Pages

Tuesday, August 10, 2010

అయ్యో,మా వూరి గూడు రిక్షా!

మా వూరి గూడు రిక్షాలో ప్రయాణం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది!వెన్నెల రాత్రుల్లో మనం రోడ్డు మీద గూడు రిక్షాలో ప్రయాణిస్తూంటే మా వూరి ఆచారం ప్రకారం కరెంటు పోయి వీధిదీపాలన్నీ మూగవోయినపుడు..చుట్టూ వెలిగిపోతున్న వెన్నెల్లో రిక్షా చక్రాలకుండే మువ్వలు చక్రం తిరిగినపుడల్లా ఒక చక్కని టైమింగ్ తో ఘల్లు ఘల్లునే ధ్వని ఎంతో శ్రావ్యంగా ఉంటుంది.
సినిమాకెళ్ళాలన్నా, ఊళ్ళో ఉన్న చుట్టాలింటికి వెళ్ళాలన్నా , పాతూరు శివాలయానికెళ్ళాలన్నా, PWD ఆఫీసు దగ్గరలో నాగార్జున సాగర్ కుడికాలవొడ్డున ఉన్న శివాలయానికెళ్ళాలన్నా...మల్లమ్మ సెంటర్ కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా ఇంటి నుంచి నాలుగడుగులు ముందుకేసి "తిరపతీ" అనో "కొండబాబూ" అనో "మస్తాన్" అనో కేక వేస్తే చాలు ఠంగ్ మని బెల్లు కొడుతో ముగ్గుర్లో ఎవరో ఒకరు ప్రత్యక్షం అయిపోయేవాళ్ళు.

వీళ్లు ముగ్గురూ మా ఆస్థాన రిక్షా వాళ్ళు. చిన్నప్పటినుంచీ  తెలిసిన వాళ్ళు. మొన్న మొన్నటిదాకా హైద్రాబాదు నుంచి మా వూరెళ్ళినపుడు పల్నాడు బస్టాండ్ లో ఇంకా బస్సులోంచి దిగకముందే బస్సెక్కేసి సామాను అందుకుని నాకంటే ముందే దిగేసేవాళ్ళు.మా వూరి రిక్షాలన్నీ మంగళగిరిలో తయారవుతాయి. ప్రతి రిక్షాకీ అటూ ఇటూ ఎంచక్కా ఎంటీవోడూ,నాగేస్రావూ,కిష్ణా,సోబనబాబూ,వాణీశ్రీ,జైప్రదా,జైసుదా,స్రీదేవీ ఇత్యాదులంతా రంగురంగుల్లో కళకళ్లాడిపోతుంటారు. రిక్షా లోపల కూచున్నవాళ్ళు చూసుకునేందుకు అటూ ఇటూ అద్దాలూ!

 అదేంటో విచిత్రం,మంగళగిరిలో తయారయ్యే ఈ రిక్షాలు గుంటూరు దాటి మా వూర్లోనూ,పిడుగురాళ్ల ఇతర ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండే గుంటూర్లో మాత్రం ఉండవు. అక్కడ స్టాండ్ రిక్షాలు అంటే ఈ బొమ్మలో లాంటి రిక్షాలుంటాయి.నాకు మాత్రం మా వూరి గూడు రిక్షాలే హాయిగా,సౌకర్యంగా ఉంటాయి.

అర్థ రాత్రయినా అపరాత్రయినా ఎక్కడికైనా దొరికే ఏకైక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మా వూరి రిక్షా బండి!


ఇదంతా ఒకప్పటిమాట.


ఇప్పుడు ఈ బండి పరిస్థితి ఇలా లేదు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన ఆటోలు రిక్షా బండి గుండె మీదినుంచి నడుచుకుంటూ పోవడంతో దిక్కుతోచక దారి తప్పిపోయింది. వూర్లో ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్ళినా ఆటోలో(పదిమందిని ఎక్కించుకుంటాడుకదా మరి)ఆరేడు రూపాయలకు మించకపోవడం,రిక్షాకంటే వేగంగా వెళ్ళే సౌకర్యం ఉండటంతో చుట్టుపక్కల పల్లెటూళ్ళకు వెళ్ళేవాళ్ళు సైతం ఆటోలకే ఓటేశారు.

