అప్పుడెప్పుడో చాన్నాళ్ల క్రితం ప్రభుత్వం ఈ శాఖా గ్రంథాలయాలని ఎత్తేయాలని అనుకుందట. నేను లేకుండా చూసి అలాంటి కుట్రేమన్నా చేశారా అనుకున్నా!అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది.వాళ్లనడిగితే లైబ్రరీ ఏమిటన్నారు. వాళ్ళు హోటల్ పెట్టేనాటికి అది లేదన్నారు(ఏడిసినట్టుంది. అదుంటే వీళ్ళు హోటలెలా పెడతారు?)
ఇంట్లో అడక్కుండా వచ్చినందుకు చింతిస్తూ అన్నయ్యకు ఫోన్ చేసి "శాఖా గ్రంథాలయం ఇక్కడ లేదేంట్రా" అంటే వాడు "తీసేశారు" అన్నాడు క్లుప్తంగా!
"తీసేశారా, మరి ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు? "నిర్ఘాంతపోయాను మరో పక్క మనసులో అత్యాశపడుతూ!(ఆ పుస్తకాలన్నీ ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయనే నమ్ముతూ)
" తొందర పడొద్దు! ఎత్తేశారన్లేదు నేను. అక్కడినుంచి తీసేశారు. మన సత్యనారాయణ టాకీసు పక్కనే కట్టారిప్పుడు కొత్త బిల్డింగ్" వాడు.
అక్కడికెళ్ళి చూద్దును కదా, ఇదిగో ఇదే లైబ్రరీ!
మా నరసరావుపేట శాఖాగ్రంథాలయం 1956 లో స్వల్ప సంఖ్యలో పుస్తకాలతో ప్రారంభమైంది. ఇప్పుడున్న పుస్తకాల సంఖ్య దాదాపు యాభై వేలు. దీనితో దాదాపు మా వూర్లోని విద్యార్థులందరికీ మర్చిపోలేని మధుర స్మృతులున్నాయి. మధుసూదన రావు గారు లైబ్రేరియన్ గా ఉన్నపుడు శాఖా గ్రంథాలయం అరండల్ పేటలో పాత LIC ఆఫీసు పక్కన ఉన్న ఒక పెద్ద ఇంట్లో ఉండేది. మునిసిపల్ హై స్కూల్లో ఏ పాటి గ్రంథాలయాలుంటాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము వారంలో రెండు మూడు సార్లన్నా లైబ్రరీకి వెళ్ళి సాధారణ పరిజ్ఞాన సముపార్జన చేస్తుండేవాళ్లం! స్కూల్లో ఖాళీ పీరియడ్స్ లో అలా వెళ్లడానికి మాకు పర్మిషనుండేది.
ఈ టపా ఇప్పుడు రాయడానికి కూడా కారణం ఉంది. నవంబరు 14 నుంచి 19 వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి.అప్పుడు మా శాఖా గ్రంథాలయంలో అన్ని స్కూళ్లకీ వక్తృత్వం, వ్యాస రచన, సంగీతం,క్విజ్, గ్రూప్ డిస్కషన్ లాంటి బోలెడు పోటీలు పెట్టేవారు. మా స్కూలు నుంచి మేము ఒక గంప పట్టుకెళ్ళి గంప నిండా అన్ని స్కూళ్ళనీ చిత్తుగా ఓడించి గెల్చుకున్న బహుమతులూ, మెమెంటోలూ వేసుకుని స్కూలుకు తిరిగొచ్చేవాళ్ళం! (మల్లిక్ రాసిన సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథ గుర్తుందా? అందులో హీరోలాగా అన్నమాట)
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన వంటి పత్రికలని జాగ్రత్తగా అట్టలు వేసి మరీ ఉంచేవాళ్ళు. రోజూ ఇక్కడికొచ్చి గంటలతరబడి చదివి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని లైబ్రేరియన్ గారే స్వయంగా చెప్పారు.జర్నలిజం చదివేటపుడు ఒక ప్రాజెక్టు కోసం నేను నెల రోజుల పాటు రోజూ ఇక్కడికొచ్చేదాన్ని ప్రాజెక్ట్ కోసం నోట్సు రాసుకోడానికి. అప్పటి లైబ్రేరియన్ శ్రీ మదార్ ఎక్కడెక్కడి పాత పేపర్లు, పుస్తకాలూ తీయించి నాకెంతో సహాయం చేశారు. నా ప్రాజెక్ట్ "ముందుమాట"లో మదార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలుంటాయి.
