మా వూరి గురించి రాస్తూ మా మునిసిపల్ హైస్కూలు గురించి, మా కాలేజీ గురించి రాయకపోతే పుట్టగతులుండవు మరి!అందునా బాల్యం తాలూకు మధురానుభూతుల్లో సగానికి పైగా హైస్కూలుతోనే ముడివేసుకుని ఉంటాయేమో, స్కూలనగానే మనసు పరిమళిస్తుంది జ్ఞాపకాల పూదోటలో!
ఈ మధ్య వెళ్ళినపుడు అక్కడ అడుగు పెట్టగానే ఒక గొప్ప వణుకు వచ్చింది..బహుశా సంతోషంతో అనుకుంటా!చిన్ననాటి స్నేహితులరూపాలు,గొంతులు,గిల్లికజ్జాలు,అపార్థాలు,మరునాడే చెప్పుకున్న క్షమాపణలు!
అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో నిండిపోయాయి.
ఇప్పటి గర్ల్స్ హై స్కూలు బిల్డింగ్
పదో క్లాసులో మా గ్రూపంతా విడిపోయి తలో సెక్షన్‌లోనూ పడ్డామని తెలిసి లెనినా ఏడ్చిన ఏడుపు చిత్రంగా గాల్లో తేలి వచ్చి నా చెవులకు సోకింది.సంగీతం టీచర్ హార్మోనియం,పాండురంగారావు మాస్టారి పదునైన తెలుగు ఉచ్చారణ,రామకోటి మాస్టారి మెత్తని బుజ్జగింపూ,పీ ఈ టీ రాజేశ్వరి మేడమ్ ఊదిన విజిలూ,"భామలూ"అని ముద్దు చేసే మా హెచ్చెం అన్నీ అలా కళ్ళముందు కనిపిస్తూ వినిపిస్తూ ఉండిపోయాయి.
నా హైస్కూలు చదువు నరసరావుపేట మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలో గడిచింది. ఒకటే ఆవరణలో పక్కపక్కనే అబ్బాయిల హైస్కూలు, అమ్మాయిల హైస్కూలు ఉంటాయి.(ఇప్పటికీనూ)అయితే అబ్బాయిలు అమ్మాయిల మధ్య స్నేహ సంబంధాలో మరో రకమైన ఆకర్షణలో ఉండేవి కాదు, కేవలం చదువులో పోటీ తప్ప! మా స్కూలుకు అంతగా నిధులు లేకపోవడం వల్ల కొన్ని రూములు అబ్బాయిల స్కూలు నుంచి అప్పు తీసుకుని అందులో మరి కొన్ని తరగతులు నడిపిస్తుండే వాళ్ళు.నేను చదువుకున్నపుడు శ్రీమతి వసుంధరా దేవి హెడ్ మిస్ట్రెస్ గా ఉండేవారు. అదే స్కూల్లో చదువుకున్న భారతి అప్పుడు సోషల్ స్టడీస్ కి వస్తుండేవారు.ఇప్పుడు ఆమే ఆ స్కూలుకి హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నారు.
మా స్కూలు ఎప్పుడు ప్రారంభమైందో నా వద్ద సమాచారం లేదు. కానీ స్కూలు గేటులోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక గాంధీ విగ్రహం ఉండేది. దాన్ని గాంధీ హత్యకు గురైన ఇరవై రోజులకే 1948 ఫిబ్రవరి 20 న ప్రతిష్టించారని ఫలకాన్ని బట్టి అర్థమైంది. అంటే అంతకు ముందునుంచే ఆ స్కూలు ఉందన్నమట.
శిధిలావస్థ లోని పాత స్కూలు
అబ్బాయిలు, అమ్మాయిల స్కూళ్ళలో భయంకరమైన క్రమశిక్షణ ఉండేది! ఇంటర్వల్ లో అబ్బాయిలెవరైనా ఇటువేపొస్తే మోకాళ్ళు విరిగేలా దెబ్బలు పడేవి. అలాగే ఆడపిల్లల క్లాసులో కానీ అసెంబ్లీలో గానీ రెండు జడల్లో పొరపాటున ఒకటి ముందుకు పడిందా....ఠప్పున మొట్టికాయ పడాల్సిందే! లెక్కలు తప్పు చేస్తే జయమణి టీచర్ మొహమాటం లేకుండా చేయి వెనక్కి తిప్పి స్కేలుతో ముణుకులు విరగ్గొట్టేది. మా పీ ఈ టీ రాజేశ్వరి..అబ్బ నామిని మాటల్లో చెప్పాలంటే బలే కటీనురాలు. ఆ షాట్ పుట్ లూ, జావొలిన్ లూ ఎంతెంత దూరాలు వేయించేదో(చనువు కొద్దీ,ప్రేమకొద్దీ ఏకవచనాలు).ఎంతెంత దూరాలు పరిగెత్తించేదో !