రిక్షా చక్రం తిరగబడింది.

ఇప్పటికీ మా వూర్లో రిక్షాలున్నాయి! కానీ ఇదివరకటి సంఖ్యలో మాత్రం కాదు!


ఎప్పుడు వూరికెళ్ళినా ఆటోలోవద్దనీ,రిక్షాలోనే తిరుగుదామనీ ఏడ్చి గొడవపెట్టే మా పాపకోసం తిరపతినో,మస్తాన్ నో అందుబాటులో ఉండమని చెప్తాను. ఆ మధ్య వూరికెళ్ళినపుడు తిరపతి రోడ్డుమీద కనపడితే రిక్షా ఏదీ అనడిగాను.


                   రిక్షాలో ఉంది మా పాప సంకీర్తన ఏడాది వయసులో ....

                                                             
"తీసేశానమ్మా! ఇప్పుడేవరూ రిచ్చా ఎక్కట్లేదు తల్లా! అంతా ఆటోలమీద తిర్గేవాళ్ళే! అద్దె కట్టలేక తీసేశాను"అన్నాడు.


"మరెలా ?(బతుకుతున్నావూ)?" అన్నాను ఇంకేమనాలో తోచక!


"పంటల కాలంలో పొలాలకు కావలి ఉంటున్నాను!పంటలు లేనికాలంలో సత్యనారాయణ స్వామి గుడి ఊడ్చి,తోటపని సూస్తన్నా"అన్నాడు తిరపతి ఏ భావమూ లేకుండా!


"మరి మస్తానో?"

"మస్తానుకు గుండెజబ్బమ్మా! రిచ్చా తొక్కుదామన్నా ఎక్కేవాళ్ళు లేక వాడూ తీసేశాడు. శీనయ్య చిల్లరకొట్లో పొట్లాలు కడతన్నాడు.మందులకన్నా కావాలగా?"అన్నాడు తిరపతి సుబ్బారావు కొట్లో బీడీలు తీసుకుంటూ!

గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు భారంగా ఉంది. ఏడుపేమో రాదు. బాధేమో తగ్గదు.

ఏమి చేయగలం ఈ నిర్భాగ్యుల కోసం! ఇన్నాళ్ళు రిక్షాని నమ్మి ఇపుడు సడన్ గా ఇలా దిక్కు లేని పక్షుల్లా...

ఎందుకో చెప్పలేనంత దిగులేసింది.


రిక్షాల సంఖ్య ఇప్పుడు మా వూర్లో బాగా తగ్గిపోయింది.అప్పుడెప్పుడో నేను పుట్టకముందు రిక్షాల పోటీలు కూడా జరిగేవంట!


ఇప్పటికీ మా వూరెళితే ,ఎక్కడికెళ్ళాలన్నా మా అమ్మాయి డిమాండ్ మేరకు గూడు రిక్షానే ఎక్కి తిరుగుతాం!ఒకసారి ఒక కథ చదివాను. కృష్ణా నది కి రెండువైపులా ఉన్న రెండు వూళ్లవాళ్ళు వంతెన లేక నానా ఇబ్బందులూ పడుతుంటారు.నాటుపడవలే గతి అవతలితీరం చేరాలంటే! ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కృషి ఫలితంగా ఎలాగో వంతెన వస్తుంది.రెండు వూళ్ళ మధ్యా దూరం రెండు కిలోమీటర్లకు తరిగి పోతుంది.కానీ ఇదివరలో పడవలు నడుపుతూ పొట్టపోసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు పని లేక రాళ్ళెత్తేపనికి పోతూ ఉంటారు.


ఈ కథ ఎవరు రాశారో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి!