నా స్కూలు రోజుల్లో ఉదయం, సాయంత్రం పేపర్లు చదవడానికొచ్చే రిటైర్డ్ ఉద్యోగుల ,కాలేజీ విద్యార్థుల సైకిళ్లతో లైబ్రరీ ముందు రోడ్డంతా నిండిపోయి ఉండేది.ఇంతమంది లైబ్రరీలో గడపడానికి కారణం అప్పట్లో టీవీ వేయి తలల విషనాగులా ఇంతగా విజృంభించకపోవడమే అనుకుంటాను!
లైబ్రరీ ముందు ఉన్న విశాలమైన అరుగుల మీద కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకునే వాళ్ళూ, అక్కడినుంచి నాలుగడుగులు ముందుకేసి స్టేషన్ రోడ్డులో శంకరమఠం దాకా వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లూ...ఆ వాతావరణమే విజ్ఞానంతో నిండి పవిత్రంగా ఉండేది. పోటీ పరీక్షల కోసం చదవడానికొచ్చే వాళ్ళకు అనుభవజ్ఞుల సలహాలు కూడా ఆప్యాయంగా లభిస్తుండేవి.
కాలేజీకి వెళ్ళాక శాఖా గ్రంధాలయానికి రావడం తగ్గింది. ఎందుకంటే మా కాలేజీకి గుంటూరు జిల్లాలో ఏ కాలేజీకీ లేనంత పెద్ద లైబ్రరీ ఉంది.(ఇప్పటికీ)!
కొన్నాళ్ళకి లైబ్రరీ ని అక్కడినుంచి పాత LIC ఆఫీసు పై భాగంలోకి తరలించారు. మరి కొన్నాళ్ళకి అక్కడినుంచి ఆంధ్రా బాంక్ సెల్లార్ లో ఉంచారు. అంత పెద్ద లైబ్రరీని ఎలా తరలించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది.
మా వూరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాదాపు 30 పుస్తక కేంద్రాలు ఉన్నాయి. వీటికి నెలకు యాభై పుస్తకాలు వాళ్ళకు ఇస్తుంది శాఖా గ్రంథాలయం! రోజుకు మూడు వార్తా పత్రికలు వేయిస్తుంది. నెల తర్వాత వాళ్ళు వచ్చి పాత పుస్తకాలు ఇచ్చేసి మరో యాభై పుస్తకాలు పట్టుకెళతారు. ఇలాంటి ఒక పుస్తక కేంద్రం నరసరావుపేట సబ్ జైలులో ఖైదీల కోసం ఉందని తెలిసి ఎంతో సంతోషం వేసింది.
ఇవి కాకుండా పదో పన్నెండో గ్రామీణ గ్రంథాలయాలు కూడా ఈ శాఖా గ్రంథాలయ నిర్వహణలోనే పని
చేస్తాయి.వాటికి స్వంతగా పుస్తకాలున్నా, పర్యవేక్షణ అంతా ఇక్కడినుంచే!
ఖైదీలు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుతారనీ,ఫలానా పుస్తకాలు కావాలని అడుగుతారనీ లైబ్రేరియన్ చెప్పారు.
ఊరు మారేవారో, విదేశాలు వెళ్ళేవారో తమ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకెళ్లలేమనుకుంటే శాఖా గ్రంథాలయానికి ఇచ్చేవేయవచ్చు! అక్కడ సబ్జెక్టు వారీగా సీరియల్ నంబర్లు వేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు.
చివరగా వస్తూ వస్తూ బిల్డింగ్ పేరు చూసి "ఎమ్మెల్యే గారేమన్నా విరాళం ఇచ్చారేమో బిల్డింగ్ కి" అనుకున్నా! లైబ్రేరియన్ గారిని అడిగితే ఆయన , క్లర్కూ మొహాలు చూసుకుని "లేదమ్మా, అంతా జి.గ్రం.సం. (జిల్లా గ్రంథాలయ సంస్థ) నిధులతోనే కట్టారు ఈ భవనం"అని చెప్పారు. "మరి ఆ పేరేంటి?" అనడిగితే అక్కడే పుస్తకాలు చూస్తోన్న ఒక సీనియర్ చదువరి...
"నీటిపారుదల ప్రాజెక్టులకు వై యెస్ పేరు పెడితే ఆ ప్రాజెక్టుల డబ్బంతా ఆయన జేబులోంచి పెట్టినట్లేనా? ఇదీ అంతే! వాళ్ల ప్రభుత్వం ఉన్నన్నాళ్ళూ వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నా అడిగేవాడు లేడు"అని దేవరహస్యం చెప్పేశాడు.అన్నట్లు ఇక్కడ రీడింగ్ హాల్ పేరు కూడా దివంగత ముఖ్యమంత్రి గారిదే!
ఇదీ మా లైబ్రరీ కథ! ఇంతా చేసి ఈ ఏడాది ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలను జరపకూడదని నిశ్చయించిందట! :-(