Pages

Thursday, February 23, 2012

కోటప్ప కొండ తిరణాల ..!!


పండగలెన్ని ఉన్నా,మూల నున్న ముసలమ్మను కూడా కుక్కి మంచంలోంచి లేపి పరుగులు పెట్టించే పండగ__

మా వూళ్ళో..మహాశివరాత్రి!
వారం ముందు నుంచే హడావుడి మొదలు.

కోటప్ప కొండ తిరణాల చూడాలని ఊళ్ళ నుంచి దిగే చుట్టాలూ, ఇంట్లో పిల్లలు కట్టే బుల్లి బుల్లి ప్రభలూ, తాడెత్తున లేచి ఆకాశాన్ని అంటుతాయేమో అన్నంతగా వూగి పోతూ ఎద్దుల బళ్ళ మీదా,(ఇప్పుడైతే ట్రాక్టర్ల మీద) కొండకేసి సాగే ప్రభలూ,ఊరంతా తిరణాల సందడీ, కొండ ముందు ఎకరాల కొద్దీ విస్తరించిన అంగళ్ళూ,గుట్టలు గుట్టలుగా చెరుకు  గడలూ,పసుపు కుంకుమలు కలిపిన బకెట్లతో మెట్ల పూజ చేస్తూ నడుం పడిపోతున్నా పట్టించుకోకుండా కొండెక్కే దంపతులూ...పండంగంతా మా వూర్లోనే!త్రికూట పర్వతం మీద కొలువైన త్రికూటేశ్వరుడి పండగ శివరాత్రి. ఈ దేవుడంటే చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ కొండంత భక్తి! అందుకే ప్రతి ఇంట్లోనూ ఒక కోటేశ్వర్రావు ఉంటాడు.:-))

దశాబ్దాల క్రితం, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్ళన్నీ కోటప్ప కొండ సందర్శకులతో నిండిపోవడమే కాక రైలు పైన కూడా ఎక్కి ప్రయాణించే పరిస్థితి ఉండేదట. చుట్టు పక్కల మరి కొన్ని గ్రామాల్లో స్థానిక పండగల సందర్భంగా తిరణాలలు జరిగినా ఈ స్థాయిలో భారీ ఎత్తున లక్షల్లో భక్తులు తరలి  రావడం ఇక్కడే ప్రత్యేకం!

కోటప్ప కొండ చరిత్ర

దక్ష యజ్ఞంముగిశాక మహాదేవుడు శాంతించి దక్షిణా మూర్తి రూపంలో కోటప్ప కొండ మీద అవతరించాడట. బ్రహ్మాదులు   దక్షిణా మూర్తిని  బ్రహ్మోపదేశం చేయమని కోరగా ఆయన సమ్మతించి త్రికూటాద్రి పర్వతం మీద వారికి బ్రహ్మోపదేశం చేశాడని చెప్తారు. మూడు శిఖరాలు కల్గిన పర్వతం కావడంతో ఈ కొండని త్రికూట పర్వతమని పిలుస్తారు.బ్రహ్మ,రుద్ర,విష్ణు శిఖరాలే ఈ త్రికూటాలు. రుద్ర శిఖరం మీదే శివుడు బ్రహ్మోపదేశం చేశాడని భావిస్తారు. ఈ శిఖరం మీదే కోటేశ్వర స్వామి పురాతన ఆలయం ఉంది. పక్కనే ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో ఒక రాతి మీద పోటు వేశాడని, అక్కడ జల ఉద్భవించిందని నమ్మకం. అక్కడ పాప వినాశనేశ్వర ఆలయం నిర్మించారు.
ఇక్కడికి దగ్గరలోని యల్లమంద (మునిమంద గ్రామమే కాలక్రమేణా యల్లమందగా మారిందని చెప్తారు)గ్రామంలో మునులు ఎంతోమంది నివసించేవారట.