తిరపతి మాటలు వింటుంటే ఈ కథే గుర్తొచ్చింది. ఏమీ చేయలేని అశక్తతతో చిన్నప్పుడు స్కూలు కు తీసుకెళ్ళినందుకు   కృతజ్ఞతగా(అనుకుంటూ) తిరపతికీ,మస్తానుకూ కొంత డబ్బు మాత్రం ఇచ్చి రాగలిగాను.

పై ఫొటోలో రిక్షా కర్టెసీ తిరపతి

29 comments:

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

మా ఊర్లోనూ ఇదే పరిస్థితి. రిక్షావాలాలు చాలావరకు తగ్గిపోయారు.

Vinay Chaganti said...

Sir. Thanks for sharing your experiences. It touched my heart to say the least. I can not comment any more but say .. THANKS FOR THE POST.

I wish I could go back in time and see life, but I realize may be my experiences are to be treasured as they come.

Srujana Ramanujan said...

Hmm. Too sad.

He too is preparing a post on the same topic...

I'l be back later again

తార said...

కధ ఈనాడు పుస్తకం లొదే, నేనూ చదివాను..

ఇంక రిక్షాల సంగతికి వస్తే, అదేంటో, మా ఊళ్ళోకుడా రిక్షాలు కనపడటంలేదు, కానీ డిల్లీలో రిక్షాలు ఎక్కువైపొతున్నాయి, వాటికి లైసెన్స్ పెట్టింది నియంత్రించడనికి అక్కడి ప్రభుత్వం.

కానీ మార్పు తప్పదు కదా, మార్పుని ఆపాలి అనుకోవటమూ తప్పే, తప్పదు...

వేణు said...

కళాత్మకంగా ప్రారంభమైన టపా క్రమంగా విషాదభరితమవుతూ ముగిసింది. నిజమే! మీరన్నట్టు.. రిక్షా చక్రం తిరగబడింది. మంగళగిరి రిక్షాలు విజయవాడ లోనూ, ఇంకా సుదూర ప్రాంతాల్లోనూ సగర్వంగా కనపడేవి అప్పట్లో. ఆటోల విజృంభణలోనూ ఇప్పుడు రిక్షాలు అక్కడక్కడా కనిపిస్తున్నా... గూడు రిక్షాలు మాత్రం గత కాలపు చిహ్నాలుగా మారిపోయినట్టే. మన కళ్ళముందే మారిపోతున్న జీవన దృశ్యాలివి!

ఇందు said...

hii...maadi guntur ayinaa nenu narasaraopeta engg college lo chaduvukunna andi....naku ee goodu rikshaalu baaga telsu..nenu eppudu guntur ninchi NRT vachinaa ee rikhsallone maa hostel ki velledanni....inka bustand ki mallamma center ki palnadu bustand ki etu vellalanna ive...auto la hadividi unna...nenaithe rikhsale ekkedanni :) naku ee rikhsalu bhale nachayi :) engg 4 samvatsaraalu naku NRT tho vedadeeyaleni anubandham erpadindi...kotappakonda tiranala...apudu teesukelle prabhalu....panchamukha anjaneyaswami gudi...sivudibomma center,kotagummam, evi marchipoledu.... :)

సుజాత said...

రవిచంద్ర,

ప్రతి టౌనుకీ సిటీ పోలికలొస్తున్నాయి కదా! వాటి ఫలితమే ఇది!

వినయ్ చక్రవర్తి,


చిలకలూరి పేటలో కూడా ఈ గూడు రిక్షాలే ఉంటాయి కదూ!టపా నచ్చినందుకు థాంక్స్!

రిక్షాలు పూర్తిగా మాయం కాకముందే ఎప్పుడన్నా వూరెళ్ళి రిక్షా ఎక్కండి!