అలాగే జోసెఫిన్ టీచర్(ఎన్నెస్),మావుళ్ళమ్మ(తెలుగు),జయమణి (లెక్కలు),వీళ్ళందరినీ ఎప్పటికీ మరవలేం! కాలేజీలో కొంతమంది లెక్చెరర్ల పేర్లు గుర్తు లేవు గానీ స్కూల్లో ఆయాలతో సహా అందరూ గుర్తే! నాగమ్మ,బీబీ అని ఇద్దరు ఆయాలు, జనార్దన్ అనే అటెండర్ ఉండేవాళ్ళు. నాగమణి,హుస్సేన్,నాగేశ్వర్రావు నాన్ టీచింగ్ స్టాఫ్! (అమ్మో,నాకు అందరి పేర్లూ గుర్తున్నాయి..వావ్)
చదువులో మా స్కూలెప్పుడూ ఫస్టే! ఇతర విషయాల్లో కూడా అసలు మా బాచ్ సంపాదించినన్ని షీల్డులు, కప్పులు బహుమతులు ఇంకే బాచ్ అయినా సంపాదించిందా అని సందేహం! శాస్త్రీయ సంగీతం,లలిత సంగీతం,క్విజ్ లు,వ్యాసరచనలు,వక్తృత్వం,ఆటలు అన్నింటిలోనూ గంపల కొద్దీ ప్రైజులు సంపాదించేవాళ్ళం!అవి ఇప్పటికీ మా హెడ్ మిస్త్రేస్ రూములో భద్రంగా ఉన్నాయి.
ప్రస్తుతం గురజాడ కళామందిరం
మా హెడ్ మిస్ట్రెస్ వసుంధర మేమలా ప్రైజులు సంపాదించి రాగానే మాకు స్వీట్లు తనే తినిపించి నాగమ్మ చేత దిష్టి తీయించేవారు. "అమ్మో, పిల్లలకు ఎంత దిష్టి తగిలిందో, అందరి కళ్ళూ మన పిల్లల మీదే"అనేవారు(ఆమెకు పిల్లలు లేరు) మేమలా బహుమతులు సంపాదిస్తుంటే ఊర్లో పెద్దలంతా మా హెచ్చెమ్ ని మెచ్చుకునేవాళ్ళు.దానితో ఆమె మమ్మల్ని మరింత గారాబం చేస్తుండేది.
ఇప్పటి స్కూళ్ళలో టీచర్లను పిల్లలను చూస్తుంటే చనువు ఉన్నా, ఇద్దరి మధ్యా అప్పటి అనురాగం,ఆప్యాయత లేవేమో అనిపిస్తుంది.ఇద్దరి మధ్యా ఒక సన్నని సరిహద్దు లేఖ కనిపిస్తూ ఉంటుంది.
ఇక అబ్బాయిల స్కూలు (మరి రెండూ ఒకే ఆవరణలోనే ఉన్నాయి కదా,ఆ స్కూలు గురించి కూడా చెప్పుకోవాలి )సంగతికొస్తే ప్రతి హెడ్ మాస్టరూ చండశాసనుడే అక్కడ! హెడ్ మాస్టర్ దాకా ఎందుకు మాస్టర్లంతా బలే కటీనులు! వాళ్ల స్కూలు H ఆకారంలో ఉండేది.మధ్య గీత లో హెడ్ మాస్టర్ రూము! అందువల్ల ఏ క్లాసులో ఏం జరుగుతుందనేది ఆయనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట.
