Pages

Tuesday, August 10, 2010

అయ్యో,మా వూరి గూడు రిక్షా!





మా వూరి గూడు రిక్షాలో ప్రయాణం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది!వెన్నెల రాత్రుల్లో మనం రోడ్డు మీద గూడు రిక్షాలో ప్రయాణిస్తూంటే మా వూరి ఆచారం ప్రకారం కరెంటు పోయి వీధిదీపాలన్నీ మూగవోయినపుడు..చుట్టూ వెలిగిపోతున్న వెన్నెల్లో రిక్షా చక్రాలకుండే మువ్వలు చక్రం తిరిగినపుడల్లా ఒక చక్కని టైమింగ్ తో ఘల్లు ఘల్లునే ధ్వని ఎంతో శ్రావ్యంగా ఉంటుంది.




సినిమాకెళ్ళాలన్నా, ఊళ్ళో ఉన్న చుట్టాలింటికి వెళ్ళాలన్నా , పాతూరు శివాలయానికెళ్ళాలన్నా, PWD ఆఫీసు దగ్గరలో నాగార్జున సాగర్ కుడికాలవొడ్డున ఉన్న శివాలయానికెళ్ళాలన్నా...మల్లమ్మ సెంటర్ కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా ఇంటి నుంచి నాలుగడుగులు ముందుకేసి "తిరపతీ" అనో "కొండబాబూ" అనో "మస్తాన్" అనో కేక వేస్తే చాలు ఠంగ్ మని బెల్లు కొడుతో ముగ్గుర్లో ఎవరో ఒకరు ప్రత్యక్షం అయిపోయేవాళ్ళు.

వీళ్లు ముగ్గురూ మా ఆస్థాన రిక్షా వాళ్ళు. చిన్నప్పటినుంచీ  తెలిసిన వాళ్ళు. మొన్న మొన్నటిదాకా హైద్రాబాదు నుంచి మా వూరెళ్ళినపుడు పల్నాడు బస్టాండ్ లో ఇంకా బస్సులోంచి దిగకముందే బస్సెక్కేసి సామాను అందుకుని నాకంటే ముందే దిగేసేవాళ్ళు.



మా వూరి రిక్షాలన్నీ మంగళగిరిలో తయారవుతాయి. ప్రతి రిక్షాకీ అటూ ఇటూ ఎంచక్కా ఎంటీవోడూ,నాగేస్రావూ,కిష్ణా,సోబనబాబూ,వాణీశ్రీ,జైప్రదా,జైసుదా,స్రీదేవీ ఇత్యాదులంతా రంగురంగుల్లో కళకళ్లాడిపోతుంటారు. రిక్షా లోపల కూచున్నవాళ్ళు చూసుకునేందుకు అటూ ఇటూ అద్దాలూ!

 అదేంటో విచిత్రం,మంగళగిరిలో తయారయ్యే ఈ రిక్షాలు గుంటూరు దాటి మా వూర్లోనూ,పిడుగురాళ్ల ఇతర ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండే గుంటూర్లో మాత్రం ఉండవు. అక్కడ స్టాండ్ రిక్షాలు అంటే ఈ బొమ్మలో లాంటి రిక్షాలుంటాయి.నాకు మాత్రం మా వూరి గూడు రిక్షాలే హాయిగా,సౌకర్యంగా ఉంటాయి.





అర్థ రాత్రయినా అపరాత్రయినా ఎక్కడికైనా దొరికే ఏకైక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మా వూరి రిక్షా బండి!


ఇదంతా ఒకప్పటిమాట.


ఇప్పుడు ఈ బండి పరిస్థితి ఇలా లేదు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన ఆటోలు రిక్షా బండి గుండె మీదినుంచి నడుచుకుంటూ పోవడంతో దిక్కుతోచక దారి తప్పిపోయింది. వూర్లో ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్ళినా ఆటోలో(పదిమందిని ఎక్కించుకుంటాడుకదా మరి)ఆరేడు రూపాయలకు మించకపోవడం,రిక్షాకంటే వేగంగా వెళ్ళే సౌకర్యం ఉండటంతో చుట్టుపక్కల పల్లెటూళ్ళకు వెళ్ళేవాళ్ళు సైతం ఆటోలకే ఓటేశారు.

రిక్షా చక్రం తిరగబడింది.

ఇప్పటికీ మా వూర్లో రిక్షాలున్నాయి! కానీ ఇదివరకటి సంఖ్యలో మాత్రం కాదు!


ఎప్పుడు వూరికెళ్ళినా ఆటోలోవద్దనీ,రిక్షాలోనే తిరుగుదామనీ ఏడ్చి గొడవపెట్టే మా పాపకోసం తిరపతినో,మస్తాన్ నో అందుబాటులో ఉండమని చెప్తాను. ఆ మధ్య వూరికెళ్ళినపుడు తిరపతి రోడ్డుమీద కనపడితే రిక్షా ఏదీ అనడిగాను.


                   రిక్షాలో ఉంది మా పాప సంకీర్తన ఏడాది వయసులో ....

                                                             
"తీసేశానమ్మా! ఇప్పుడేవరూ రిచ్చా ఎక్కట్లేదు తల్లా! అంతా ఆటోలమీద తిర్గేవాళ్ళే! అద్దె కట్టలేక తీసేశాను"అన్నాడు.


"మరెలా ?(బతుకుతున్నావూ)?" అన్నాను ఇంకేమనాలో తోచక!


"పంటల కాలంలో పొలాలకు కావలి ఉంటున్నాను!పంటలు లేనికాలంలో సత్యనారాయణ స్వామి గుడి ఊడ్చి,తోటపని సూస్తన్నా"అన్నాడు తిరపతి ఏ భావమూ లేకుండా!


"మరి మస్తానో?"

"మస్తానుకు గుండెజబ్బమ్మా! రిచ్చా తొక్కుదామన్నా ఎక్కేవాళ్ళు లేక వాడూ తీసేశాడు. శీనయ్య చిల్లరకొట్లో పొట్లాలు కడతన్నాడు.మందులకన్నా కావాలగా?"అన్నాడు తిరపతి సుబ్బారావు కొట్లో బీడీలు తీసుకుంటూ!

గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు భారంగా ఉంది. ఏడుపేమో రాదు. బాధేమో తగ్గదు.

ఏమి చేయగలం ఈ నిర్భాగ్యుల కోసం! ఇన్నాళ్ళు రిక్షాని నమ్మి ఇపుడు సడన్ గా ఇలా దిక్కు లేని పక్షుల్లా...

ఎందుకో చెప్పలేనంత దిగులేసింది.


రిక్షాల సంఖ్య ఇప్పుడు మా వూర్లో బాగా తగ్గిపోయింది.అప్పుడెప్పుడో నేను పుట్టకముందు రిక్షాల పోటీలు కూడా జరిగేవంట!


ఇప్పటికీ మా వూరెళితే ,ఎక్కడికెళ్ళాలన్నా మా అమ్మాయి డిమాండ్ మేరకు గూడు రిక్షానే ఎక్కి తిరుగుతాం!



ఒకసారి ఒక కథ చదివాను. కృష్ణా నది కి రెండువైపులా ఉన్న రెండు వూళ్లవాళ్ళు వంతెన లేక నానా ఇబ్బందులూ పడుతుంటారు.నాటుపడవలే గతి అవతలితీరం చేరాలంటే! ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కృషి ఫలితంగా ఎలాగో వంతెన వస్తుంది.రెండు వూళ్ళ మధ్యా దూరం రెండు కిలోమీటర్లకు తరిగి పోతుంది.కానీ ఇదివరలో పడవలు నడుపుతూ పొట్టపోసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు పని లేక రాళ్ళెత్తేపనికి పోతూ ఉంటారు.


ఈ కథ ఎవరు రాశారో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి!


తిరపతి మాటలు వింటుంటే ఈ కథే గుర్తొచ్చింది. ఏమీ చేయలేని అశక్తతతో చిన్నప్పుడు స్కూలు కు తీసుకెళ్ళినందుకు   కృతజ్ఞతగా(అనుకుంటూ) తిరపతికీ,మస్తానుకూ కొంత డబ్బు మాత్రం ఇచ్చి రాగలిగాను.