సృజనా,
అవునా, తన స్టైల్ వేరు కాబట్టి టపా కూడా వేరేగానే ఉంటుందనుకుంటాను.
తార గారు,
ఈనాడులో చదివానన్నమాట అయితే ఆ కథ! మార్పు ను ఆపాలనే ప్రయత్నం ఫలించదు. మార్పు అవసరం కూడా! కానీ ఆ మార్పు కొందరి జీవిత చిత్రాలను మార్చేయడం బాధ కల్గిస్తుంది కదా! అదే ఈ టపా కథ!

ఇకపోతే ఢిల్లీలో నేను ఎక్కానండోయ్ రిక్షా! దగ్గరి దూరాలకి రిక్షా ఇంకా వాడుతున్నారు ఢిల్లీ ప్రజలు!

సుజాత said...

వేణుగారూ,థాంక్యూ!

మారుతున్న జీవన చిత్రాన్ని ఆపలేం! కదా!స్పీడు యుగంలో ఇంకా రిక్షాలెక్కి ఏమి తిరుగుతాం అనుకునే రోజులొచ్చేశాయి!

ఇందూ,
నువ్వు చాలా చిన్న పిల్లవే అయితే! నరసరావు పేటలో ఇంజనీరింగ్ కాలేజీలొచ్చే సమాయానికి నా చదువు,పెళ్ళి కూడా అయిపోయాయి.

అయితే ఇంకా మీరు అక్కడ రిక్షాలెక్కి తిరుగుతూనే ఉన్నారన్నమాట. ఇంతకీ మీ కాలేజీ ఎక్కడ? కోటప్ప కొండ వైపా? జొన్నల గడ్డవైపా? లేక చిలకలూరిపేట రోడ్డు లోనా? ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజీలేగా ఇప్పుడు?

సుజాత said...

టపాలో మొదట పెట్టిన ఫొటో పేట్రియాట్ వేణూ శ్రీకాంత్ ఇప్పుడే పంపారు. వినుకొండ బస్టాండ్ లో తీశారట ఈ ఫొటో! వెంటనే పెట్టేశాను. టపాలో వర్ణించిన సినిమా వాళ్ల ఫొటోల వర్ణన ఇప్పుడు బాగా అర్థమవుతుంది పాఠకులకు!

థాంక్యూ వేణూ శ్రీకాంత్ గారూ!

ఉమాశంకర్ said...

మా ఊళ్ళో కూడా ఇవే రిక్షాలు. మునిసిపాలిటీ వారు కేటాయించిన "రిక్షా స్టాండ్" లో రిక్షాలు బారులుతీరి ఉండేవి నా చిన్నప్పుడు. ఇప్పుడు అక్కడక్కడా ఒకటీ అరా మాత్రమే.

అప్పట్లో కాస్త దూరంలో ఉన్న ఏదైనా ధియేటర్లో "ఫషో" కెళ్ళాలంటే ఈ రిక్షాలే శరణ్యం. గతుకులొచ్చినప్పుడు కూడా రిక్షా స్పీడు తగ్గేది కాదు. అప్రమత్తంగా లేకుంటే తల పైన కొట్టుకొని మాడు పగిలేది.అయినా ఏమాత్రం కనికరం చూపేవాళ్ళుకాదు రిక్షావోళ్ళు. :)

Venu said...

మీ ఊరికి దగ్గరలోనే ఉన్న మా ఊరు నుంచి ( చిలకలూరిపేట దగ్గర గణపవరం ) పేట కి ఇలాంటి గూడు రిక్షాలుండేవి. నాక్కూడా ఎన్నో జ్ఞాపకాలున్నాయి వీటితో.. వాటిని తట్టి లేపారు. మీరన్నట్లు ఆటోలొచ్చి ఇవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు మా వైపు ఒక్కటి కూడా లేవేమో !

ఇందు said...

అవునండి....నేను 2008 లో 'ఇంజినీరింగ్' పూర్తి చేశా...మా కాలేజి 'నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ' కొటప్పకొండ రోడ్డులొ ఉంది...మీరు అన్నది నిజమే.ఇప్పుడు నరసరావుపేట చుట్టుపక్కల అంతా పుట్టగొడుగుల్లా 'ఇంజినీరింగ్' కాలేజిలే....

