Pages

Wednesday, August 12, 2009

సత్యనారాయణా టాకీసులో కాంతారావు సినిమా...

"సినేమా సూడాలంటే సత్తెనారాయనా టాకీసే, మాంచుషార్రావలంటే కాంతారావు సినేమానే!" సత్తి, సత్తి పండు, ఉరఫ్ జేవీ సత్యనారాయణా, ఇంకో ఫ్రెండు అనేవాళ్ళు. మరి అంత బావుంటాయా? అని ఆలోచిస్తే నాకు ఒకసారి సినిమా చూస్తే పోలా  అనిపించింది. మరి కాంతారావు సినిమాలెక్కడ వస్తాయి? ఇంతకీ అవి ఎలాంటి సినిమాలు? మాంఛి ఫైటింగులుంటాయా? హుషారైన పాటలుంటాయా? ఉన్నాయి సరే! మరి ఎవరినడిగితే నన్నా సినిమాకి తీసుకుని వెళ్తారు?

ఇంతకీ ఆ కాంతారావెవరు? అదో డౌట్. మనకి సినిమా అంటే సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, అమితాబూనూ. మరి ఈయనెవరు? కొంచం పాతోళ్ళైతే ఎన్టీయార్, తెలుసు. దాన వీర శూర కర్ణ చూసి తల బద్దలు కొట్టుకున్న అనుభవం ఉంది. నాలుగ్గంటల సినిమా కదా. హ్హుఁ!  హుషారైన సినిమా అనగానే నాకు కళ్ళూరాయి. చూద్దామని.

"ఈసారి ఆ కాంతారావు సినిమా వస్తే నాకు కూడా చెప్పండ్రా. నేనూ వస్తాను," అన్నాను. "చెప్పేదేముందిరా. మీ ఇంటికి వెళ్ళేదారిలోనే బొమ్మ పెడతాడు. చూసి చెప్పు. అందరం వెళ్దాం," అన్నాడు సత్తి గాడు. "అందరం. హేమిటి వెళ్ళేది? మా మురళీబాబు చక్కగా బయట ఫ్రెండ్స్ తోనే ఆడుకోనివ్వడు. ఆయన బాధ తట్టుకోలేక నాన్న దగ్గర మొరబెట్టుకుంటే నాన్నే నాతో ఆడటం మొదలెట్టాడు. ఇక సినిమాలుకూడానా ఫ్రెండ్సుతో. ఐనా నా పిచ్చిగానీ..." అనుకున్నా మనసులో కసిగా. అతడులో కాలుజారి పడే సీను ముందు త్రిషా లాగా. దాన్నే అసూయ అంటారని మొన్నామధ్యే తెలిసింది. అనంతరామ శర్మ
 
 గారి వల్ల. కానీ అదంటే ఏంటో నాకింతవరకూ పూర్తిగా అర్థంకాలేదు. ఎందుకు కలుగుతుందో.

అప్పట్లో నేను నాలుగో క్లాసు. శర్మా ట్యుటోరియల్స్ లో చదువు. అది సరిగ్గా పట్టాభిరామస్వామి గుడి ఎదురుగా ఉండేది. అక్కడినుంచీ పడమర ముఖంగా నడుచుకుంటూ వస్తే మాఇల్లు. అది పాతూరు ఆంజనేయస్వామి గుడి నుంచీ అదే లైనులో ఓ వంద గజాల దూరంలో ఉండేది. అలా బడి నుంచీ గుడి వరకూ వచ్చేలోపుల మధ్యలో ఒక చౌరాస్తా దాటితే అక్కడే కుడిచేతి వైపున ఉన్న పాండురంగ స్వామి గుడి పక్కనే ఉన్న గోడ మీద సినిమా పోస్టర్లుండేవి. వాటిలో సత్యనారాయణా టాకీసువి పై వరసలో మధ్యలో (అంటే నేను బడి నుంచీ గుడి వైపు వెళ్ళే వైపునుంచీ రెండోది)  వేసేవాళ్ళు.  అలా మొత్తం సర్వే చేసి ఇక ఈసారి కాంతారావు సినిమా వస్తే వదిలేది లేదని మంగమ్మ శపథం చేశాను. ఇప్పుడైతే నేను పిల్లగాడిని గానీ, అప్పటికింకా పిలగాడినేగా. అందుకే శపథం అంటే అదేదో హీరోగారే చేసుంటారని గుడ్డి నమ్మకం. అందుకే మంగమ్మ శపథం అంటే అదేదో హీరోనే చేసుంటాడులే అనే ధైర్యంతో.

ఇంటికెళ్ళాక కుమారి పిన్నినడిగాను. కాంతారావంటే ఎవరు? అని. "మొన్న మనం ’పెళ్ళి కాని పిల్లలు’ సినిమా చూశామే. అందులో విలను," అంది.