పై ఫొటోలో రిక్షా కర్టెసీ తిరపతి

Monday, June 7, 2010

సుబ్రహ్మైక్యం: వీ మిస్యూ స్వామీ :(

"ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా, సొంత ఊరు కన్నవారు అంతరాన ఉందురోయ్" అంటాడు ఒక కవి! అదే పాటలో "గాయ పడిన హృదయాలకు జ్ఞాపకాలే అతిధులోయ్" అని కూడా ఓదారుస్తాడు. గుళ్ళో అడుగు పెడుతుండగానే "ఏవమ్మా!"అంటూ ఆప్యాయంగా పలకరించే ఆ గొంతు ఇక వినిపించదని ఊహించుకోవడం కష్టంగానే ఉంది. తప్పించుకోలేని విషయాల్లో మరణం ప్రధానమైనది కాబట్టి మనసు వగస్తున్నా, కనులు తడుస్తున్నా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని  నిస్సహాయ స్థితి!

సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా!

వారి కుటుంబానికి, పిల్లలకు సానుభూతి!

-సుజాత
***   ***   ***
రామాయణంలో అందరికన్నా పిల్లలకు నచ్చేది హనుమంతుడు. కథ మొత్తాన్నీ చూడక పోయినా, హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సన్నివేశాన్ని మాత్రం పిల్లకాయలు తప్పకుండా చూస్తారు. అలాగే మా పిల్లకాయలకు భక్తి అనే పండుని ప్రత్యక్షంగా పంచి పెట్టే సుబ్రహ్మణ్యం గారు లేరంటే ఒక్క కన్నీటి చుక్కన్నా కార్చాల్సిందే.

 బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, యుద్ధ, అని మిగతా ఐదు కాండలకూ పేర్లిచ్చినా, హనుమంతుడు హీరో అయిన అయిదో కాండను మాత్రం సుందర కాండ అన్నారు వాల్మీకి. ఎందుకా ప్రత్యేకమైన పేరు? ఎందులోనిదా సౌందర్యం? సీతమ్మ వారు లేని శ్రీరాముని జీవితంలో లేని సౌందర్యమెక్కడిది? అడుగడుగునా రాముని దు:ఖాన్ని నింపుకున్న కిష్కింధా కాండ దాతగానే వచ్చే కథకు ఆ పేరు పెట్టటంలో ఔన్నత్యమేమిటి?

హనుమ భక్తి సౌందర్యం!
భర్త విషయం తెలుసుకున్న సీతమ్మ ఆనందం సౌందర్యం!
రావణుని కొలువులో హనుమను కాపాడిన విభీషణుని మానవత్వంలోని సౌందర్యం!
సీతమ్మ జాడ తెలుసుకున్న శ్రీరాముని ఆనందంలోని సౌందర్యం!
ఎటు తిరిగి ఎటొచ్చినా హనుమ రామ భక్తి సౌందర్యాన్ని తెలిపేది కనుకనే అది సుందర కాండ అయింది.

ఎవరైనా రామ భక్తులే. శ్రీరామ భక్తులే. ఆ భక్తి సౌందర్యాన్ని ఆవిష్కరించింది కాబట్టే అది సుందర కాండ అయింది. అలాంటి భక్తి సౌందర్యాన్నావిష్కరించి చూపిన మహానుభావులు సుబ్రహ్మణ్యం గారు.

నరసరావుపేటంటే గడియార స్థంభం, ఆంజనేయ స్వామి గుడి, సత్యనారయణా టాకీసూనూ. అఫ్కోర్స్ కల్తీ (మందులు) కూడాననుకోండీ. కానీ కల్తీ లేనిదేదైనా కావాలంటే నేరుగా మా స్టేషన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాల్సిందే. పూజారి సుబ్రహ్మణ్యం గారి ఆదరాన్ని చవిచూడాల్సిందే. మరి ఆయన మరణాన్ని మా హనుమంతుడెలా స్వీకరిస్తున్నాడో? చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, సుందర కాండ సౌందర్యాన్ని, భక్త జనానికి పంచే అలాంటి మనిషినెక్కడా చూడలేదు (మాదారంలో ఈ మధ్యన అలాంటి అభిమానాన్ని చూశాను) ఇక ముందు చూడబోము. వీ మిస్యూ స్వామీ! ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియటం లేదు.
***   ***   ***

ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి లంకను చేరాట్ట! ట్ట నే. పెద్ద వాళ్ళు చెపితేనే కదా తెలిసేది. ఆయన భక్తుడైన సుబ్రహ్మణ్యంగారు, 

భక్తి సాగరాన్నానందంగా ఈదులాడి, స్వర్గాన్ని చేరారిప్పుడు. స్వామినీ, భక్తులనూ శోకసాగరంలో ముంచి. కన్నీరు కార్చాలా? గుండె దిటవు చేసుకోవాలా? నిట్టూర్చాలా? ఏమి చేసినా, ఎన్ని చెప్పినా ఆయన లేరన్నది నిజం. ఇక ముందు ఆంజనేయ స్వామి గుడిని ఆయన లేకుండానే చూడాలి.

ఇవాళ ఉదయం ఆయన పోయారట. మధ్యాహ్నం సుజాత గారు ఫోను చేసి చెపితే తెలిసింది. ఈ మధ్యనే ఆయన పెద్ద కుమారుడు చనిపోయారని తెలిసి వెళ్ళి పలుకరించబోతే, నాకన్నా ముందు స్వామిని చేరుకున్నాడని కాస్త అసూయగా ఉందయ్యా అని నవ్వుతూ చెప్పారు. కానీ ఆయన నవ్వులో ఉన్న విషాదం నన్ను దాటిపోలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆంజనేయ స్వామి గుడంటే స్టేషన్ రోడ్డులోదే. పూజారంటే సుబ్రహ్మణ్యం గారే. వచ్చిన ఏ భక్తుడినీ అసంతృప్తిగా పోనివ్వరు. నేను ఎప్పుడు ెళ్ళినా "ఏం ఆచార్యులుగారూ, పెరుమాళ్ళకు పూజాదికాలు అన్నీ చేశారా?" అని అంటారు. నేను నవ్వుతూ "మీకన్నా బాగా చెయ్యగలమా స్వామీ," అని అంటే... నాదేముందయ్యా! అన్నీ ఆయనే చేయించుకుంటారు," అనే సమాధానం.  ఎందుకు స్వామీ అందరు దేవుళ్ళవీ గాయత్రి చదువుతారు ఇక్కడ అంటే ఆయన చెప్పిన సమాధానం నాకు బాగా నచ్చింది. అందరు దేవుళ్ళూ ఒక్కటే అనో, జనాన్నిసంతృప్తి పరచటానికో అని చెప్పి ఉంటే ఆయన గొప్పతనమిక్కడ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడికొచ్చే వారంతా స్వామి భక్తులైనా, వేరే దేవుని భక్తులైనా నా స్వామి వద్దకొచ్చే వారందరూ, నావాళ్ళే. నా వాళ్ళను సంతృప్తి పరచటం నా ధర్మం. ఎన్ని చేసినా నాకు ఆయనే దైవం. ఏ మంత్రం చదివినా నాకు కనిపించేది ఆంజనేయ స్వామే అని, నేను నమస్కారం చేసుకునేప్పుడు ఆయన  
ఓమ్ దామోదరాయ విద్మహే
రుక్మిణీ వల్లభాయ ధీమహి
తన్నో కృష్ణ: ప్రచోదయాత్!
అంటూ నువ్విక్కడికొచ్చినా హరే కృష్ణ అంటావు కదా అని నవ్వుతారు. ఆ నవ్వులు ఇక ఉండబోవు. ఆ కథలు చెప్పే మనిషి ఇక ఉండరు. ఇప్పటిదా నా అనుబంధం! ఇరవయ్యారో ఏట అడుగు పెట్టిన నాకు పాతికేళ్ళ అనుబంధం. నేను పసి వాడిగా ఉన్నప్పుడే నన్నెత్తుకుని వెళ్ళే వాళ్ళా గుడికి. ఆకు పూజంటే ఆయన చేయాల్సిందే నాకు. ఎన్ని చోట్ల ఆకు పూజ చేయించినా సుబ్రహ్మణ్యం గారు చేసినట్టు చేశారా అనే కంపారిజను. నా జీవితంలోని మూడు ముఖ్యమైన సంఘటనలక్కడ జరిగాయి. ఎన్నెన్నో ఙ్ఞాపకాలు. ఇక అవే వారి తీపి గురుతులు. 

భగవంతునికన్నా భాగవతులే ముఖ్యమని శ్రీవైష్ణవంలో చెపుతారు. ఆ లెక్కన గుడిలోని స్వామికన్నా వీరే ముఖ్యులు. 

మనం ప్రార్థించినా, చక పోయినా అలాంటి వ్యక్తి ఆత్మకు ఎల్లప్పుడే ఆ ఆంజనేయుడే అందిస్తాడు. 