మా నాన్నగారు,మామయ్యలు అంతా ఇదే స్కూలు! ప్రముఖ కవి శ్రీ నాయని సుబ్బారావు గారు ఈ స్కూలుకు హెడ్ మాస్టర్ గా పని చేసిన రోజుల్లో వాళ్ళమ్మాయి నాయని కృష్ణ కుమారి గారు అదే స్కూల్లో చదువుతుండేవారు. అబ్బాయిల స్కూల్లో అమ్మాయిలకు కొద్ది సీట్లు ఇచ్చేవారుట. ప్రముఖ విమర్శకుడు చేరా,వేణుగాన విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావు,విజ్ డమ్ అంతరజాతీయ మాసపత్రిక కు సంపాదకులుగా పని చేసిన కె.వి గోవిందరావు ,ప్రముఖ రచయిత అనువాదకుడు స్వర్గీయ రెంటాల గోపాల కృష్ణ కూడా మా మునిసిపల్ హై స్కూల్లో చదువుకున్నారు.
మునిసిపల్ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కళావేదిక "శ్రీ గురజాడ కళామందిరం"! పెద్ద స్కూలు గ్రౌండ్ కాబట్టి, ప్రైవేటు ఆస్థి కాదు కాబట్టి ఇక్కడ ఎన్నో కళా ప్రదర్శనలు జరిగేవి.రంగస్థలి సంస్థకు ఇది శాశ్వత వేదిక. మా నాన్నగారు రంగస్థలికి చందాదారు కావడంతో ఇక్కడ మేము బలవంతంగా అప్పుడప్పుడు నాటకాలు చూస్తుండేవాళ్ళం! చందాదారులకు టికెట్లు వస్తాయి కదా మరి! గురజాడ కళామందిరం కూడా పూర్తిగా శిధిలావస్థలో ఉంది.అయితే స్కూలు బిల్డింగులు మొత్తాన్నీ నవీకరిస్తుండటంతో దాన్ని కూడా కొత్తగా నిర్మిస్తారని ఆశైతే ఉంది.
రూపు దిద్దుకుంటున్న కొత్త స్కూలు బిల్డింగ్
గత కొద్ది ఏళ్ళుగా మా బాలికోన్నత పాఠశాలకు నిధులు సమకూరడం వల్ల కాబోలు కొత్త భవనాలు అమరాయి.బాయ్స్ స్కూలు కూడా మరీ పాతపడిపోవడం వల్ల కొద్ది కొద్దిగా పాత బిల్డింగ్ లను తొలగించి కొత్త వాటిని నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్కూలు గేటుకు ఎదురుగా ఉండే గాంధీ విగ్రహాన్ని తొలగించవలసి వచ్చినట్లుంది. అతి పురాతనమైన గాంధీ విగ్రహం అక్కడ నుంచి మాయమైంది. :-((
అక్కడినుంచి బయటపడుతూ మాత్రం ఏ టీచర్లు ఎలా ఉన్నారు?అనే ప్రశ్న మాత్రం ఎవరినీ అడగలేదు. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లోనే రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నవారు ఇప్పుడెలా ఉన్నారో, అసలున్నారో లేరో తెలుసుకోవాలని నాకు నిజంగా అనిపించలేదు. వాళ్ళు నా ఊహల్లో ఎప్పటికీ మా పాత స్కూలు బిల్డింగ్ లాగే సజీవంగా ఉండాలనే దురాశతో ఆ ప్రశ్న మాత్రం అడక్కుండానే వచ్చేశాను.
భీష్మ...
5 years ago
20 comments:
మా ఇంటి వెనకాలే మీ హైస్కూల్. బాగా వ్రాసారు. నేను ఇంటర్ రంగనాయకులు గారి SSN. కాలేజీ లో చదివాను. దానిపై మీ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
మాట పట్టింపులూ, అపార్థాలూ, నిస్వార్థం, అమాయకత్వం ... స్నేహపాత్రత విరివిగా ఉండే హైస్కూలు స్మృతులను తల్చుకోవటం అందమైన ఆటవిడుపు. మీ హైస్కూలు జ్ఞాపకాలను ఎంత వివరంగా తలపోసుకున్నారో కదా! సూక్ష్మాంశాలను సైతం విస్మరించకుండా రాయటం, చివర్లో సెంటిమెంటల్ టచ్... వంశీ శైలిని గుర్తుకుతెచ్చింది.
good post ,,, nenu hindi exams (pradhamika ,madhyamika )ikkade rasanu andi, kani akkada madams chala strict ga undevallu
రావు గారూ మీదీ మా వూరేనా? అయితే మీ ఇల్లు పాతూరు శివాలయం వీధిలో అన్నామాట! చాలా సంతోషం! మీరు ఇదే స్కూల్లో చదువుకున్నారా/
ఇకపోతే మీరు చదివిన కాలేజీలోనే నేనూ కొన్ని దశాబ్దాల తర్వాత 90 ల్లో చదువుకున్నాను.తర్వాతి టపా మన కాలేజీ గురించే! ఫొటోలతో సహా!
