Pages

Tuesday, February 9, 2010

మెట్లదారిలో కోటప్ప కొండెక్కి...!ఈ రోజు ఏకాదశి. మా కోటప్ప కొండ దగ్గరి దృశ్యాన్ని ఊహించుకుంటే రెక్కలుంటే బావుండు, ఎగిరెళ్ళి అక్కడ వాలిపోదామనిపించేంత తిక్కగా ఉంది! అక్కడ , త్రికోటేశ్వరుడిని దర్శించుకోడానికొచ్చిన వేలాది, లక్షలాది మనుషుల మనసుల నిండా ఆ మహాదేవుడే నిండిపోయి ఉంటాడు. తిరణాల తిరణాలే...భక్తి భక్తే! అంతా కోలా హలం! అంతా సందడి, అంతా సరదా!(తిరునాళ్ళు సరైన పదమనుకుంటా గానే మేము తిరణాల అనే అంటాం మరి)
ఊళ్ళోనే ఉన్నా ఏడాదికొక్కసారైనా కనపడని బంధువులూ, స్నేహితులూ పరిచయస్తులూ అంతా కోటప్ప కొండ తిరణాల్లో కలుస్తారని మా వూర్లో జోకుంది.


మహాశివరాత్రి పండగరోజైతే చుట్టు పక్క పల్లె జనాలంతా ట్రాక్టర్లూ, ఎడ్లబండ్లూ, ప్రభల్తో వస్తారు కాబట్టి మరీ రద్దీగా గా ఉంటుందని సాధారణంగా మా టౌను వరకూ ఏకాదశి రోజే కొండ మీద ప్రత్యక్షం అవుతుంది.పల్లెటూరి జనాల రద్దీని తట్టుకోలేం అనేది మరో భావన! అక్కడికి మేమేదో క్లాసూ,పల్లెటూరి జనాలంతా మాసూ అని మాకో పెద్ద భ్రమ!దాదాపు తొమ్మిదివందల మెట్లు! స్నేహితులు, బంధువులు,ఇరుగు పొరుగులు అందర్తో కలిసి మెట్లదారిలో కొండెక్కడం అప్పట్లో ఒక పెద్ద గొప్ప! ఫాషన్, సరదా, సంప్రదాయం, ఇంకా చాలా!
తిరణాలంటే చెప్పేదేముంది! వందల సంఖ్యలో రాత్రికి రాత్రే వెలసే దుకాణాలు,లారీల్తో వచ్చి వాలే చెరుకుగడలూ,రంగుల రాట్నాలు, అంతా సంతోషమే, అంతా ఉల్లాసమే!కొండమీదేమో ఇవేవీ పట్టని ఆదిభిక్షువు!* * *అసలు మా వూరికీ, మహాశివుడికీ గొప్ప అనుబంధం ఉంది. ఊరిమధ్యలో భిక్షా పాత్రతో గంభీరంగా రోడ్డు మధ్యలో బైఠాయించిన శివుడి విగ్రహాన్ని మీరు ఇంకెక్కడైనా చూశారా? చూడకపోతే కొంచెం పక్కకిచూడండి...కనపడతాడు..మా వూర్లోని మహాశివుడు. మూడోకన్ను జనం మీద పడకుండా భిక్షాపాత్రతో నీరు తాగుతున్నట్లు అది కొంచెం ముఖానికి అడ్డంగా వచ్చేట్లు చెక్కాడు శిల్పి సూరిగారు.మా వూరి చరిత్రే పాతూరు శివాలయం వీధి నుంచి మొదలైంది ! ఆ భీమలింగేశ్వరాలయానికి 1100 యేళ్ళ చరిత్ర ఉంది. ఊరికి కాస్తంత చివరగా త్రికూట పర్వతం మీద కొలువైన కోటయ్య స్వామి కూడా యేటా లక్షలకొద్దీ భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఊరు చుట్టుపక్కల పల్లెల్లో ప్రతి నాలుగైదు ఇళ్ళకో ఒక కోటేశ్వర్రావో, కోటయ్యో, ఉండటం,వాడిని "కొండ"అని పిలవడం మామూలే!