ఏడ్వలేక,

గీతాచార్య
***   ***   ***

రాస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. ఫోనులో విషయం విన్న నాకు మొదట్లో పెద్దనిపించలేదు కానీ, పేట వెళ్ళి అటు వైపు చూశాక మనసు మెలిదిరిగిపోయింది నాకు. ఇక వ్రాయలేను. 

పేట్రియాట్స్! వీ మిస్ హిం కదూ... మళ్ళా ఎలాగైనా ఆయన తిరిగొస్తే బావుణ్ణు

Saturday, March 20, 2010

ది పల్నాడు లింక్ ఎక్స్ ప్రెస్!

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు తేళ్ళు

పలనాటి సీమల పల్లెటూళ్ళు



అని శ్రీనాధుడు వాపోయాడంటే వాపోడూ! ఎప్పుడైనా హైద్రాబాదునుంచి మా వూరెళుతుంటేనో, మా వూర్నుంచి హైద్రాబాదొస్తుంటేనో పల్నాడు ప్రాంతమంతా కనపడే దృశ్యాలు....మైళ్ళకొద్దీ వ్యాపించిన సున్నపురాతి నేలలు,నేల లోంచి పొడుచుకొచ్చిన బండరాళ్ళు,కృష్ణా నది ఒడ్డున అక్కడక్కడా కనపడే సిమెంట్ ఫాక్టరీలు,వాటి ప్రభావంతో చుట్టు పక్కలంతా తెల్లటి దుమ్ము దుప్పట్లు కప్పుకున్న తుమ్మ చెట్లు,శీతాకాలంలోనూ వీచే వేడి గాలులు,ఎర్రెర్రగా పండుమిరప, కనకాంబరాల చేలు..!



పెళ్ళయి... పశ్చిమ గోదావరి ఆకుపచ్చ అందాలు చూసే వరకూ పై దృశ్యాలన్నీ మామూలుగా కనిపించేవి.అయినా ఇప్పటికీ ఆ దారెంట వెళ్తుంటే సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథలో మల్లిక్ చెప్పినట్లు గుండెలో వీణలూ సితార్లూ మోగుతాయి.గట్టిగా ఆ గాలి గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది.


   పల్నాడు ప్రారంభంలోనే పలకరించే నాయకురాలు నాగమ్మ కాంస్య విగ్రహం!





తెల్లారితే పల్నాడు జనమంతా ఏవో ఒక పన్ల మీద పేటలోనే ఉంటారాయె!అందుకే మా వూరు మధ్యగా పోయే NH9 ని మేము ముద్దుగా "పల్నాడు రోడ్"అని పిల్చుకుంటాం!ఇంకా పలనాడు ట్రావెల్సూ, పల్నాడు బ్రదర్స్ పాన్ బ్రోకర్స్,పల్నాడు మడత మంచాలు అద్దెకిచ్చే డార్మెట్రీలు, పల్నాడు ఫైనాన్స్,పల్నాడు అది పల్నాడు ఇదీ.... ఇట్లా బోలెడు పల్నాడు సరుకు ఊరినిండా!


             కారంపూడి ఊరు మధ్యలో కొలువైన బ్రహ్మనాయుడు


పల్నాడు చరిత్రంతా దాయాదుల కథ కావడంతో ఎన్ని సార్లు చదివినా బోలెడు కన్ ఫ్యూజన్ తో మర్చిపోతాను. మా వూరిపక్క జనాల్లో చాలామంది (పాతవాళ్ళు) పల్నాడు చరిత్రలోని వ్యక్తుల పేర్లతో కనపడటం ఆశ్చర్యం లేదు. మాకు పాలు పోసే ఆయన పేరు "బాలచంద్రుడు"! మా అత్త పేరు పేరిందేవి! నాన్న ఆఫీస్ లో అటెండర్ అలరాజు. నాగమ్మలకైతే కొదవే లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు! పెద్ద నాగమ్మ, చిన్న నాగమ్మ! అంత పవర్ ఫుల్!పల్నాడు బయటెక్కడో ఉన్న మా వూర్లోనే ఇంతమంది ఉంటే ఇక నిజంగా పలనాడులో ఎంతమంది ఉంటారో ఇలాంటి పేర్ల వాళ్ళు!


                                        మాచర్ల చెన్నకేశవ స్వామి


మా వూరాయన ఒకాయన మా కాలనీలోనే ఉంటున్నాడని మాటల మధ్యలో తెలిసి పేరేమిటని తెలుసుకుంటే ఆయన కాస్తా బ్రహ్మనాయుడై కూచున్నాడు. 



అచ్చంగా పల్నాడులో నివసించకపోయినా మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయం చూడ్డం,దాచేపల్లి బ్రిడ్జ్ దగ్గర నాగులేరుని చూడ్డం, తొలేకాదశికి బ్రహ్మ నాయుడు తపస్సు చేసుకోడానికెళ్ళాడని చెప్పే గుత్తికొండ బిలం చూడ్డం(లోపలికెళ్లాలంటే మాత్రం చచ్చేంత దడ!) ఇష్టమైన పని నాకు!

ఆ బిలానికి అంతు అనేది లేదనీ, బాగా లో...పలికి వెళితే అక్కడ నిజంగానే తపస్సు చేసుకుంటూ మునులు ఉంటారనీ అంటారు. అంత దూరం ఎవరూ వెళ్ళలేదు కాబట్టి ఎంతవరకూ నిజమో మరి!ఆ మధ్య మావూరెళ్ళినపుడు తీరిగ్గా ఆగుతూ ఆగుతూ ఫొటోలు తీసుకుంటూ తిరిగొచ్చాను హైద్రాబాదు.


                          చెన్నకేశవ స్వామి ఆలయంలోని నాగశాసనం!




దాచేపల్లి బ్రిడ్జీ దగ్గర ఆగగానే అక్కడ ఒక తోపుడు బండిమీద బాగా పండి పగిలిన సీమ చింతకాయలు బోల్డు కనపడ్డాయి... తెల్లని విత్తనాల మీద గులాబీ చారల్తో!ఎగబడి కొన్నామనుకోండి! పక్కనే "శ్రీ వీరాంజనేయ కిళ్ళీ షాపు" లో గోలీ సోడా తాగాము. షాపు పక్కనే ఒక బోర్డు మీద ఇలా రాసుంది .

"ఇచ్చట పెళ్ళిళ్ళకు ,శుభకార్యాలకు కిళ్ళీలు అందంగా(?)కట్టబడును. తిరుపతి,కాళహస్తి,శ్రీశైలం వెళ్ళు బస్సులు ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఇచ్చట నుంచి బయలుదేరును"


                      మబ్బులు కమ్మిన ఆకాశం కింద సాగర్ కృష్ణ!


ఆ పక్కనే సయ్యద్ పాషాగారి బోన్ సెట్టింగ్ సెంటర్ గాజు తలుపుల మీద పవన్ కళ్యాణూ,ఇలియానా విరిగిన ఎముకలకు పిండి కట్లు వేయించుకుని ఫుల్ మేకప్ తో ఆందంగా నవ్వుతూ కనపడ్డారు.(ఇదే హైద్రాబాదులో అయితే షారుక్ ఖానూ,ఐశ్వర్యా రాయీ ఈ కట్లు కట్టించుకుని కనపడతారు)



నెమ్మదిగా అలా ఆ వూర్లు దాటుకుంటూ సాగర్ అందాలు కూడా చూస్తూ ఎప్పటికో హైద్రాబాదు చేరాము.

Tuesday, February 9, 2010

మెట్లదారిలో కోటప్ప కొండెక్కి...!



ఈ రోజు ఏకాదశి. మా కోటప్ప కొండ దగ్గరి దృశ్యాన్ని ఊహించుకుంటే రెక్కలుంటే బావుండు, ఎగిరెళ్ళి అక్కడ వాలిపోదామనిపించేంత తిక్కగా ఉంది! అక్కడ , త్రికోటేశ్వరుడిని దర్శించుకోడానికొచ్చిన వేలాది, లక్షలాది మనుషుల మనసుల నిండా ఆ మహాదేవుడే నిండిపోయి ఉంటాడు. తిరణాల తిరణాలే...భక్తి భక్తే! అంతా కోలా హలం! అంతా సందడి, అంతా సరదా!(తిరునాళ్ళు సరైన పదమనుకుంటా గానే మేము తిరణాల అనే అంటాం మరి)




ఊళ్ళోనే ఉన్నా ఏడాదికొక్కసారైనా కనపడని బంధువులూ, స్నేహితులూ పరిచయస్తులూ అంతా కోటప్ప కొండ తిరణాల్లో కలుస్తారని మా వూర్లో జోకుంది.