శివప్రసాదూ, అక్కడి మేడములు స్ట్రిక్టుగా ఉంటారని ఎలా తెల్సిందీ? హిందీ పరీక్షలకు స్లిప్పులు పట్టుకెళ్లారు కదూ? ఒక ఊరివాళ్లం...నిజం చెప్పేయండి పర్లేదు :-))
సుజాత గారు ,మేము కూడా నరసరావుపేటలో ఒక ఏడు ఉన్నాము .అప్పటినుంచే నేను నరసరావుపేట అభిమానిగా మారాను . కోటప్పకొండకి చాలా సార్లు వెల్లేవాల్లము .చాలా ప్రశాంతమైన ,ఆధ్యాత్మికత తో కూడిన ప్రదేశం .
హల్లో అండీ, మాకు ఆ రోజుల్లో చింతామణి, సత్యహరిశ్చంధ్ర నాటకాలు చూడాలని ఉండేది. జేబులో డబ్బులుండేవికావు. హైస్కూల్ వెనక బజారులో ఎలిమెంటరి స్కూల్లోనుండి గోడదూకి వెళ్లి నిశ్సబ్దంగా కూర్చునేవాళ్లం. గురజాడకళామందిరం ముందు మేము నిలబడ్డ ఫోటోనే ప్రక్కన మా బ్లాగులో ఉంది. చూడండి. ఇప్పుడు గర్ల్స్హ్ హైస్కూల్ కొత్త బిల్డింగ్ ప్రక్కన మా రోజుల్లో రెండు పెద్ద చెట్లుండేవి. వాటిక్రింద వంగుళ్లు దూకుళ్లు ఆడుకునే వాళ్లం. ఒక్క పదినిమిషాలు లేటుగా వెళ్తే హెడ్ మాస్టారు పార్ధసారధిగారు వెండిబెత్తంతో నిలబడి ఛండశాసనుడిలా భయపెట్టేవారు. అబ్బాయిల స్కూల్ ప్రస్తుత హెడ్ మిసెస్ జ్యోతిమేడమ్ మీకు తెలిసే ఉంటుందికదా ! ఇక ఉంటానండీ, మున్సిపల్ హైస్కూల్ గురించి వ్రాయడం మొదలుపెడితే ఒక వ్యాఖ్య చాలదు. ఒక పోస్ట్ అయినా కావాలి.
@సుజాత గారూ
నేను హైస్కూల్ లో చదవలేదు కానీ మా తమ్ముళ్ళు చెల్లెలు చదివారు. దుర్గా స్టూడియో పక్క వీధి లో ఉండే వాళ్ళం. కోటప్పకొండ తిరణాలకు వెళ్ళే ప్రభలూ, వాటి స్పీకర్ల లో నుండి వచ్చే సినిమా పాటలు, రైలు స్టేషన్ వేపు సాయంత్రపు షికార్లు ఇంకా గుర్తు ఉన్నాయి.
దుర్గా స్టూడియో ఇంకా ఉందండీ!ఆ పక్క వీధిలో అంటే అడ్వొకేట్ పూర్ణాననందం గారి సందన్నమాట. ఇప్పుడు ఆ వీధి అంతా హాస్పటళ్ళూ, డాక్టర్లూ!
శివబాబు గారూ, పార్థ సారథి గారు బెత్తం పుచ్చుకుని గేట్లో నిల్చుంటే టీచర్లు కూడా తలొంచుకుని వెళ్ళాలే తప్ప మాట్లాడేంత ధైర్యం ఉండేది కాదు.
ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయండీ. అప్పట్లో ఎప్పూడైనా వాటికింద క్లాసులు నడుస్తుండేవి కూడా. జ్యోతి మేడమ్ అప్పుడు లెక్కల టీచర్ గా పిల్లల్ని చెండాడేస్తుండేవారు. ఆవిడ ప్రస్తుతం హెచ్చెమ్ గా ఉన్నారని తెలిసి నాకు మగపిల్లల స్కూలు విద్యార్థుల మీద జాలేసింది.