శివరాత్రికి కొండకెళ్ళాలని శివరాత్రి ముగిసిన మర్నాటినుంచే ఎదురు చూసేవాళ్ళే ఊర్నిండా! చిన్నప్పుడు తప్పిపోతామని మమ్మల్ని ఇంట్లో పడేసి, పెద్దవాళ్లంతా కొండకెళ్ళిపోయేవాళ్ళు గానీ కాలేజీ కొచ్చాక పోన్లే పాపమని మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. మావయ్యలు,పిన్నులు,అత్తలూ వీళ్ళంతా తయారు.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీల్లో , చిలకల్లా వాళ్ల వెంటే! చిలకాకు పచ్చ పట్టు లంగా మీదికి పింక్ రంగు వోణీ(లంగా అంచు రంగన్నమాట),రాణీ పింక్ రంగు పట్టులంగా మీదికి నేవీ బ్లూ వోణీ(ఏంటలా నవ్వుతారు,... ఇవి అప్పట్లో భలే హాట్ కలర్ కాంబినేషన్లు తెల్సా) పసుపు పచ్చ పట్టులంగా మీద......తెలుసుగా మెరూన్ కలర్ వోణీ! ఈ రంగుల్లో బోల్డన్ని సీతాకోకచిలకలు!అన్నయ్యలు,మావయ్య కొడుకులూ మిగతావాళ్ళంతా పోజు కొడుతూ "వీళ్ళు చూడండ్రా,ఎలా గంగిరెద్దుల్లా తయారయ్యారో!.వీళ్ల పక్కన కూడా నడవొద్దురరేయ్"అనేసి కట్ట కట్టుకుని మాకంటే ముందే కొండెక్కేసేవాళ్ళు.క్రిక్కిరిసిన కొండ మెట్లదారిమీద ఇరవై మెట్లెక్కేసరికి "ఇక నావల్ల కాదు"అనిపించేది.ఐదునిమిషాలాగి మళ్ళీ ఎక్కడం! పచ్చటి ప్రకృతి పరుచుకున్న కొండమీద మెలికలు తిరిగే మెట్లూ, మధ్య మధ్యలో ఆకు దొనెల్లో కుంచెమంటే కుంచెమే పులిహోర,మంచినీళ్ళు అందించే సత్యసాయిసేవా సమితివాళ్ళూ(వాళ్ళలో మాకు తెలిసినవాళ్ళుండి,మాక్కొంచెం ఎక్కువ పులిహోర పెట్టేవాళ్ళు) పసి పిల్లల్ని భుజాలమీద కూచోబెట్టుకుని కొండెక్కే నాన్నలూ, కొంచెం ఆదమరుపుగా ఉంటే చేతిలో పొట్లాలో,అరటిపళ్ళో లాక్కెళ్ళిపోయే కోతులూ,నీళ్ళు కలిపిన పసుపు కుంకుమల బకెట్లతో మెట్ల పూజ చేస్తూ ఎక్కే వాళ్ళు, ఉన్నట్టుండి "చేదుకో కోటయ్యా చేదుకో"అని వినపడే భక్తుల కేకలు!

చిన్నప్పుడు మాకు అది "చేరుకో కోటయ్యా"అని వినపడి ఉషశ్రీని అడిగితే బాగోదని ధర్మ సందేహం అమ్మనడిగాం "మనం కదా కొండెక్కేది? ఆయన్ని 'చేరుకో" అనడమేమిటి?"అని!అమ్మ ఆశ్చర్యంగా నవ్వేసి "అది చేరుకో..కాదు! చేదుకో! నూతిలో వేసిన చేద బకెట్ ని పైకి ఎలా సులభంగా లాగుతామో,అలా కొండెక్కే శ్రమ తెలీకుండా పైకి చేదుకోమని అడగడం అన్నమాట"అని చెప్పింది.