మహాశివరాత్రి పండగరోజైతే చుట్టు పక్క పల్లె జనాలంతా ట్రాక్టర్లూ, ఎడ్లబండ్లూ, ప్రభల్తో వస్తారు కాబట్టి మరీ రద్దీగా గా ఉంటుందని సాధారణంగా మా టౌను వరకూ ఏకాదశి రోజే కొండ మీద ప్రత్యక్షం అవుతుంది.పల్లెటూరి జనాల రద్దీని తట్టుకోలేం అనేది మరో భావన! అక్కడికి మేమేదో క్లాసూ,పల్లెటూరి జనాలంతా మాసూ అని మాకో పెద్ద భ్రమ!



దాదాపు తొమ్మిదివందల మెట్లు! స్నేహితులు, బంధువులు,ఇరుగు పొరుగులు అందర్తో కలిసి మెట్లదారిలో కొండెక్కడం అప్పట్లో ఒక పెద్ద గొప్ప! ఫాషన్, సరదా, సంప్రదాయం, ఇంకా చాలా!




తిరణాలంటే చెప్పేదేముంది! వందల సంఖ్యలో రాత్రికి రాత్రే వెలసే దుకాణాలు,లారీల్తో వచ్చి వాలే చెరుకుగడలూ,రంగుల రాట్నాలు, అంతా సంతోషమే, అంతా ఉల్లాసమే!



కొండమీదేమో ఇవేవీ పట్టని ఆదిభిక్షువు!



* * *



అసలు మా వూరికీ, మహాశివుడికీ గొప్ప అనుబంధం ఉంది. ఊరిమధ్యలో భిక్షా పాత్రతో గంభీరంగా రోడ్డు మధ్యలో బైఠాయించిన శివుడి విగ్రహాన్ని మీరు ఇంకెక్కడైనా చూశారా? చూడకపోతే కొంచెం పక్కకిచూడండి...కనపడతాడు..మా వూర్లోని మహాశివుడు. మూడోకన్ను జనం మీద పడకుండా భిక్షాపాత్రతో నీరు తాగుతున్నట్లు అది కొంచెం ముఖానికి అడ్డంగా వచ్చేట్లు చెక్కాడు శిల్పి సూరిగారు.



మా వూరి చరిత్రే పాతూరు శివాలయం వీధి నుంచి మొదలైంది ! ఆ భీమలింగేశ్వరాలయానికి 1100 యేళ్ళ చరిత్ర ఉంది. ఊరికి కాస్తంత చివరగా త్రికూట పర్వతం మీద కొలువైన కోటయ్య స్వామి కూడా యేటా లక్షలకొద్దీ భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఊరు చుట్టుపక్కల పల్లెల్లో ప్రతి నాలుగైదు ఇళ్ళకో ఒక కోటేశ్వర్రావో, కోటయ్యో, ఉండటం,వాడిని "కొండ"అని పిలవడం మామూలే!





శివరాత్రికి కొండకెళ్ళాలని శివరాత్రి ముగిసిన మర్నాటినుంచే ఎదురు చూసేవాళ్ళే ఊర్నిండా! చిన్నప్పుడు తప్పిపోతామని మమ్మల్ని ఇంట్లో పడేసి, పెద్దవాళ్లంతా కొండకెళ్ళిపోయేవాళ్ళు గానీ కాలేజీ కొచ్చాక పోన్లే పాపమని మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. మావయ్యలు,పిన్నులు,అత్తలూ వీళ్ళంతా తయారు.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీల్లో , చిలకల్లా వాళ్ల వెంటే! చిలకాకు పచ్చ పట్టు లంగా మీదికి పింక్ రంగు వోణీ(లంగా అంచు రంగన్నమాట),రాణీ పింక్ రంగు పట్టులంగా మీదికి నేవీ బ్లూ వోణీ(ఏంటలా నవ్వుతారు,... ఇవి అప్పట్లో భలే హాట్ కలర్ కాంబినేషన్లు తెల్సా) పసుపు పచ్చ పట్టులంగా మీద......తెలుసుగా మెరూన్ కలర్ వోణీ! ఈ రంగుల్లో బోల్డన్ని సీతాకోకచిలకలు!



అన్నయ్యలు,మావయ్య కొడుకులూ మిగతావాళ్ళంతా పోజు కొడుతూ "వీళ్ళు చూడండ్రా,ఎలా గంగిరెద్దుల్లా తయారయ్యారో!.వీళ్ల పక్కన కూడా నడవొద్దురరేయ్"అనేసి కట్ట కట్టుకుని మాకంటే ముందే కొండెక్కేసేవాళ్ళు.



క్రిక్కిరిసిన కొండ మెట్లదారిమీద ఇరవై మెట్లెక్కేసరికి "ఇక నావల్ల కాదు"అనిపించేది.ఐదునిమిషాలాగి మళ్ళీ ఎక్కడం! పచ్చటి ప్రకృతి పరుచుకున్న కొండమీద మెలికలు తిరిగే మెట్లూ, మధ్య మధ్యలో ఆకు దొనెల్లో కుంచెమంటే కుంచెమే పులిహోర,మంచినీళ్ళు అందించే సత్యసాయిసేవా సమితివాళ్ళూ(వాళ్ళలో మాకు తెలిసినవాళ్ళుండి,మాక్కొంచెం ఎక్కువ పులిహోర పెట్టేవాళ్ళు) పసి పిల్లల్ని భుజాలమీద కూచోబెట్టుకుని కొండెక్కే నాన్నలూ, కొంచెం ఆదమరుపుగా ఉంటే చేతిలో పొట్లాలో,అరటిపళ్ళో లాక్కెళ్ళిపోయే కోతులూ,నీళ్ళు కలిపిన పసుపు కుంకుమల బకెట్లతో మెట్ల పూజ చేస్తూ ఎక్కే వాళ్ళు, ఉన్నట్టుండి "చేదుకో కోటయ్యా చేదుకో"అని వినపడే భక్తుల కేకలు!





చిన్నప్పుడు మాకు అది "చేరుకో కోటయ్యా"అని వినపడి ఉషశ్రీని అడిగితే బాగోదని ధర్మ సందేహం అమ్మనడిగాం "మనం కదా కొండెక్కేది? ఆయన్ని 'చేరుకో" అనడమేమిటి?"అని!



అమ్మ ఆశ్చర్యంగా నవ్వేసి "అది చేరుకో..కాదు! చేదుకో! నూతిలో వేసిన చేద బకెట్ ని పైకి ఎలా సులభంగా లాగుతామో,అలా కొండెక్కే శ్రమ తెలీకుండా పైకి చేదుకోమని అడగడం అన్నమాట"అని చెప్పింది.


కొండమీద కనపడితే చాలు చేతిలో తినుబండారాలూ, జళ్ళో పూలూ లాక్కెళ్ళి పోయే కోతులు =తయారు. చేత్లో కొబ్బరిచిప్పలు చూశాయా...వెంటే వస్తాయి. రమ్మంటే దగ్గరికి వచ్చి చాలా స్నేహంగా తీసుకుంటాయి చేతిలో అరటి పళ్ళూ, కొబ్బరి చిప్పలూ! 



పండగ రోజు చుట్టుపక్కల పల్లెటూళ్ళనుంచి సింగారించుకుని వచ్చే ప్రభలు! గణపవరం,దేచవరం,రూపెనగుంట్ల,రావిపాడు,చల్లగుండ్ల,గామాలపాడు,నకరికల్లు,కళ్ళగుంట,ఒప్పిచర్ల,లింగంగుంట్ల,కేసనపల్లి, ఈ వూళ్ళన్నిటినుంచీ మైకు సెట్టింగుల్తో,ఎలక్ట్రిక్ దీపాలతో ట్రాక్టర్ల మీద వస్తాయి.((పండగ రోజు ఉదయం నుంచీ మర్నాడువరకూ మాకు కరెంట్ ఉండేది కాదు.మా ఇంటికి దగ్గర్లోని రోడ్డుమీదినుంచీ ఈ ఎలక్ట్రిక్ ప్రభలన్నీ వెళ్ళేవి)ఇదివరలో ఎడ్లబండ్లమీద వచ్చేవట)



ఆ ప్రభలు ఒక పెద్ద సందడి. పందాలు పడి ఒకరి కంటే ఒకరు ఎత్తుగా కడతారు కాబట్టి అవి పడిపోకుండా, వాలిపోకుండా ఉండటానికి బలమైన మోకులు(తాళ్ళు) ముందు, వెనకా కట్టి కొందరు అవి పట్టుకుని కొండదాకా నడిచి వస్తారు. ఎన్ని మైళ్ళయినా సరే! సంప్రదాయం ప్రకారం ఎద్దులతో కాసేపు ప్రభను లాగించి ఆ తర్వాత ట్రాక్టర్ కి కట్టేవాళ్ళు. ఆ ప్రభను ఏదైనా వూళ్ళో లంచ్ బ్రేక్ కోసం ఆపినపుడు అక్కడి ఆడవాళ్లంతా పెద్ద పెద్ద బిందెల్తో నీళ్ళు తెచ్చి ప్రభ ముందు "వారు" పోయడం చిన్నపుడు చూస్తుండేవాళ్ళం.