" ఛీ! విలనా? వీళ్ళకి విలను సినిమాలు చూస్తారా?" అనుకుని చిరాకు పడ్డాను. తెల్లారాక బళ్ళో వాడిని నిలదీశాను. వాడు విలను కదరా అని.  వాడు నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నేను వినలేదు. అట్టాంటి సినిమాలు చూసి చెడిపోవద్దు (అంటే నాకు తెలియదు. మురళీబాబు వాడే మాట అది. ఫ్రెండ్స్ తో తిరిగితే చెడిపోతారని. మరి తిరక్కుండా కూచుంటే చెడిపోరా అని ఒక సారి అడిగిన పాపానికి తొడపాశం పెట్టాడు). మంచి హీరోల సినిమాలు చూడటం నేర్చుకోమని ఉపదేశామృతం ఒలికించాను. ఇక లాభంలేదనుకున్నాడో లేకపోతే, నన్ను అఙ్ఞాన తిమిరాంధకారం నుండీ విముక్తుణ్ణి  చేయాలని సంకల్పించాడో గానీ. "ఉరే! సత్తె పెమాణకంగా సరస్పత్తేవి మీద ఉట్టేసి చెప్తున్నాను. వాడి సినేమాలు చాలా బావుంటాయిరా. ఒకసారి చూసి బావోపోతే నాకు చెప్పు." అన్నాడు. సరే! క్షమించాను ప్ఫో! అన్నట్టో ఎక్స్ ప్రెషనిచ్చి ఊరుకున్నా.

అప్పటినుంచీ రోజూ ఆ ప్లేసులో కాంతారావు సినిమా ఎప్పుడొస్తుందా అని చూట్టం అలవాటయిపోయింది. ఇగో చెప్పటం మర్చిపోయాను. ఆ చౌరాస్తానుంచీ (బడి నుంచీ గుడి కెళ్ళే లాగా ఐతే) ఎడమ వైపు నేరుగా వెళ్తే శివుడి బొమ్మ వస్తుంది. (బొమ్మ ప్రక్కనే ఉంది చూడండి). ఆ శివుడి బొమ్మ నుంచీ పడమర వైపు ఓ యాభై గజాల్లోపే గడియారస్థంభం ఉండేది. (గడియారస్థంభం
 
 గురించి గత టపాలో సృజన వ్రాసింది). అలా ఓ పదిరోజులు గడిచాయో లేదో కానీ వస్తాడు నీరాజు ఈరోజు అనేలా ఒక శుభశకునం ఎదురైంది. పొద్దున్నే రేడియోలో అదే పాట వచ్చింది. నేను యాజ్యూజువల్‍గా కుడివైపోలుక్కిచ్చాను. చిత్రం. ’ప్రతిఙ్ఞా పాలన’ అనే సినిమా పోస్టరు కనిపించింది. దాన్లో ఒకణ్ణి చూసి ఎక్కడో చూశానే అనిపించి తేరిపార (అబ్బ! గడ్డపార కాదు) చూడగా వాడెవరో కాదు. కాంతారావే. ఇంకేముంది? "గాల్లో తేలినట్టుందే... గుండె జారినట్టుందే..." అని ఎగురుకుంటూ బడికి పరిగెత్తాను. (మనలోమాట. ఆ పాటని మొదట నేనే పాడాను. జల్సాలో ఆ పాట రాసినోడు ఎక్కడో అక్కడే నక్కి విని ఇన్నాళ్ళకి దాన్ని మక్కికి మక్కీ దింపేశాడు ;-) ఎవరికీ చెప్పకండేఁ...)


 

సత్తిగాడికి విషయం చెప్పేశాను. వాడు నేను ఈ సాయంత్రమే వెళ్తానన్నాడు. నాకూ ఆత్రం పెరిగిపోయింది. ఎలాగైనా ఆ సినిమా చూడాల్సిందే. అనుకున్నా. సాయంత్రం ఇంటికెళ్ళాగానే బుద్ధిగా హోంవర్కు చేసేసి, (మామూలుగా నేను నా స్కూలు చదువు మొత్తం మీద ఓ పదిసార్లు చేసుంటాను. నాన్నో, అక్కో, రమా పిన్నో, ఎప్పుడైనా పనిష్మెంటు క్రింద అమ్మో చేసి తరించేవాళ్ళు. కుమారి పిన్ని చేయదు. నాకన్నా బద్ధకం. మురళీబాబు తాట తీస్తాడు. హోంవర్కు) నాన్నకి అర్జీ పెట్టుకున్నా. "ముందు హోమ్వర్కు తీసుకునిరా. అదవగానే ఆలోచిద్దాము." అన్నాడు. "నాన్నా. నేను మొత్తం చేసేశా నాన్నా." అన్నా. ఇక సినిమా ఖాయం అనే ధైర్యంలో. కానీ ఆ మాటలు విందో లేదో రమా పిన్ని ఢామ్మని క్రింద పడిపోయింది. అటే వస్తున్న బుచ్చిమామ నోరెళ్ళ బెట్టి నీలుక్కుని పోయాడు. ఇంత హడావిడి ఏమైందబ్బా అని వస్తూ అమ్మమ్మ (కుమారి పిన్నీ వాళ్ళా అమ్మ. అమ్మా వాళ్ళా అమ్మని పెద్దమ్మమ్మ అంటాను) క్రింద పడ్డా రమా పిన్ని కాలు తగిలి భూగోళాం బద్దలయ్యేలా పడి "నాయనోయ్!" అని శోకాలు.