స్థల పురాణం:

ఇక్కడ శివుడు పన్నెండేళ్ళ వటువుగా అవతరించడం వల్లను,  ఆయన బ్రహ్మచారి కావడం వల్లను,, ఇక్కడ కళ్యాణోత్సవం జరగదు,. ధ్వజ స్థంభం  కూడా లేదు.దగ్గరలోని యల్లమంద గ్రామంలో నివసించే సాలంకయ్య అనే గృహస్తు రుద్ర శిఖరం మీది స్వామికి రోజూ కొండ ఎక్కి వచ్చి పూజలు చేసేవాడు.కొన్నాళ్లకు ఒక జంగమ దేవర సాలంకయ్య ఇంటికి వచ్చి కొన్నాళ్ళు నివసించి అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు.  సాలంకయ్య ఎంత వెదికినా ఫలితం లేకపోయింది.

                                                                 

ఇలా ఉండగా అక్కడికి దగ్గర్లోని కొండ కావూరులో ఒక ఇంట్లో ఆనందవల్లి (ఈమెనే గొల్ల భామ అంటారు)అనే ఆడపిల్ల   శివభక్తురాలై,పాత కోటేశ్వర స్వామిని రోజూ పూజించేది.ఆమెకు జంగమదేవర ప్రత్యక్షంగా కనిపించడంతో నిత్య పూజలు ప్రారంభించింది.ఎంత ఎండాకాలమైనా, గొల్లభామ రోజూ కొండ ఎక్కి జంగమయ్యకు అభిషేకాలు నిర్వహించేది.ఒకనాడు అభిషేకానికి తీర్థం తెచ్చి ఉంచి,మారేడు దళాలకోసం వెళ్ళగా, ఒక కాకి వచ్చి ఆ తీర్థాన్ని నేల పాలు చేయడంతో గొల్ల భామ కోపించి ఆ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందంటారు.కోటప్ప కొండ మీద కాకులు కనిపించకపోవడానికి ఈ శాపమే కారణమంటారు.


ఎన్ని పరీక్షలు పెట్టినా గొల్లభామ రోజూ శివుడిని పూజించేందుకు వస్తుండటంతో జంగమ దేవర ఒకరోజూ  "నేనే నీ ఇంటికి వస్తాను పద, అక్కడే నన్ను పూజిద్దువు గానీ"  అని ఆమె వెనుకే బయలు దేరాడు. ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని ఆమెను ఆదేశించాడు.

ఆమె బయలు దేరాక వెనుక నుంచి భయంకరమైన ప్రళయ ధ్వనులు,ఎద్దుల గిట్టల చప్పుడు, అది దూసుకొస్తున్న శబ్దాలకు భయపడి కొంత దూరం వెళ్ళగానే గొల్ల భామ వెనుదిరిగి చూసింది. దాంతో ఆమె,జంగమ దేవర ఎక్కడివారక్కరే శిలలుగా మారిపోయారని కథనం! వారిద్దరికీ అదే ప్రదేశాల్లో సాలంకయ్య ఆలయాలు నిర్మించాడు.
                                                                           గొల్ల భామ ఆలయం


త్రికోటేశ్వరాలయానికి కాస్త దిగువగా గొల్లభామ ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా  గొల్ల భామనే దర్శించి ఆ పైనే కోటేశ్వరుడిని దర్శిస్తారు. శ్రావణ మాసంలో రుద్ర శిఖరం పైన,కార్తీక మాసంలో విష్ణు శిఖరం పైన, మహా లింగార్చన చేసి ఉపవాస జాగరణలు చేసిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.11 వ శతాబ్ది నాటికే ఇక్కడ ఆలయం ఉందని ఇక్కడ కొండ మీది శాసనాల వల్ల తెలుస్తుంది.చోళ రాజులకు పూర్వం నుంచే ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కిందట.ఇక్కడి బొచ్చు కోటేశ్వరుడికి తల నీలాలు మొక్కుబడిగా ఇస్తుంటారు.కొండ కింద ప్రసన్న కోటేశ్వరుడు,నీల కంఠేశ్వరుడు తదితర దేవాలయాలు ఉన్నాయి.