ఇదంతా ఎప్పటిదో పాత కథ!




ఆ తర్వాత మా వూరి మాజీ ఎమ్మెల్యే మంత్రిగారిగా కూడా ఉన్నపుడనుకుంటా కొండమీదికి ఫటా ఫట్ రాజమార్గం లాటి ఘాట్ రోడ్డు వేయించేశారు.(రాజు తల్చుకుంటే అని ఊరికే అన్నారా)ఇప్పుడు కింద నుంచి కొండమీదికి ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయల షాపులనుంచీ,చెప్పుల స్టాండ్ ల దాకా అన్నీ పక్కా దర్శనీయ స్థలాల్లో లాగానే కొండమీదే తయారయ్యాయి.నరసరావుపేట నుంచి కొండకెళ్ళేదారి NH5 కంటే నున్నగా అందంగా ఉంటుందిప్పుడు.  దారి పొడుగునా బోలెడన్ని ఇంజనీరింగ్ కాలేజీలు!  కొండపాదాల వద్దే టూరిజం డిపార్ట్ మెంట్ వారి కాటేజీలు..కళ్ళు చెదిరే అందంతో,ఏసీ సహా సకల సౌకర్యాలతో! అసలు ఇదొక రిసార్ట్ లా ఉందిప్పుడు.




ఘాట్ రోడ్డు ప్రతి మలుపులో కనువిందు చేసే పార్కులు,విగ్రహాలు!అంతా మారిపోయింది.అసలు కొండమీద గుడి కూడా మారిపోయింది. మూలవిరాట్ ని నేను గుర్తేపట్టలేదు. "ఇదేనా గర్భగుడి"అని ఆశ్చర్యపోయాను. కోటప్ప
మాత్రం నన్ను గుర్తుపట్టి "ఏందమ్మాయ్,ఎప్పుడొచ్చా? ఏందిట్ట మారిపొయ్యావు? ఈ మజ్జెన అవుపడట్లేదేంది?"అని మా వూరి యాసతో పలకరించాడనుకోండి!




సౌకర్యాల పరంగా కొండ ఇప్పుడెంతో మెరుగ్గా హాయిగా ఉంది కానీ ఘాట్ రోడ్డుపడటంతో మెట్లదారిని వాడేవారే కరువయ్యారు. పండగ సమయాల్లో మెట్లదారిన వస్తామనో,మెట్లపూజ చేస్తామనో ఎవరైనా మొక్కుకుంటే తప్ప!



ఏది ఎంతగా మారినా,ఎంత ఘనంగా రోడ్లూ గోపురాలూ కట్టినా మా కోటయ్య మాత్రం మారడు.





తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగులలుముతూనో,కరకు గర్జనల మేఘ మాలలకు మెరుపు హంగులద్దుతూనో, ఆ ఆది భిక్షువు చిద్విలాసంగా కొండకొచ్చేవారిని చిరునవ్వుతో పరికిస్తుంటాడు.



" కోటయ్య సావి మీద ఆన బెట్టి చెప్తున్నా"అని అలవోగ్గా అబద్ధాలాడేసే రాజకీయనాయకుల్ని సైతం అదే చిరునవ్వుతో చూస్తూ "నీ లెక్క తర్వాత చూస్తాన్లే"అంటాడు.



ఊరు ఊరంతా సంతోష సాగరమై కొండకు పరుగులు తీసే వేళ ఊరికి దూరంగా ,ఇక్కడ....ఆ మహాదేవుడి సన్నిధికి ఊహల్లోనే మెట్లదారిన కొండకు ప్రయాణమవుతున్నా!


అన్నట్టు, అద్దిరిపోయే ఫొటోలు తీసిందెవరో కాదు, నేనే!

ఎలక్ట్రిక్ ప్రభ ఫొటో ఇచ్చినందుకు గోగినేని వినయ్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు

Monday, January 11, 2010

వేణూ శ్రీకాంత్ పదో తరగతి జ్ఞాపకాలు




బాల్యం ఎవరికైనా అమృతప్రాయమే! ఎంత వయసు వచ్చినా తీయని జ్ఞాపకంలా  మిగిలేది బాల్యమే! చదువుకున్న స్కూలు, తిరిగిన వీధులూ, గోలీలాడుకున్న రోడ్లూ, ఎక్కిన చెట్లూ, దూకిన గోడలూ, ప్రాణంగా అనిపించే ఆనాటి స్నేహితులూ, గిల్లి కజ్జాలూ, బెత్తంతో కల్లో కొచ్చే ట్యూషన్ మాస్టారూ, అంతా.....అంతా అందమే, ఆనందమే!




నాతో నేను నా గురించి. అంటూనే తన అనుభవాల్లోకి, జ్ఞాపకాల్లోకి, కబుర్లు చెప్తూ చేయి పట్టుకుని మనల్ని కూడా నడిపించుకెళ్ళే భావుకుడు, మా వూరబ్బాయి వేణూ శ్రీకాంత్ తన పదో  తరగతి జ్ఞా పకాల్ని పంచుకుంటున్నారు చూడండి. మీరూ పదో క్లాసులోకి పరుగులు తీయండి.

***                                                                   ***                                                                 ***


ప్రతి వ్యక్తి జీవితంలోనూ గోల్డెన్ ఎరా అన తగిన బాల్యాన్ని నేను ఎక్కువ భాగం నరసరావుపేట లోనే గడిపాను. ఊహ తెలిసాక ఈ ఊరు వచ్చాము. అక్షరాభ్యాసం నుండి ఆరవ తరగతి వరకు ఇక్కడే చదివాను. అమ్మా, నాన్న ఇద్దరికీ బదిలీ అవడంతో ఏడు ఎనిమిది తరగతులు పిడుగురాళ్ళ లో చదివేసి మళ్ళీ తొమ్మిదో తరగతికి నరసరావుపేట వచ్చేసాను. నాలుగో తరగతి తర్వాత ఎప్పుడూ పేరెంట్స్ నాపై చేయిచేసుకోకపోయినా ఎందుకో నేను బలవంతపు బుద్దిమంతుడుగానే మిగిలిపోయాను.


అప్పటికీ కొన్ని కోతి వేషాలు వేసే వాడ్ని కానీ సాధ్యమైనంత వరకూ ఇమేజి డ్యామేజి అవకుండా జాగ్రత్త పడే వాడ్ని :-) పిడుగురాళ్ళలో ఎంతైనా హైస్కూల్ కదా మరి చిన్నపాటి కొమ్ములు మొలిపించుకుని ఐతేనేమీ అక్కడి స్నేహాల మూలంగా పరిచయమైన కొత్త ప్రపంచం వల్ల ఐతేనేమీ చదువును అటకెక్కించేశాను. అలాగే ఎలాగో తంటాలు పడి పది వరకూలాగాను కాని అమ్మకు నామీద ఖచ్చితమైన నమ్మకం ఏర్పడిపోయింది వీడు ఇలాగే చదివితే 10th క్లాస్ లో బోర్లా పడటం ఖాయం అని.




అదుగో సరిగ్గా అలాంటి సమయం లోనే అమ్మ పాలిటి ఆపన్న హస్తం, నా పాలిటి యమపాశం లాంటి పాండురంగారావు మాష్టారి ట్యూషన్ గురించి అమ్మకి తెలిసి పోయింది. రెండో రైల్వే గేట్ నుండి సరాసరి ప్రకాశ్ నగర్ వైపు వెళ్తూ రిజిష్ట్రార్ ఆఫీస్ తర్వాత లైన్లో ఎడమ సందులోకి తిరిగి చివరికి వెళ్తే అక్కడ పాండురంగారావు గారి డాబా ఇల్లు ఉండేది. ఇల్లుచిన్నదే అయినా చుట్టుపక్కల ఇళ్ళు ఏమీ లేకపోడం వల్ల ఒంటరిగా ఠీవీగా నిలుచున్నట్లు ఉండేది. ఓ నాలుగు మెట్లు ఎక్కి లోపలికి అడుగుపెట్టగానే ఎడమ పక్క డాబా మీదకు సన్న మెట్లు, అక్కడే ఎత్తుగా కట్తిన వరండానే కాకుండా ఇంకా బోలెడంత ఖాళీ స్థలం కూడా ఉండేది అమ్మాయిలు ఆ ఎత్తైన వరండాలోనూ మేమంతా కింద కూర్చునే వాళ్ళం.