ఇంకేముంది. ఆరోజంతా ఈ గోలే.
*** *** ***

ఇక సినిమా కాస్తా గోవిందా గోవిందా (ఆర్జీవీ సినిమా కాదు) అనుకుని నన్ను నేనే తిట్టుకున్నాను. "నాన్నా! నువ్వు హోమ్వర్కు చేశావు సరే. అసలే బలహీనమైన గుండెలున్న మన ఇంట్లో చేసినవాడివి నాన్న చెవిలో చెప్పాలిగానీ అలా పెద్ద ఘనకార్యంలా డిక్లేర్ చేస్తే ఎలా? ఫో! ఇక ముందైనా సరిగా ఉండు. అతిగా ఆవేశ పడే ఆడదీ, అతిగా ఆశ పడే మగవాడూ, బాగు పడ్డట్టు చరిత్రలో ఎక్కడా చెప్పబడలేదు" అని నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను. (ఈ డైలాగూ నాదే. కాపీకరించారు). పనిష్మెంటు క్రింద నేను ఆ మర్నాడు కూడా స్వయంగా హోమ్వర్కు చేశాను. కానీ ఈసారి ఎవరికీ చెప్పలేదు.

విషయం తెలిసిన మురళీబాబు, వీణ్ణి ఇలాగే కాస్త ఎంకరేజ్ చేస్తే హోమ్వర్కు ఎవరిచేతో చేయించకుండా వీడే చేస్తాడని భ్రమ పడి ఆ మర్నాడే మ్యాట్నీకి తీసుకెళ్ళాడు. ( ఆదివారం కదా!) . తెర మీద కాంతారావు పేరు చూసి ఆనందం పట్టలేక మనసులోనే విజిల్స్ వేసుకుని (పైకేస్తే ’ఇచట తాట తీయబడును’ అని మురళీ బాబు పెట్టిన బోర్డు... హిహిహి.)... అదీ సంగతి.

కత్తి యుద్ధాలూ, గుర్రాలూ, ఇంకేం? మనకి కావాల్సిన మసాలా అంతా ఉంటంతో నాకు కాంతారావు సినిమాలూ, వాటిని తీసుకొచ్చినందుకు సత్యనారాయణా టాకీసూ భలే నచ్చేశాయి. అలా మొదలైన నా అనుబంధం, పాతాళ భైరవీ, మిస్సమ్మ, నర్తనశాలా, త్యాగయ్య, అల్లూరి సీతా రామ రాజు, భూలోకంలో యమలోకం, గురువుని మించిన శిష్యుడు, తరువాత్తరువాత జురాసిక్ పార్కూ, అనకొండా... ఓ వంద పైన సినిమాలు (అందులో సగం జానపదాలే!) అక్కడే చూశాను. నా చిన్న తనపు సినిమాలు, నేను నేర్చుకున్న కథలూ, ఎన్నో ఆ సత్యనారాయణా టాకీసు మహిమే. పుస్తకాల సంగతి వేరే అనుకోండీ.

ఆ సంగతులన్నీ వీలుననుసరించి.
*** *** ***

ఇప్పుడా సత్యనారాయణా టాకీసు బొమ్మ పెట్టాలన్నా దొరకటం లేదు. ఇందాకే మన బ్లాగు టీచరమ్మ సుజాత గారి నడిగి, బాధపడ్డాము. ఆ హాలుని పడగొట్టి హాస్పిటలు కట్టారు.

అలాగే, మాకెంతో ఇష్టమైన ’నరసరావుపేట్రియాటిక్ ఐఫిల్ టవర్’ గడియారస్థంభం కూడా లేదిప్పుడు. మనసంతా ఏదోలా అయిపోతుంది. మా సత్తిగాడిని చూసి చాలా రోజులైంది గానీ, వాణ్ణి తల్చుకున్నప్పుడల్లా ఆ హాలే గుర్తొస్తుంది.

ఎంతైనా మా పేటోళ్ళవి తొడగొట్టే వంశాలే కాదు. పడగొట్టే వంశాలు కూడా.

పీయెస్: ఆ తరువాత మరో ఐదేళ్ళు నేను హోమ్వర్కు చేయలేదు. నేను చేసే రకం కాదు. చేయించే రకం. ;-)