వేణూ శ్రీకాంత్ said...

టపా బాగుంది సుజాత గారు, మన ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ గూడు రిక్షాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటినుండి నాకుకూడా ఈ రిక్షా వాళ్ళతో బోలెడన్ని ఙ్ఞాపకాలు ఉన్నాయ్.

ఇంటి దగ్గర రిక్షా వాళ్ళు సాథారణంగా ఆస్థాన రిక్షావాళ్ళుగా ఉంటారు కదా :-) నేను ఒక సారి ఇలా తెలిసిన రిక్షాలో ఏదో సినిమాకి వెళ్తూ డబ్బులు మర్చిపోతే "నేను మీ నాన్నగారి దగ్గర తీసుకుంటానులే బాబు" అని మా రిక్షా అతనే ఇరవై రూపాయిలిచ్చి సినిమాకి పంపించాడు :-)

కానీ వాళ్ళు పడే రెక్కల కష్టం చూస్తే నాకు రిక్షా ఎక్కిన ప్రతీసారి ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉండేది ముఖ్యంగా వృద్దులు తొక్కే రిక్షా ఎక్కాలి అంటే ఇది మరీ ఎక్కువగా ఉండేది వాళ్ళేమో "పర్లేదుబాబు మీరలా అని మానేస్తే మాకు వచ్చే నాల్రూపాయలు కూడా రావు ఎక్కండి" అని ఎక్కించుకునే వాళ్ళు.

ఇపుడీ రిక్షాలు కనుమరుగవుతున్నందుకు ఆనందించాలో బాధపడాలో తెలియడం లేదు. వాళ్ళకి సరైన బ్రతుకు తెరువు దొరికితే సంతోషించాల్సిన విషయమేనేమో..

సుజాత said...

ఉమా శంకర్ గారు, అవును అసలే మన రోడ్లు మరీ నున్నగా ఉంటాయి కదూ..అందుకే ఈ మొట్టికాయలు తప్పవు గతుకుల్లో! ఫష్షో కి మాత్రం రిక్షా కంపల్సరీ!

వేణు,
గణపవరం లో కూడా ఇవేనా! మీ వూరు చుండి రంగనాయకులు కాలేజీకి ప్రసిద్ధి కదా! ఆ మధ్య గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపుగా వస్తూ చూశాను. పాగా పెరిగిపోయింది ఆ కాలేజీ!

ఇందూ,
మీ కాలేజీ నేను చూశానోచ్! ఇదే బ్లాగులో కోటప్ప కొండ పోస్టు ఉంటుంది చూడండి. ఆ పోస్టు కోసం ఫొటోలు తీయడానికి వెళ్ళి..అప్పుడు చూశాను!

సుజాత said...

వేణూశ్రీ,
అవునండీ, తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి చేతిలో డబ్బులున్నా లేకపోయినా ముందు ఎక్కేసి ఆ తర్వాత డబ్బులిచ్చిన అనుభవాలు నాక్కూడా ఉన్నాయి.

వాళ్ళ రెక్కల కష్టం విషయం నాకూ బాధ కల్గించే విషయమే! ఒకసారి కలకత్తాలో చేత్తో లాగే రిక్షా చూసి గుండె ఆగిపోయింది.

దానికంటే ఇది బెటరే అయినా వాళ్ళు లాగుతుంటే మనం ఎక్కి కూచోడం అన్యాయంగా తోస్తుంది. ముఖ్యంగా స్టేషన్ రోడ్లో శంకర మఠం నుంచి ప్రకాష్ నగర్ వెళ్ళేటపుడు రైలు పట్టాల దగ్గర "అప్" వస్తుంది కదా! ఇంకా ,చిత్రాలయ,ఈశ్వర్ మహల్ కి వెళ్ళే చోట రైలు గేటు దగ్గర కూడా..ఎంత కష్టం లాగడం? అక్కడ అసంకల్పింతంగా దిగిపోయేవాళ్లం మేమైతే! కానీ మరి అది వృత్తిగా స్వీకరించినపుడు ఏం చేస్తాం! అందరూ పాపం అనుకుని ఎక్కడం మానేస్తే మొదటికే మోసం వస్తుందిగా!