పాండురంగారావు మాష్టరు గారికి పోలియో, సరిగా నడవలేరు, మెడకూడా కాస్త పట్టేసి ఉండటంతో చూడటం కూడా కాస్త వంకరగా కష్ట పడుతూ చూసేవారు మాములు వాళ్ళలా సులభంగా కదలలేరు. దీనివల్లనే మా ఊర్లో అప్పట్లో పేరుపొందిన స్వామీ, శ్రీహరి గార్లలా  కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

కానీ తను లెక్కలు మాత్రం చాలా బాగా చెప్పేవారు, లెక్కలే కాదులెండి అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్పేవారు. అప్పట్లోనే క్లాస్ ను గ్రూపులుగా విభజించి ఆరోగ్యకరమైన పోటీ పెట్టి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి అందరినీ బాగా చదివించడానికి ప్రయత్నించేవారు. మా అమ్మగారి బలవంతమ్మీద అందులో చేరిన నేను మొదటి రోజునుండీ మొద్దబ్బాయ్ ట్యాగ్ (కనపడని) మెడలో తగిలించుకుని తిరిగే వాడ్ని.



ఇంటిదగ్గర చేయమని ఇచ్చిన పని పూర్తిచేయగలిగే వాడ్ని కాదు దాంతో ట్యూషన్ మొదలయ్యే టైంకి ప్రతిరోజు బయటనుంచునే వాడ్ని. చదివినవి వేరే పిల్లలికి అప్ప చెప్పాల్సి ఉండేది నేను నిజాయితీగా మొత్తం పొల్లుపోకుండా చెప్పడానికి ప్రయత్నించి మధ్య మధ్య లో ఆగుతూ, పూర్తిచేయలేక రోజూ తిట్లు తినేవాడ్ని. అలా మొదటి యూనిట్ టెస్ట్ లు వచ్చాయి అందులో ఎవరి ప్రమేయం లేకుండా నా అంతట నేనే రాయడం కదా, నా ప్రయత్నం నేను చేశాను. దిద్దే రోజే కొందరు క్లెవర్స్ బ్యాచ్ మెచ్చుకోలుగా చూశారు, ఫలితాలలో మొదటి ఐదుగురిలో నేను ఉండటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది, మరి అప్పటివరకు చివరిబ్యాచ్ లో చివరి వాడ్ని కదా. ఈ పరీక్షల తర్వాత క్లవర్ బ్యాచ్ తో స్నేహం కుదిరింది, వాళ్ళు "బాబు అమాయక చక్రవర్తీ ఇలా నిజాయితీగా ఉండకూడదమ్మా మధ్యలో కాస్త మింగేస్తూ స్పీడ్ గా అప్పచెప్పేయాలి.." అనీ, హోమ్ వర్క్ ఎలా ఫాస్ట్ గా మ్యానిపులేట్ చేయాలి అనీ కిటుకులు చెప్పారు. అలా మెల్లగా మొద్దబ్బాయి ట్యాగ్ తొలగించుకోగలిగాను.



ఆగండాగండి!  అక్కడితో అయిపోలేదు అది పాజిటివ్ సైడ్ ఆఫ్ స్టోరీ, అయితే మడిసన్నాక కూసంత కళాపోసనుండాల అని బలంగా నమ్మే మడిసిని నేను, మరి చేసిన అల్లర్లు కూడా చెప్పాలి గదా. మా ట్యూషన్ నుండి నవోదయనగర్ లోని మా ఇంటికి వెళ్ళడానికి సరాసరి రైల్వే ట్రాక్ వరకు వచ్చేసి ట్రాక్ పక్కన రోడ్ పట్టుకుని బ్లైండ్ హైస్కూల్ మీదుగా నేనూ మా ఫ్రెండ్, వాడి సైకిలు నడిపించుకుంటూ వెళ్ళే వాళ్ళం. అంటే లావుపాటి కళ్ళద్దాలు (-12D పవర్) ఉండటం వల్ల మనకి సైకిలు తొక్కడమే కాదు ఎక్కడం కూడా నిషిద్దమే. ఆ దారమ్మట అమ్మ వాళ్ళ ఆఫీసు బంట్రోతులు బోల్డుమంది తిరుగుతూ ఉండే వాళ్ళు సో ఇంట్లో తెలియకుండా "సాహసం శాయరా ఢింభకా.." అందామంటే ఆనక వాళ్ళు ఇంట్లో చెప్పి మన డిప్ప పగల గొట్టించేయగలరు అని బుద్దిగా ఉండే వాడ్ని.



అలా ఓ రోజు ముందు కొందరు ట్యూషన్ అమ్మాయిలు వెనగ్గా మేము నడుస్తుండగా ఎందుకు బుద్ది పుట్టిందో ఏమో ఈల నేర్చుకోవాలి అనిపించింది. వెంటనే అది రోడ్డు, ముందు ఆడలేడీస్ వెళ్తున్నారు అన్న స్ఫృహలేకుండా, ఒకవేళ ఉన్నా "ఆ వచ్చిందా చచ్చిందా.." అనుకుని తుస్.స్.స్.స్. తుస్.స్.స్.స్.స్ మంటూ ప్రాక్టీసు మొదలెట్టాను. కాసేపయ్యాక ఏమయ్యిందో ఏమో అనుకోకుండా ఒక్కసారిగా పెద్ద పెట్టున కయ్య్.య్య్.య్.య్. మంటూ ఈల వచ్చేసింది.

ముందు నడుస్తున్న అమ్మాయిల బ్యాచే కాకుండా వాళ్ళకుముందు నడుస్తున్న బ్యాచ్ సైతం ఒక్కసారి ఆగి వెనక్కితిరిగి ఉరిమి చూశారు... ఫోకిరివాడులారా అని తిట్లు మొదలెట్టకముందే పారిపోయే వీలు లేక హి.హి.హి. అని వెర్రి నవ్వు ఒకటి నవ్వేసి "ఈల.. ప్రాక్టీసు.. అనుకోకుండా.." అని సణిగాను వాళ్ళు మరోమారు గుడ్లురిమేసి వెళ్ళిపోయారు. మనం ఎందుకైనా మంచిది అని సేఫ్టీ కోసం రెండ్రోలు జొరం తెప్పించేసుకుని ట్యూషన్ మానేశాం.



ఇక ట్యూషన్ ఎగ్గొట్టీసి మనం చేసే ఘనకార్యమేమిటయ్యా అంటే సినిమాలకి చెక్కేయడం. అప్పట్లో "ఛస్ మన ట్యూషన్ దగ్గరలో ఒక్క సినిమా హాలైనా లేదేంట్రా ఎంత ఇబ్బందైపోయింది.." అని తిట్టుకుంటూనే రెండో గేట్లోనుండి రయ్ మని ఏంజల్ టాకీసుకో లేదంటే మూడోగేటు దగ్గర చిత్రాలయకో లేదంటే బస్టాండ్ దగ్గరలో ఉండే సంధ్యాకో చెక్కేసే వాళ్ళం. అప్పుడప్పుడు చిరంజీవి సినిమాల కోసం ఈశ్వర్ మహల్ కి వెళ్ళడానికి కూడా జంకే వాళ్ళం కాము. అప్పట్లో ఇవే కానీ నేను ఇంటర్ మరియూ ఇంజనీరింగ్ కి వచ్చాక జయలక్ష్మి, రవి కళామందిర్ అనే రెండు అల్ట్రామోడర్న్ హాళ్ళు కట్టారు వాటిలో ఎయిర్ కూలర్లు రిక్లైనింగ్ సీట్లు అబ్బో ఆ కతే వేరులే, మహరాజ భోగం అనిపించేది అప్పట్లో.