తిరణాల సంబరం:
పంటలు చేతికొచ్చే తరుణం కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పోటీలు పడి ప్రభలు కట్టుకుని కొండకు తరలి వస్తారు. ఎంత ఎత్తు ప్రభ కడితే అంత ప్రతిష్ట! అయితే ఎత్తయిన ప్రభను కొండ వరకూ సురక్షితంగా తీసుకు రావడం ఒక పెద్ద సవాలు.అందులోనూ విద్యుత్ ప్రభలైతే మరింత కష్టం. అందుకనే విద్యుత్ ప్రభలు వచ్చే మార్గాల్లో అన్ని హై టెన్షన్ తీగల్లోనూ విద్యుత్ నిలిపి వేస్తారు పండగ రోజు.


 ఇవాల్టి రోజున పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ప్రభలు కట్టి కొండకు తరలి వచ్చే గ్రామాలున్నాయి. వీటి జోరు దశాబ్దం క్రితం తగ్గు ముఖం పట్టినా....అతి చక్కని ప్రభకు బహుమతులు కూడా దేవస్థానం ప్రకటిస్తూ ఉండటంతో  ఇటీవల మళ్ళీ పుంజుకుంది.


నకరికల్లు,దేచవరం,మాచవరం,గామాల పాడు,ఈపూరు,బొమ్మరాజు పల్లి,చిలకలూరిపేట వైపు నుంచి గోవిందపురం,అప్పాపురం,కమ్మవారి పాలెం ,కావూరు,అమీన్  సాహెబ్ పాలెం,అవిశాయపాలెం ఇంకా అనేక గ్రామాల నుంచి ప్రభలు 90 అడుగుల ఎత్తు తో అందంగా రూపు దిద్దుకుని కొండకు వస్తాయి.

వీటిలో 50 ఏళ్ళ నుంచి క్రమం తప్పక వస్తున్న ప్రభలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే! అప్పాపురం ప్రభ యాభై ఎల్ల నుంచి క్రమం తప్పక వస్తుందట.ఆలయం అతి పురాతన కట్టడం అయినందున దాదాపు దశాబ్దం క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. మెట్ల దారిలో విశ్రాంతి మండపాలు నిర్మించారు. అర్థాంతరంగా ఆగిన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని స్వయంగా శివభక్తుడైన అప్పటి శాసన సభ్యుడు కోడెల శివ ప్రసాద్ పూనుకుని పూర్తి చేసి, కోటప్ప కొండ చరిత్రలో మైలు రాయిని పాతారు.

దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 41 మలుపులుండగా వీటిలో 4 కీలకమైన మలుపులు ఉన్నాయి. మూడు కీలక శిఖరాల మీదా బ్రహ్మ విష్ణు,మహేశ్వరుల భారీ విగ్రహాలను, కొండ పైన, భారీ గణేశ ప్రతిమను ప్రతిష్టించారు.


చక్కని ప్రకృతి, సందర్శకులను సేద తీర్చేలా ఘాట్ రోడ్డుని తీర్చి దిద్దారు. పచ్చని వృక్షాలు,పార్కులు,సెలయేళ్ళు,ఆట స్థలాలు ఈ రోడ్డులో కొలువు తీరాయి.ఏటా జరిగే తిరణాల లో కోట్ల రూపాయల కొద్దీ వ్యాపారం జరుగుతుంది.ఒకప్పుడు జోరుగా సాగే రికార్డింగ్ డాన్సులు శ్రీ ఈదర గోపీచంద్ నేతృత్వంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక జరిపిన పోరాటం వల్ల వెనుక బడ్డాయి. వాటిని పూర్తిగా నిషేధించినా, రాత్రి పొద్దు పోయాక తిరణాల లోని కొని చోట్ల ప్రభల మీద జరుగుతూనే ఉన్నాయని ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి.

తిరణాల ముగిసిన రెండు మూడు రోజులకు కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెట్టున వర్షం కురిసి, రద్దీ వల్ల పేరుకున్న చెత్త, అశుభ్రం అంతా కొట్టుకుపోయి కొండ శుభ్ర పడటం ప్రతి యేటా జరిగే ఒక విచిత్రం!

