Pages

Sunday, March 6, 2011

మనసున్న మంచి మనిషి--మా వూరి ప్రసాదు

నిజానికి ఈ టపా మా SSN కాలేజీ గురించి రాద్దామనుకున్నాను. కానీ ఇంతలోపే ప్రసాద్ అడ్డం పడ్డాడు.

ఎయిడ్స్ అనే మాట విన్నా, HIV అనే పదం వినపడినా  షాక్ కొట్టినట్లు ఉలిక్కపడతాం. భయపడిపోతాం! మృత్యువు "హాయ్" చెప్పినట్లు కలవరపడతాం! దాని బారిన పడ్డ దురదృష్టవంతులు ఎవరన్నా కనపడితే బోల్డంత జాలిపడతాం. అంతటితో మన పని సరి. కానీ ప్రసాద్ అంతటితో ఊరుకోలేదు. తను నివసించే ఊర్లో అనేకమంది ఎయిడ్స్ బారిన పడి మరణించడం చూసి రెండు కన్నీటి బొట్లు జారవిడిచి తన పనిలో తను పడలేదు. నడుపుతున్న కాలేజీ మూసేసి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరాడు. HIV రోగుల గురించి పూర్తి అవగాహన కల్గేలా వారితో కల్సి తిరిగాడు, పని చేశాడు. 

అలా పని చేశాక వాళ్ళు చనిపోయే లోపు అందరిలాగే సంతోష కరమైన జీవితం గడిపే హక్కు వారికుందనుకున్నాడు. పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తాడు. HIV పాజిటివ్ వ్యక్తులకోసం ఒక మారేజ్ బ్యూరో పెట్టాడు. అంతే కాదు, HIV పాజిటివ్ వ్యక్తుల కోసం ఒక మెన్స్ హాస్టల్, ఒక వుమెన్స్ హాస్టల్ పెట్టాడు. బయట హాస్టళ్ళలో ఉంటే వారికి కావలసిన పౌష్టికాహారం అందదు కదా, వివక్ష కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పని చేశాడు.

HIV పాజిటివ్ వ్యాధిగ్రస్థులకు సంబంధించిన ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం HIV పాజిటివ్ వ్యక్తులకే లభిస్తున్న నేపథ్యంలో ప్రసాద్ కి ఎటువంటి ప్రభుత్వ సహకారమూ లేదు. కేవలం వ్యక్తిగత ఆసక్తితోనూ, దాతల సహాయంతోనూ నెట్టుకొస్తున్నాడు.

దీని గురించి ప్రసాద్ ఒక వెబ్ సైటుని రూపొందించారు. www.hivmarriages.org

ప్రసాద్  ఫోన్  నంబర్ +919391183116

ఇంతకీ ఈ మంచి మనిషి ఎవరనుకున్నారు?  మా వూరబ్బాయే!  

అ మా మునిసిపల్ హై స్కూల్లో చండ శాసనుడైన తెలుగు మాస్టారొకాయన ఉండేవారు. నరసింహారావు గారని. సాధారణంగా చండశాసనులు లెక్కల మాస్టార్లై ఉంటారు. కానీ ఇక్కడలా కాదు. మాస్టారి మనసు వెన్నే గానీ మాట కఠినం!

అమ్మాయిల స్కూల్లో చదువుకునే నేను మా స్కూల్లో పాడిన పాటలు విని "బంగారూ...ఇలారా నాన్నా" అని వాళ్ళ స్టాఫ్ రూముకు తీసుకెళ్ళి తనకు నచ్చిన ఒకటి రెండు పాటలు పాడించుకుని సంతోషపడేవారు. మా స్కూల్లో పాడుతున్నా సరే, అక్కడిదాకా వచ్చి సంతోషంగా విని వెళ్ళేవారు.

ఆ నరసింహారావు గారి అబ్బాయే ఈ శ్రీనివాస హనుమత్ ప్రసాదు!

ప్రసాద్ తో ప్రత్యక్షంగా మాట్లాడాక, మన చుట్టూ ఉన్న సెలబ్రిటిల్లో ఎంతోమంది HIV పాజిటివ్ గా వుండి కొన్ని జాగ్రత్తలతో  అందరిలాగే మామూలు జీవితం ఎలా గడుపుతున్నారో తెలిశాక, చాలా వరకూ అపోహలు తొలగిపోయాయి. ఎవరైనా ఇలాంటివారు కనపడితే ధైర్యం చెప్పొచ్చనే ధైర్యం కల్గింది.

ప్రసాద్ గురించి, అతని సేవల గురించి ఇంకా ఎంతోమందికి తెలియాల్సిన అవసరం ఉంది. అతని సేవలు అవసరమైన వాళ్ళకి, అతనికి చేయూతనివ్వాలసిన వాళ్ళకి ఇతడి గురించి తప్పక తెలియాలి! అందుకే ఇవాళ్టి ఈనాడు ఆదివారం సంచికలో అతని గురించి ఒక చిన్న వ్యాసం రాశాను 


సాంస్కృతిక,సాహిత్య, కళా నేపథ్యంతో తులతూగే నరసరావుపేటకు సామాజిక బాధ్యత అనే మెరుగులు దిద్దిన ప్రసాద్ ని అందరూ అభినందించండి. మనం చేయడానికి తప్పకుండా వెనకడుగు వేసే పనిని తలకెత్తుకుని ఎంతోమంది జీవితల్లో దీపం పెట్టిన ప్రసాద్ కి తగిన చేయూతనివ్వండి.