ఒక వేళ సినిమా అంత సమయం లేదంటే మా మరో అడ్డా ఈశ్వర్ స్వీట్స్ (బొమ్మలో ఉన్నదే). కోర్ట్ బిల్డింగ్స్ దగ్గరలో ఉండేది దీన్లో ఓ స్వీటు ముక్క తినేసి, బాదంపాలో, గ్రేప్ జ్యూసో తాగేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళం.  (ఇక్కడ మీ నోరూరితే మీరు తిండిపోతు అనో, ఖాళీ కడుపుతో ఈ టపా చదువుతున్నారనో అర్ధమే కానీ నా తప్పేంలేదు అని గమనించ ప్రార్ధన)బాదం పాలు సేఫే కానీ గ్రేప్ జ్యూస్ తాగినపుడు వెంటనే ఇంటికి వెళ్ళకూడదు దొరికిపోతాం, ఓ అరటిపండుతినో, బోలెడు మంచినీళ్ళు తాగో నోట్లో రంగంతా పోయింది అని నిర్ధారించుకున్నాక వెళ్ళాలి. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఇక్కడి గ్రేప్ జ్యూస్ చాలా నచ్చేది నాకు చల్లగా, రుచిగా గ్లాస్ అడుగున చివర్లో రెండు ద్రాక్ష వచ్చేలా ఇచ్చేవాడు, స్ట్రా ఇచ్చేవాడు కాని నాకు ఎండన పడి వెళ్ళి గ్లాస్ తో అలాగే తాగడం మరింత ఇష్టం , మహాద్భుతం గా ఉండేది రుచి ఎన్ని చోట్ల ఎంత ఖరీదైన జ్యూసులు డ్రింక్ లు తాగినా దాని రుచి దానిదే అంటే నమ్మండి.

అప్పుడప్పుడూ ఈశ్వర్ స్వీట్స్ నుండి వస్తూ వస్తూ రెండోగేటు దగ్గర శంకరమఠం దగ్గర కాసేపు ఆగే వాళ్ళం, నేను మాత్రం గుడిని దానిలో అమ్మవారిని చూడటానికి వెళ్ళేవాడ్ని. మా ఫ్రెండ్స్ మాత్రం కాంపౌండ్ లోనే ఆగిపోయే వారు ఎందుకో తెలిసేది కాదు, అంటే దర్శనమయ్యాక నేనూ వాళ్ళతో కలిసే వాడ్ననుకోండి :-) అది వేరే విషయం. ఇతిహిః 10th క్లాసహః కొన్నిహిః ఙ్ఞాపకహః ... !!

Tuesday, January 5, 2010

ఆంజనేయ స్వామి గుడి కథలు - 1

బ్లాగర్ లో ఉత్పన్నమైన ఒక సమస్య వల్ల ఉదయం గీతాచార్య రాసిన పోస్టు అనూహ్యంగా డిలీట్ అయిపోయింది. అందువల్ల పోస్టుకు వచ్చిన వ్యాఖ్యల్ని కూడా ఇక్కడే టపాలో పొందుపరుస్తున్నాము. గమనించండి.

నరసరావుపేటకీ ఆంజనేయస్వామికీ అవినాభావ సంబంధం ఉందేమో మరి.

అసలు మా ఊరు మొదట పుట్టిందే ఆంజనేయస్వామి ఆథ్వర్యంలో అనుకుంటా. ఇప్పుడు ’పాతూరు’ అని పిలిచే చోట అట్లూరు అనే చిన్న గ్రామం ఉండేది. అదే క్రమంగా ఇప్పటి నరసరావుపేట అనే రూపుని సంతరించుకుంది. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ’పాతూరు ఆంజనేయస్వామి గుడి’ అంటారు. అదే వరసలో పాండురంగ స్వామి గుడి, పట్టభి రామస్వామి గుడి, ఇంకో రాముల వారి ఆలయం ఇలా మొత్తం నాలుగు ప్రఖ్యాత (మా ఊళ్ళో) ఆలయాలున్నాయి.

అలాగే ఇంకా శివాలయం, వెంకటేశ్వరస్వామి గుడి, (ఈ వెంకటేశ్వరస్వామి గుళ్ళు రెండు. ఒకటి శివాలయాన్ని ఆనుకునే ఉంటే, ఇంకోటి బరం పేటలో ఉంది), భావనారాయణస్వామి గుడి, ఇలా చాలా ఆలయాలున్నా, చాలామందికి ఆంజనేయస్వామి గుడి అంటే, స్టేషన్ రోడ్డులో ఉన్న గుడే మరి. అంతలా పేరు తెచ్చుకున్న ఆ ఆలయం పెద్ద గొప్పగా ఉంటుందా అంటే, చుట్టు ప్రక్కలున్న ఇళ్ళలో, షాపుల్లో కలగలసి పోయి ఇదిగో ఇలా ఉంటుంది.



కానీ అక్కడ ఉండే జనం రష్, ఆ భక్తిపూర్వకమైన (అంటే కేవలం స్వామివారి మీదే కాదు. స్వామీజీ... అదే పూజారి గారి మీద కూడా) వాతావరణం, పూజారి గారి ఆత్మీయమైన పలకరింపు, దగ్గరలోనే పార్కూ, భలే దక్కడ. నాకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు మేము అరండల్ పేట లో ఉండేవాళ్ళం. అంటే మా ఇంటికి మూడు ఇళ్ళవతల కుడి వైపు తిరిగే సందులో నుంచీ గట్టిగా వంద గజాల దూరం వెళితే స్టేషను రోడ్డు. అక్కడ ఎడమ వైపు ఓ పాతిక ముప్పై అడుగులేస్తే ఆంజనేయ స్వామి గుడి అన్నమాట.

ఇక్కడ చెప్పిన టైమ్ కి ఇరవై ఏళ్ళ తరువాత సుబ్రహ్మణ్యం గారు... ఆంజనేయ స్వామీ...






రోజూ సాయంత్రాలు, నేను పొద్దున స్కూలుకెళ్ళినందుకు నాన్నకి పనిష్మెంట్ గా నన్ను పార్కుకి తీసుకెళ్ళే బాధ్యత అప్పగించ బడింది నా చిన్నప్పుడు. అలా పార్కుకెళ్ళి వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వల్ల నాన్న పార్కు నుంచీ వచేటప్పుడు అక్కడకు తీసుకెళ్ళేవారు. బట్టలు మట్టిగొట్టుకుని పోయినా ఆచార్యుల వారబ్బాయినని ఆయనకి నేనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెళ్ళగానే చేతులు కడుక్కుని రా అనేవారు. చక్కగా చేతులు కడుక్కుని నాన్న ఎత్తుకుంటే కాళ్ళకు మట్టంటకుండా వెళ్ళి దేవుడి ముందు నించుని "మా గోపీ చందుకి జ్వరమొచ్చేట్టూ చెయ్యి స్వామీ. స్కూలుకి సెలవొస్తుంది," అని ప్రార్థించి, అప్పుడు ఆయనిచ్చిన కొబ్బరి ముక్కలో, ఆకుపూజ చేసిన రోజైతే కేసరో తీసుకుని వెళ్ళేవాడిని. గోపీచందు గారంటే మా స్కూలు హెడ్డు. నాకు జ్వరమొస్తే నాకొక్కడికే సెలవు. అదే ఆయనకి జ్వరమొస్తే స్కూలు మొత్తం సెలవు. హాయిగా అందరూ రెస్టొచ్చని నా సోషలిస్టిక్కైడియా. బాగుంది కదూ. కానీ ఆయనకు జ్వరమొచ్చినా వేరే ఎవరైనా వచ్చి స్కూలు తెరుస్తారని తెలిసి, నాకు, నాకు మాత్రమే జ్వరమొస్తే చాలని కోరుకోవాలని ఙ్ఞానోదయమయ్యే సరికి ఆ స్కూలు మారిపోవటం కూడా అయిపోయింది. అలా నా ఏకవాంఛా ప్రార్థన కొన్నాళ్ళు సాగింది. కానీ జనానికి మాత్రం ఆ గుడంటే చాలా ప్రేమ. నాకు పెద్ద చరిత్రా అవీ తెలియవు కానీ ఆ గుడంటే అదొక రకమైన అభిమానం.