గిల్టీ ఫీలింగ్ కలగడం న్యాయమే! ఇలాంటి వృత్తులే ఉండకూడదనిపిస్తుంది ఒక్కోసారి!

జయ said...

హైద్రాబాద్ లో కూడా రిక్షా లెక్కామండి. కాని, మెల్లి మెల్లిగా మనకే తెలియకుండా కనుమరుగైపోయాయి. ఇప్పుడు రిక్షా చూద్దామన్నా కనిపించటం లేదు. నిజమేనండి, మీరు చెప్పినట్లు ఎంత సరదాగా ఉండేదో. మీరు చూపించిన రెండో రకం రిక్షాలేకదూ ఇక్కడుండేవి. రిక్షాలో కింద కూచుని కాళ్ళు వేలాడేసుకుని, ఆగుతున్నప్పుడల్లా కాళ్ళు నేలకానిస్తూ, భలే సరదాగా ఉండేది.

సుజాత said...

జయగారూ,నిజమే! చాలా ఏళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నపుడు హైదరాబాదులో రిక్షా నేనూ ఎక్కాను. నల్లకుంట నుంచి చిక్కడపల్లికి రిక్షాలే ఉండేవి అప్పుడు.కానీ ఆ రిక్షా మాత్రం ఏదో తొట్లో కూచున్నట్లు కిందుగా ఉండి దగడానికి చాలా కష్టం అయిపోయేది. ఇప్పుడు హైదరాబాదులో అక్కడక్కడా సామాన్లు రవాణా చేయడానికి(తక్కువ దూరాలకు)మాత్రం కనపడుతున్నాయి రిక్షాలు!

మాలా కుమార్ said...

రిక్షా గూడు తీయించి , ఎంచక్కా వూరేగుతున్నట్లు కూర్చొని , బడీ చావిడి హనుమంతుని గుడికి వెళ్ళటము ఒకప్పటి నాసరదా . ఎక్కడి కి వెళ్ళాలన్నా రిక్షా లోనే వెళ్ళేదానిని . రిక్షాలను చాలా మిస్ అవుతాను నేను .

sivaprasad nidamanuri said...

aa photo lo unna rikshaw photo palnadu road lo kada

సుజాత said...

శివ ప్రసాదు గారూ, అది వేణూ వినుకొండ బస్టాండ్ లో తీసారటండీ! మన వూళ్లలో రోడ్లన్నీ ఒకే పోలికతో ఉన్నట్లు అనిపించడం సహజమే లెండి! :-))

సుజాత said...

మాలాకుమార్ గారూ, పదండి ఓ సారి మా వూరెళ్ళి రిక్షా ఎక్కి తిరిగేసి వద్దాం! :-))

Srujana Ramanujan said...

ఢిల్లీలో రిక్షాలు బాగనే ఉంటాయి. పీజీ అప్పుడు తరచూ ఎక్కుతూనే ఉండే వాళ్ళం. ఊరేగుతున్న ఫీలింగ్ వస్తుందని.

కాన్వకేషన్ ఓ నాలుగు రిక్షాల్లో మా బా౨చంతా కూచుని ఎన్నికల ప్రచారం టైపులో హడావిడి చేశాము :)

భండారు శ్రీనివాస రావు said...