అత్యంత ప్రజాదరణ పొందిన మా కోటప్ప తిరణాలకు రాష్ట్ర పండుగ హోదా లభించింది ఈ ఏడాది. దీనివల్ల మరిన్ని నిధులు సమకూరి మరింత శోభాయమానంగా కోలాహలంగా తిరణాల జరుగుతుందన్నమాట
.

ఈ ఏడాది తిరణాల విశేషాలు:
జనం పోటెత్తి పోవడంతోను, VIP లు పని పాటా లేకుండా పదుల కొద్ది చుట్టాల్ని వేసుకుని దర్సనానికి రావడంతోను పాపం మన లాంటి మామూలు జనం చాలా ఇబ్బందులు పడ్డారట.  సాక్షాతూ మంత్రి కాసు కృష్ణా రెడ్డి గారే వెనుదిరిగి పోయి మళ్ళీ వచ్చారని వార్తలు. ఇదెలా ఉన్నా, మూడు రోజుల క్రితం జరిగన తిరణాల ఫోటోలు పేట్రియాట్స్ బ్లాగుకు ప్రత్యేకం!


మహా శివుడి దర్శనం ఫోటోతో మంగళం!

ఎలా ఉంది మా కోటప్ప తిరణాల? మీరే వెళ్లి వచ్చినట్టు లేదూ!!

--

29 comments:

వేణూశ్రీకాంత్ said...

ఫోటోలు చూస్తుంటేనే సంబరంగా ఉందండీ.. విపులంగా మీరు రాసిన వ్యాసం చదివితే నిజ్జంగానే వెళ్ళి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ ఏడాది కూడా మిస్ అయ్యాను. వచ్చే ఏడన్నా కుదురుతుందేమో చూడాలి.

Anonymous said...

బావుందండీ సుజాత గారు. కాళ్ళు లాగేస్తున్నాయ్ ( తిరిగి తిరిగి ) . కోటప్పకొండ గురించి సినిమా పాటల్లో వినడమేకానీ ఇప్పటివరకూ చూడలేదు .
ఈ పుణ్యవంతా మీకే చెందుతుంది

తృష్ణ said...

"కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా..." అని పాట గురొస్తోంది..:)) ఇదేనా అది?
చాలా బాగున్నాయి ఫోటోలు + కథనం !!

ramana said...

chala santhosham.kotappakonda thirunalaku vellinatlunnadi

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ విశేషాలూ ఫోటోలూనూ..
స్థల పురాణం బాగా నచ్చింది నాకు ;)

శ్రీరామ్ said...

సుజాత గారు, చాలా చాలా థాంక్స్!
మా (మన) కోటప్ప కొండ ని , ఆ తిరణాల సంబరాలని మళ్లీ చూపించినందుకు !!
చిన్నప్పుడు (బహుశా... 2nd year Intermediate lo అనుకుంటా !) ..ఒకసారి కొండకు వెళ్లి, ఫ్రెండ్ తో బెట్ కట్టి, 6 సార్లు ఎక్కి దిగాను... :-)
ఆ తరవాత రోజు ఏమి అయ్యింది అని మాత్రం అడక్కండి... :-D

ఏల్చూరి మురళీధరరావు said...

శ్రీమతి సుజాత గారికి,

నిజంగా కన్నులున్న మాటలతో ఆ దక్షిణకైలాసం కోటప్ప కొండ తిరుణాళ్ళకు తీసుకొనివెళ్ళి ఆ దృశ్యాలన్నింటినీ సచిత్రంగా చిత్రీకరించారు మీరు.

ఎపిగ్రఫీ వారి రికార్డుల ప్రకారం వెలనాటి గొంకరాజుల కాలానికంటె మునుపే కొండపై గుడి వెలిసిందని శాసనాధారా లున్నాయి.

భాగవతంలో గజేంద్రమోక్షణ కథ జరిగిన త్రికూట పర్వతం ఇదేనని మన ప్రాంతవాసుల విశ్వాసం.