ఆ ఆలయానికి జనం రావటం వెనుక కారణం, నరసరావు పేటలో ముఖ్యమైన కొన్ని (ఆఫీసులూ, కోర్టూ, షాపులూ, పెద్ద పార్కూ (అంటే చెంపుచ్చుకుని పోయే పార్కు కాదు) ఆ దగ్గరలోనే ఉన్నాయి. అవిగాక ఆ పూజారి గారి తత్వం. సర్వ మానవ సౌభ్రాతృత్వం అంటే ఆయన్నిజూసే నేర్చుకోవాలనిపిస్తుంది. జనం వాళ్ళలో వాళ్ళు ఈన మా దేవుడూ, ఆయన మీ దేవుడూ అని కొట్టుకుంటారు కడుపులో దేవుడు మొదలయ్యేలా. కానీ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆలయానికి ఎందరు దేవుళ్ళ భక్తులొస్తారో, అంతమందినీ శాటిస్ఫై (సంతృప్తి అని వాడవచ్చు. బట్ అది నా డే టూ డే కామన్ స్లాంగ్ కాదది) చేసేలా అందరు దేవుళ్ళకీ కనీసం గాయత్రి (ఆఖరుకి మెహెర్ బాబా, మాతా అమృతానందమయి కి కూడా) అన్నా చదువుతారు. అదేమంటే ఏవి చదివినా నాకు ఆంజనేయుడే కనిపిస్తారు కదా. వాళ్ళకి వాళ్ళ దేవుడూనూ అనంటారు. అలా వచ్చిన భక్తులందరికీ అక్కడే తమ తమ స్వాములు కనబడటం వల్ల వేరెక్కడికీ వెళ్ళేవారు కాదు. పైగా పూజారి గారు అందరినీ పేరు పేరునా పలకరిస్తూ పిల్లలకి ప్రత్యేక రాయితీలిస్తుండే వారు. మఙ్ఞళ శని వారాలు ఆకు పూజలూ, వీలున్నప్పుడు భజన్లూ. ఆకుపూజని పంతులుగారు శ్రద్ధగా చేయటం ఒకెత్తైతే, ఆ టైములో ఆయన చేసే ప్రసాదాలు మరో ఎత్తు. ముందా ప్రసాదాల కోసమైనా పూజ చేయించాల్సిందే.

*** *** ***

గుడి గురించిన చరిత్రా, ఇంకా వివరాలూ ముందు ముందు చెప్తాకానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశాలు మరి కొన్ని ఉన్నాయి. ఇక్కడే, ఈ గుళ్ళోనే నా జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి నా ఎటిట్యూడ్ ని నిర్ణయించి నాకో మార్గ నిర్దేశనం చేస్తే, మరొకటి నేను ఉన్న షెల్ లోంచీ బయటకొచ్చి, కాస్తంత లోకఙ్ఞానాన్ని పెంచుకునేలా జేసింది. (ఇప్పుడీ పేట్రియాట్స్ పుట్టటానికి కారణం కూడా మా అంజనేయ స్వామే కారణం. పైగా ఈ పేరు ఐడియా వచ్చింది ఆయన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడే. అదే గుళ్ళో ఉన్న టైమ్ లోనే). మరి మూడో సంఘటన నా డ్రీమ్ గాళ్ ని కలిసేలా జేసింది. "గాల్లో తేలినట్టుందే...," (పాట నాదే కాపీ కొట్ట బడింది అని ఇంతకు మునుపు కాంతారావు టపాలో మనవి జేసుకున్నాను) అనుకుంటూ ఒక ఎడ్వెంచరస్ లవ్ స్టోరీ అక్కడే మొదలైపోయింది.

అదన్నమాట సంగతి. నరసరావుపేట్రియాట్స్ కి ఆంజనేయ స్వామి అనగానే గుర్తొచ్చే గుడి గురించి. నా బాల్యౌవనాలతో పెనవేసుకుని పోయిన ఙ్ఞాపకాలు ఆ గుడితో చాలా ఉన్నాయి. అవన్నీ "ఆంజనేయ స్వామి గుడి కథలు" అనే రూపంలో. ఎన్నాళ్ళ నుంచో రాద్దామనుకుంటున్నాను కానీ, ఇప్పటికి కుదిరింది.

ఆ గుళ్ళోని రాముడు టైటిల్ బార్ లో ప్రభతో పాటూ...




ఆ నించున్న మనిషున్న స్థంభం దగ్గరే నేను చెప్పిన మూడో సంఘటన జరిగితే, ఇదిగో ఇద్దరు కూచున్నారే అక్కడే నా లవ్ స్టోరీ స్టార్టయింది ;-)

విన్నపం: 1. నా వీజీయే కెమేరా సామర్థ్యాన్ని బట్టీ ఇంతకన్నా క్వాలిటీ ఫొటోలు ఆశించకూడదు. దాంతోనే అద్భుతాలు చేశాను కానీ, ప్రస్తుతం అది కూడా జంపు జిలానీ. అందుకే ఎసెసెన్ కాలేజీ గ్రౌండు గురించి వ్రాయాల్సింది ఇది మొదలైంది. అంతా మన మంచికే. ఈ సారి ఎసెలార్ వస్తుందేమో? :-D
***   ***   ***

టపా డిలీట్ అయ్యే సమయానికొచ్చిన వ్యాఖ్యలు...

చిలమకూరు విజయమోహన్ గారు:

సీత లక్ష్మణ సమేత రాములవారు ఎంతందంగా ఉన్నారండి,ఆంజనేయులవారూ కూడా.పూజారి సుబ్రహ్మణ్యంగారికి పాదాభివందనాలు.#

ప్రియ:

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? బాగుంది. కానీ ఎందుకో తృప్తిగా లేదు. ఇంకొంచం కావాలనా? లేక ఆశించిన స్థాయిలో లేదనా అనేది తేల్చుకోలేక పోతున్నాను. ఒకటి మాత్రం నిజం. మునుపటి టపాల్లోని ఎగ్రెషన్ మాత్రం లేదు. టపా అలాంటి వస్తువనా?


పూజారి గారిని చూస్తుంటే గత వైభవం అన్నట్టున్నారు. చాలా పెద్దాయననుకుంటా. హ్మ్. రాయండి. రెండో భాగం త్వరలో అని ప్రకటించలేదే? అంటే ఇప్పట్లో రాదా? :-D

If proper care is taken, these too have potential of becoming dargamitta stories. You have style.



వేణూ శ్రీకాంత్


బాగుంది గీతాచార్య గారు, మిగిలిన భాగాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫోటోలు కాస్త నిరాశ పరిచాయి కానీ మనఊరి వాళ్ళ మనసుల్లో ముద్రించుకుపోయిన ఆలయ ఫోటోలు ఉండగా ఈ ఎలక్ట్రానిక్ ఫోటొలతో పని ఏముందిలెండి.

నాకూ ఈ గుడి అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువగా స్టేషన్ చుట్టుపక్కల ఇళ్ళలోనే ఉండే వాడ్ని, అచ్చంగా మీలాగే నాన్న నేను పార్క్ నుండి ఇంటికి వస్తూ ఈ గుడికి వెళ్ళేవాళ్లం. గుడిలో పెయింటింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉండేవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో ఎత్తుగా తడిమితే చేతికి తగిలేలా ఉండేవి చూసి అబ్బురపడేవాడ్ని. పులిహోర, అప్పాలు, కేసరి లాటి ఆకుపూజ రోజు ప్రసాదాలకు నేనూ వీరాభిమానినే.

ఈ చిన్న సత్రంలో ఉన్న ఈ గుడి ఇంత ప్రాచుర్యాన్ని పొందటానికి ముఖ్యకారణం నిస్సందేహంగా పూజారి సుబ్రహ్మణ్యంగారే. ఆయన ఆత్మీయ పలకరింపుకి ఎవరైనా మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఇంకా ఇంత చిన్న గుడిలో అందరు దేవుళ్ళ పటాలకీ చోటుకల్పించడమే కాక పూజలో సైతం స్థానం కల్పించడం నీజంగా మెచ్చుకోవాల్సిన విషయం.


మైత్రేయి


ఈ గుడి నేను కూడా చూసానండి.చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్లే చిన్న గుడి కాని ఎంతో శుబ్రంగా , పవిత్రం గా ఉంటుంది. పూజారిగారి ప్రశాంత వదనం మర్చిపోలేము.
మా వారు తన చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తూ ఈ గుడికి తీసుకు వెళ్లారు. నరసరావు పేట్ వెళ్ళినప్పుడల్లా వెళ్తాము.
ఈ గుడి, జాని మసాలా తప్పనిసరి .


అడ్డగాడిద (The Ass)


Hmm nice post. Photos could have been better. But u gave ur reason.

enti poleramma banda kadhala ikkada kuda? :-D


సమయానికి టపాని దొరకబుచ్చుకుని అందించిన వేణూ శ్రీకాంత్ గారికీ, అతి కష్టం మీద వ్యాఖ్యలని కూడా రిట్రైవ్ చేసిన Dhanaraj Manmadha కీ thanks a lot.