జీవితంలో చాలా విషయాలు కనురెప్పలకిందే కరిగిపోతున్నాయి. అలాటిదే గూడు రిక్షా. నిజానికి రిక్షాలు, గూడు రిక్షాలు ఒకప్పుడు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం మీ బ్లాగు ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు. నాలుగు కాలాలపాటు గుర్తుంచుకోవాల్సిన అంశంపై రాయడం ముదావహం. ఇక రిక్షాలు లాగి పొట్టపోసుకునేవారి జీవితాలంటారా! వెనక అభివృద్ధి వల్ల కలిగే సమస్యలపై ఒక పుస్తకం చదివాను. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా పునశ్చరణ చేసుకోవడం బాగుంది. – భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు. జీవితంలో చాలా విషయాలు కనురెప్పలకిందే కరిగిపోతున్నాయి. అలాటిదే గూడు రిక్షా. నిజానికి రిక్షాలు, గూడు రిక్షాలు ఒకప్పుడు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం మీ బ్లాగు ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు. నాలుగు కాలాలపాటు గుర్తుంచుకోవాల్సిన అంశంపై రాయడం ముదావహం. ఇక రిక్షాలు లాగి పొట్టపోసుకునేవారి జీవితాలంటారా! వెనక అభివృద్ధి వల్ల కలిగే సమస్యలపై ఒక పుస్తకం చదివాను. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా పునశ్చరణ చేసుకోవడం బాగుంది. – భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు.

Vinay Chakravarthi.Gogineni said...

sujaatha gaaru i have not commented yet.ya still we can see this type of rikshas in ch.pet.waiting for ur new post.

వైదేహి said...

సుజాత గారు, అయితే మీరు నా పక్కనే ఉన్నారు, అదేనండీ మాది గుంటూరు, మీది నరసరావుపేట,
చాల కాలం తర్వాత బ్లాగర్స్ లో సమీప నేస్తం మీరు తగిలారు, అప్పుడప్పుడూ నా బ్లాగ్ కూడా విజిట్ చేస్తూండండి.

సుజాత said...

వైదేహి గారు,
గుంటూరుతో కూడా నాకు బోలెడంత అనుబంధం ఉందండీ! బోలెడంత మంది బంధువులు ఉండటంతో ఎప్పుడు కావాలంటే బస్సెక్కి పాత బస్టాండ్ లో దిగి శ్యామలా నగర్ బస్సో, కొరిటపాడు వెళ్ళే సిటీ బస్సో పట్టుకుని వెళ్ళిపోయేవాళ్లం! ఇప్పటికీ ఊరు వెళ్ళినపుడల్లా శంకర్ విలాస్ సెంటర్ కి వెళ్ళి ఆ గాలి హాయిగా పీల్చుకుంటాను. అరండల్ పేట ఒకటో లైన్లో పాత పుస్తకాలు కొంటాను.

drsivababu said...

చాలా సంతోషం అండీ మీ బ్లాగు ఇప్పుడే చూశాను. మార్కెట్ ఎకానమి వ్యక్తుల్ని, విలువల్ని మింగేస్తుంటే, రిక్షాలేముంటాయండీ ! ఆఖరికి మంగలిషాపులు,రిటైల్ వ్యాపారాలన్నింటినీ కార్పొరేట్స్ వేటు వేయబోతున్నారు. అందుకే నరసరావుపేట పూర్వ విద్యార్ధులంగా మేం కొంతైనా పాత జ్ఞాపకాల్ని, విలువల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. మా బ్లాగ్ కూడా మీరందరూ ఒకసారి చూడండి. www.nrtfriends.blogspot.com
డా.శివబాబు,ప్రగతినర్సింగ్ హోమ్, జహీరాబాద్

srinu said...

చాలా బాగుంది సుజాత గారు

అందమైన వెన్నెల వెనుక అమావాస్య చీకటి ఉంతుందని మల్లి గుర్తుచేసుకొన్నను

ఎనివే మీ పాత గ్యాపకానికి మీరు చేసిన డబ్బు సాయం, అమూల్యం

ఐ రియల్లీ హట్సాఫ్ టు యు

ఆశా వర్ధన్ said...

ఈ రిక్షాలు కూడా ఉండని ఊ పల్లెల్లో గుర్రబ్బళ్లు,జట్కాలు ఉండేవి..