ఒకప్పుడు ఊళ్ళనుంచి ప్రభలు కట్టితెచ్చి, సాలంకయ్య కథను, ఆనందవల్లి (గొల్లభామ) కథను, ఆకాశవాణి వరమిచ్చిన కథను స్త్రీలు ప్రదర్శిస్తూ గుమ్మెట పాటలు పాడుతూ ఊరేగింపును ఓంకారనది మీదుగా తిప్పుతూ గుడికి శివరాత్రి వేళ లింగోద్భవ కాలానికల్లా తీసుకొనివెళ్ళేవాళ్ళట. ఆ కోటీశ్వరస్వామివారి ధారణలింగాన్ని, ఇష్టలింగాన్ని, ప్రాణలింగాన్ని, భావలింగాన్ని, మహాలింగాన్ని ప్రార్థించడం ఉండేదట. దేవస్థానం ఏర్పడ్డాక పూజావిధానం మారింది. మా చిన్నప్పటి దాకానూ రికార్డింగు డాన్సులలో కొంత అశ్లీలత భాసించినా, భక్తిపాటలనే అభినయించేవారు. తర్వాత తర్వాత మాఱి వ్యాపారసంస్కృతి ప్రవేశించింది.

మీ పదచిత్రాన్ని చదివాక క్రీస్తుశకం 1750లో కొప్పరాజు నరసింహకవి గారు శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యంలో తిరునాళ్ళను వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన పద్యం గుర్తుకు వచ్చింది. అచ్చమూ మీ వ్యాసానికి బొమ్మవేసినట్లుంటుంది:

సీ. పైనున్న జనము లాపైని నిల్చినయట్టి
ప్రభలకుఁ గట్టు దర్పణములందుఁ
గ్రింది యుత్సవములఁ బొందుగా నీక్షించి
బహుళోత్సవంబు లీ పర్వతమున
జరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
యందె; నిల్చిరి గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
కుధరంబుపై నుండు గుడినిగాంచి
గీ. ఇచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతము గాదె! యానంద మరసి చూడ.

అని.

హృద్యమైన రచన చేసినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

పద్మవల్లి said...

అబ్బా, ఫోటోలు ఎంత బావున్నాయో. చూస్తుంటేనే ఎప్పుడు వెళ్దామా అని ఉంది. ఆ విగ్రహాలు చూస్తుంటే, అబ్బా చెప్పలేను, అసలు ఎంత బావున్నాయో. పాట విని ఏంటో అనుకోవడమే గానీ వివరంగా ఇప్పుడే తెలిసింది. థాంక్స్.

Vasu said...

బావుంది.

ఇక్కడ తిరనాలు ఇంత హడావుడి గా ఉంటుందని , రాష్ట్ర పండగ హోదా వచ్చిందని ఇప్పటి వరకు తెలియదు.

Anonymous said...

నాగేస్వర రావు పాటలోని కోటప్ప కొండ అంటే ఇదేనా? బాగానే వుందే!
అంతా బాగుంది కాని ... కాని ... మా కాకినాడలో వున్నట్టు ఓడరేవు లేదు. మా కాకినాడ గురించి 'ఎవరైనా' ఇలా చక్కటి చిత్రాలతో ప్రదర్శన ఇస్తారేమో చూడాలి. :P :))

Chandu S said...

సుజాత గారు, చాల బాగా రాశారు. వెళ్ళ గానే పలకరించి, కొబ్బరి చిప్ప ఇస్తే పట్టుకెళ్ళే కోతుల గురించి ఒక్క ముక్క కనపడుతుందని చూశాను.

Unknown said...

సుజాత గారు మీరు కోటప్పకొండ గురుంచి చాలా బాగా చెప్పారు. మిమ్ములను నేను అభినందిస్తున్నాను. నా పేరు రవి చంద్ , మాది యనమలకుదురు, ఇక్కడ కుడా మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.దాని గురుంచి త్వరలోనే నేను మీకు లింక్ ఇస్తాను. అంతవరకు నా బ్లాగ్ చుడండి. http://www.ravichandgurram.blogspot.com

ramu said...

