరిగన తిరణాల ఫోటోలు పేట్రియాట్స్ బ్లాగుకు ప్రత్యేకం!


మహా శివుడి దర్శనం ఫోటోతో మంగళం!

ఎలా ఉంది మా కోటప్ప తిరణాల? మీరే వెళ్లి వచ్చినట్టు లేదూ!!

--