మీ ఫొటో చాలా బావుంది. మీ స్కూలు రోజులని ఈ నరసరావుపేట్రియాట్స్ బ్లాగుకి ఒక అనుభవంగా రాయండి. పేట వాళ్ళందరిదీ ఈ బ్లాగు.
లక్ష్మి గారూ ఒక సారి ఆ వూర్లో నివసిస్తే ఆ బంధం అంత త్వరగా మర్చిపోలేనిది. ఇదే బ్లాగులో కోటప్ప కొండ గురించి కూడా రాశాను చదవండి ! థాంక్యూ
ఆ వీధిలో నా క్లాస్స్మేట్ లాయర్ గారు అయినారు. మా ఇంటి ఎదురుగా ఉండేవారు. వాళ్ళ ఇంటి పేరు పాతూరి అనుకుంటాను. వాళ్ళింట్లో బావిలో మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాను. వీలయితే నేను అడిగానని చెప్పండి.
సుజాత గారు స్కూల్ ఙ్ఞాపకాలను కదిలించారండీ.. చాలా బాగా రాశారు.. గురజాడ కళామందిరం వేదిక మీద బి.వి.పట్టాభిరాంగారి మ్యాజిక్ షో చూసినట్లు గుర్తు చిన్నపుడు ఎపుడో. ఈ స్కూల్ గురించి కథలు కథలు గా వినడమే కానీ ఎప్పుడూ అక్కడ చదవలేదు... కథలంటే ఏవో కాదులెండి అక్కడ చదివిన ప్రముఖుల గురించి. మాష్టార్ల క్రమశిక్షణ గురించీ.. విడివిడిగా ఉండే బాలికల బాలుర తరగతుల గురించీనూ అంతే :-)
Hello,
maadi Yallamanda village andi, chala bhaga rasaru, neenu 10th class municipal school lone chaduvukonanu
Thanks, Great school guruchi chala bhaga rasaru
My native is Anantapuram. I lived in Narasaraopet between 1982-85. Those were memorable days in my life.
I have studied between 6th to 8th standard in SKRBR High School.
My father was member of a fine arts association. We have seen several dramas in Gurajada Kala Mandir.
Along with happiest moments, I remember some of the dreaded moments. During parliament elections two bombs exploded very close to our home. Subsequently there was a big street fight between Congress & TDP followers.
Please write about Bhavanarayana swami temple, Dhanvantari temple etc. I am not getting the area name where a famous Venkateswara & Kalika temples located.
I am still searching for my then best friends - Hari Babu, Ravi Kumar, Mehaboob, Rasheed, Madhava Rao, Prabhakar, Kalyana Chakravarthi, Mallikarjuna Rao & many others.
An excellent blog about NRT.
i did my last two years of high school studies in Municipal High and Inter from SSN. Ofcourse attended pandurangarao gari tuition only. Though we have been living in NRT for generations , my continuous stay is limited to those 4 years only. Though the town i grew up is long gone, I still spend 5 weeks in a year in NRT.
You are narrating it with an exceptional skill . Can not wait for your next post i.e., about SSN college.
Regards
సుజాత గారు, మున్సిపల్ హైస్కూల్ గురించి చదువుతుంటె హాయిగా వుంది. 1977-80 ల్లో బాయ్స్ హైస్కూల్లో 8 -10 క్లాసులు చదివాను. చింతచెట్ల క్రింద చింత పూలు తింటూ క్లాసులు వినటం, NS ల్యాబ్ లో అస్థిపంజరం, 16 ఎం.ఎం. ప్రొజెక్టరు సినిమాలు చూడటం మరిచి పోలేని జ్ఞాపకాలు. ఇంత బాగా వ్రాసే మీరు బ్లాగు ను అప్పుడప్పుడైనా వ్రాస్తే బావుంటుంది.
నమస్కారం సుజాత,
నరసరావుపేట పురలపాలక ఉన్నత పాఠశాల గురించి వ్రాసి మా పాత జ్ఞాపకాలను మరి ఒక్కసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నేను ఇదే పాఠశాలలో 1977-1979 లో 6-7 క్లాసులు చదివాను.
Madam mee inko blog manasulo mata kanipinchadam ledhu.3-4 years back andulo posts anni chadivaanu. Malli chadavalanipinchindi invited readers ki matrame ani display ayindi konnallu. Ippudu assalu kaninchadam ledhu. Dayachesi nannu mee manasulo mata blog ki invite cheyagalaru. Na mail id:- geethanjali4567@gmail.com
Post a Comment