Sujatha garu

చాల బాగా రాశారు. maddi Yallamanda village, Temple guruchi chala telesindi, Thanks

ఆ.సౌమ్య said...

బావుందండీ...కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్నా అన్న పాట తప్ప ఇంకేమీ తెలీదు. ఇప్పుడు ఈ ఫోటోలు అవి చూపిస్తూ బాగా రాసారు.

వేణు said...

కోటప్పకొండ తిరునాళ్ళ విశేషాల గురించి మీరు రాసిన సచిత్ర వ్యాసం బాగుంది. ప్రభల పూర్తి పేరు ‘ప్రభ బళ్ళు’ అనుకుంటాను.

‘‘ ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని..’’ చెప్పే గాథ పేర్ల మార్పులతో ఇతర స్థలపురాణాల్లో కూడా వినపడుతుంటుంది.

మీ వ్యాసం కారణంగా మురళీధరరావు గారి వ్యాఖ్య ద్వారా- 1750 నాటి కొప్పరాజు నరసింహకవి తిరునాళ్ళపై రాసిన పద్యం చదవగలిగాను. నాటి సంరంభాన్ని నరసింహకవి చక్కగా అక్షరాల్లో పొదిగారు!

సుజాత వేల్పూరి said...

కోటప్ప తిరణాలకు వచ్చిన బ్లాగ్ మిత్రులదరికీ ధన్యవాదాలు!

ముందుగా నేను దాసరి నారాయణ రావు గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆ పాట వినక పోతే కనీసం కోటప్ప కొండ పేరు కూడా తెలీని వాళ్లు ఉండేవాళ్ళన్నమాట

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
దగ్గర్లో ఉండి మీరూ వెళ్ళక, దూరాన ఉండి నేనూ వెళ్ళక...కోటప్ప ఏమనుకుంటాడు చెప్పండి? :-))

లలిత గారూ,
నచ్చిందా మా కొండ? కాళ్ళు లాగేస్తున్నాయి కదు! ఇంద...ఈ కొబ్బరి నీళ్ళు తాగండి! జాగ్రత్త, మా కొండ మీద కోతులెక్కువ, బోండాం లాక్కుపోగలవు! :-)


తృష్ణ గారూ,మీరు విజయవాడలో ఉండి కూడా, మీరెప్పుడూ కోటప్ప కొండ ఇదేనా అంటుంటే నాకు హాశ్చర్యం!!!

సుజాత వేల్పూరి said...

రమణ గారూ,
థాంక్యూ!

రాజ్, థాంక్యూ! మీరు వెళితే బోల్డన్ని మంచి ఫుటోలు తీస్తారు తెల్సా! దగ్గర్లో ఓగేరు వాగు కూడా ఉంది.

శ్రీరామ్‌గారూ,
ఆరు సార్లు ఎక్కి దిగారంటే ఆ తర్వాత ఏమి జరిగిందో ఎలా అడుగుతానండీ? ఊహించుకుంటాను గానీ! ఈ మధ్య ఎప్పుడూ వెళ్ళినట్టు లేదు మీరు కూడా? నేను ఏడాది క్రితం, పండక్కి కాదు గానీ విడిగా వెళ్ళాను.

అవునూ, మీరేంటి, బ్లాగులు మొదలు పెట్టి అలా ఏమీ రాయకుండా వదిలేశారు? త్వరలో పోస్టులు చూపించండి మాకు!

సుజాత వేల్పూరి said...

మురళీధర రావు గారూ,
మీరు మరింత సమాచారమూ, నరసిమ్హ కవి గారి సీస పద్యమూ జోడించి కోటప్ప కొండ తిరణాలకు మరింత పండగ శోభ తీసుకువచ్చారు. పద్యాన్ని కాపీ చేసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు! ఎప్పటి లాగే మీ వ్యాఖ్య వివరణాత్మకంగా ఉంది.

పద్మ గారు,వాసు గారు,raamuగారు,సౌమ్య
టపా ఫొటోలు నచ్చినందుకు ధన్యవాదాలు!

SNKR గారూ, ఏంటి మీదీ కాకినాడేనా? మరైతే ఎవరో రాసే దాకా ఎందుకు, మీరే రాయకూడదూ? పన్లో పని మీరు బ్లాగు మొదలెట్టినట్టు కూడా ఉంటుంది. మీ వూరి గురించి మీరు చెప్పుకున్నట్టూ ఉంటుంది?

ఓడరేవుండాలంటే సముద్రం ఉండొద్దండీ? మా వూర్లో కృష్ణా కాలవలే ఉన్నాయి. కొండ దగ్గర మాత్రం కావాలంటే ఓగేరు (ఓంకార నది)వాగు ఉంది :-)

సుజాత వేల్పూరి said...

శైలజ గారూ,
థాంక్యూ! ఈ టపా More informative and more journalistic టపా అండీ! ఇందులో పర్సనల్ కోణం లేదు. సరదా నేచరూ లేదు.
ఇక కోతుల ముచ్చట అంటారా? ఇదిగో...

పోయినేడాది శివరాత్రికి ఇంట్లో కూచుని కొండను ఊహిస్తూ..ఒక సరదా టపా దాదాపు ఏడుస్తూ (కొండ చూడలేకపోయానని) రాశాను. ఇందులో కోతుల సంగతి కూడా ఉంది చూడండి వీలైతే!

http://narasaraopet-bloggers.blogspot.in/search?updated-max=2010-03-20T22:12:00%2B05:30max-results=1start=7by-date=false

రవి గారూ, మీరు పెట్టిన ఫొటోలు చూశాను. ప్రభలు చాలా బాగున్నాయి. మీరు ఒకడుగు ముందుకేసి రికార్డింగ్ డాన్సుల (అమ్మాయిలు లేరనుకొండి)పెట్టారే!!

వేణు గారూ, థాంక్యూ!

రమణ said...

బాగుంది. మా ఊరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకటి లేక రెండు ట్రాక్టర్లు వేసుకొని కోటప్పకొండ తిరునాళ్లకు వెళతారు. కనీసం 80 కిలోమీటర్లు ఉంటుంది దూరం. నేను ఇంతవరకు వెళ్లలేదు :(. మాకు కొంచం దగ్గర ఉండే కొండపాటూరు తిర్ణాళ్లకు మాత్రం వెళ్లాను.

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
Vinay Chakravarthi.Gogineni said...

మీ writing skills excellent అండి....
నేను ఎమన్నా ఇలా రాద్దాం అనుకుంటే at least 2 lines కూడ రాయలేను.....

post బాగుంది.........

rajachandra said...

chala chala baga rasaru andi.. edo patalo vinnanu(kotappa kondaku vastanani mokku kunna) tappa.. eppudu chudaledu.. ide first time chudatam..
ee madhyakalam lone nenu kuda blog rayadam start chesanu andi.. milanti varu na blog chusi salaha iste naku use avutundi ..
http://rajachandraphotos.blogspot.in/

Vinay Chakravarthi.Gogineni said...

entandi....kottagaa emee raayaledu...
teerika dorakadam leda.?

Chennakesava Reddy Durgempudi said...

wow superr

YRRAO said...

బాగుందమ్మా సుజాతా
నేను తెలుగు మీ నుండి నరసరావుపేటకు సంభందించిన విషయాలు తెలుసుకోవాలని ఉంది.అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే నా సెల్ నెం. 9440527412కు మీరు మెసేజ్ ద్వారా తెలిపితే నేను మాట్లాడగలను.

తెలుగోడు_చైతన్య said...

ఎలా ఉండడమేంటి సుజాత గారు మీ టపా కూడా అన్ని చిత్రాలతో కోటప్పకొండ అంత ఎత్తు ఎదుగుతుంది. మా మనసుల్లో తద్వారా వచ్చే గాలి పరిమళాల భావాల హాయిని రేకిస్తుంది...ధన్యవాదాలు.

శ్యామలీయం said...

అద్భుతం.
(ఇంకా నేను ఏమన్నా వ్రాస్తే, అది అధికప్రసంగం అవుతుంది.)