కొండమీద కనపడితే చాలు చేతిలో తినుబండారాలూ, జళ్ళో పూలూ లాక్కెళ్ళి పోయే కోతులు =తయారు. చేత్లో కొబ్బరిచిప్పలు చూశాయా...వెంటే వస్తాయి. రమ్మంటే దగ్గరికి వచ్చి చాలా స్నేహంగా తీసుకుంటాయి చేతిలో అరటి పళ్ళూ, కొబ్బరి చిప్పలూ! పండగ రోజు చుట్టుపక్కల పల్లెటూళ్ళనుంచి సింగారించుకుని వచ్చే ప్రభలు! గణపవరం,దేచవరం,రూపెనగుంట్ల,రావిపాడు,చల్లగుండ్ల,గామాలపాడు,నకరికల్లు,కళ్ళగుంట,ఒప్పిచర్ల,లింగంగుంట్ల,కేసనపల్లి, ఈ వూళ్ళన్నిటినుంచీ మైకు సెట్టింగుల్తో,ఎలక్ట్రిక్ దీపాలతో ట్రాక్టర్ల మీద వస్తాయి.((పండగ రోజు ఉదయం నుంచీ మర్నాడువరకూ మాకు కరెంట్ ఉండేది కాదు.మా ఇంటికి దగ్గర్లోని రోడ్డుమీదినుంచీ ఈ ఎలక్ట్రిక్ ప్రభలన్నీ వెళ్ళేవి)ఇదివరలో ఎడ్లబండ్లమీద వచ్చేవట)ఆ ప్రభలు ఒక పెద్ద సందడి. పందాలు పడి ఒకరి కంటే ఒకరు ఎత్తుగా కడతారు కాబట్టి అవి పడిపోకుండా, వాలిపోకుండా ఉండటానికి బలమైన మోకులు(తాళ్ళు) ముందు, వెనకా కట్టి కొందరు అవి పట్టుకుని కొండదాకా నడిచి వస్తారు. ఎన్ని మైళ్ళయినా సరే! సంప్రదాయం ప్రకారం ఎద్దులతో కాసేపు ప్రభను లాగించి ఆ తర్వాత ట్రాక్టర్ కి కట్టేవాళ్ళు. ఆ ప్రభను ఏదైనా వూళ్ళో లంచ్ బ్రేక్ కోసం ఆపినపుడు అక్కడి ఆడవాళ్లంతా పెద్ద పెద్ద బిందెల్తో నీళ్ళు తెచ్చి ప్రభ ముందు "వారు" పోయడం చిన్నపుడు చూస్తుండేవాళ్ళం.ఇదంతా ఎప్పటిదో పాత కథ!
ఆ తర్వాత మా వూరి మాజీ ఎమ్మెల్యే మంత్రిగారిగా కూడా ఉన్నపుడనుకుంటా కొండమీదికి ఫటా ఫట్ రాజమార్గం లాటి ఘాట్ రోడ్డు వేయించేశారు.(రాజు తల్చుకుంటే అని ఊరికే అన్నారా)ఇప్పుడు కింద నుంచి కొండమీదికి ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయల షాపులనుంచీ,చెప్పుల స్టాండ్ ల దాకా అన్నీ పక్కా దర్శనీయ స్థలాల్లో లాగానే కొండమీదే తయారయ్యాయి.నరసరావుపేట నుంచి కొండకెళ్ళేదారి NH5 కంటే నున్నగా అందంగా ఉంటుందిప్పుడు.  దారి పొడుగునా బోలెడన్ని ఇంజనీరింగ్ కాలేజీలు!  కొండపాదాల వద్దే టూరిజం డిపార్ట్ మెంట్ వారి కాటేజీలు..కళ్ళు చెదిరే అందంతో,ఏసీ సహా సకల సౌకర్యాలతో! అసలు ఇదొక రిసార్ట్ లా ఉందిప్పుడు.
ఘాట్ రోడ్డు ప్రతి మలుపులో కనువిందు చేసే పార్కులు,విగ్రహాలు!అంతా మారిపోయింది.అసలు కొండమీద గుడి కూడా మారిపోయింది. మూలవిరాట్ ని నేను గుర్తేపట్టలేదు. "ఇదేనా గర్భగుడి"అని ఆశ్చర్యపోయాను. కోటప్ప
మాత్రం నన్ను గుర్తుపట్టి "ఏందమ్మాయ్,ఎప్పుడొచ్చా? ఏందిట్ట మారిపొయ్యావు? ఈ మజ్జెన అవుపడట్లేదేంది?"అని మా వూరి యాసతో పలకరించాడనుకోండి!
సౌకర్యాల పరంగా కొండ ఇప్పుడెంతో మెరుగ్గా హాయిగా ఉంది కానీ ఘాట్ రోడ్డుపడటంతో మెట్లదారిని వాడేవారే కరువయ్యారు. పండగ సమయాల్లో మెట్లదారిన వస్తామనో,మెట్లపూజ చేస్తామనో ఎవరైనా మొక్కుకుంటే తప్ప!ఏది ఎంతగా మారినా,ఎంత ఘనంగా రోడ్లూ గోపురాలూ కట్టినా మా కోటయ్య మాత్రం మారడు.

తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగులలుముతూనో,కరకు గర్జనల మేఘ మాలలకు మెరుపు హంగులద్దుతూనో, ఆ ఆది భిక్షువు చిద్విలాసంగా కొండకొచ్చేవారిని చిరునవ్వుతో పరికిస్తుంటాడు." కోటయ్య సావి మీద ఆన బెట్టి చెప్తున్నా"అని అలవోగ్గా అబద్ధాలాడేసే రాజకీయనాయకుల్ని సైతం అదే చిరునవ్వుతో చూస్తూ "నీ లెక్క తర్వాత చూస్తాన్లే"అంటాడు.ఊరు ఊరంతా సంతోష సాగరమై కొండకు పరుగులు తీసే వేళ ఊరికి దూరంగా ,ఇక్కడ....ఆ మహాదేవుడి సన్నిధికి ఊహల్లోనే మెట్లదారిన కొండకు ప్రయాణమవుతున్నా!


అన్నట్టు, అద్దిరిపోయే ఫొటోలు తీసిందెవరో కాదు, నేనే!

ఎలక్ట్రిక్ ప్రభ ఫొటో ఇచ్చినందుకు గోగినేని వినయ్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు

36 comments:

మాలా కుమార్ said...

మా మామగారు చిన్నప్పుడు కొటప్ప తిరణాలకి తప్పక వెళ్ళేవారట . చివరి రోజు లలో , పరాకుగా వున్నప్పుడు కోటప్ప తిరణాలకి గురించి చాలా కలవరించారు .

మైత్రేయి said...

చాల బాగా రాసారండి.
పరికిణి ఓణి ముచ్చట్లు బాగున్నాయి.
మీరు అమ్మయి వెర్షన్ రాసారు. అబ్బాయిల దృష్టిలో తిరణాల గూర్చి ఎవరైనా రాస్తే బాగుంటుంది :) .
ఇప్పుడు కూడా .. మా నాన్న ముఖం వెలిగి పోతుంది కోటప్ప కొండ తిరణాల పేరు చెప్పగానే .. మరి ఏమి గుర్తుకు వస్తాయో ..

sudha said...

సుజత గారూ

కోటప్ప కొండ గురించి చాలా బాగా వ్రాసారు. ఫొటోలు చాలా బావున్నాయి. కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ....అన్న పాటే తెలుసు ఇన్నాళ్ళూ. మీతో పాటూ మమ్మల్ని కూడా మీ వూరు తెసుకెళ్ళినందుకు ధన్యవాదాలు.

సుధ

Balu Chaturvedula said...

ఆవునండీ. కోటప్పకొండ అంటె ఒక మధుర అనుభూతి. మీరు కూడ చాల బాగ రాశారు.

raj said...

మా ఊరినుండి కోటప్పకొండ రాత్రి పూట బాగ కనిపించేది...అందుకు కారణం గుడి గోపురం పైన అలంకరించిన లైట్లు అని వెరే చెప్పక్కర్లేదు...ఇక ప్రభల విషయాని కొస్తే నేను చాలా చినప్పుడు ఈ ప్రభల మీద రికార్దింగ్ డాన్సులు జరుగుతుండేవి..అవి ఈ రొజుల్లొ టివిల్లో జరిగే రియాలిటీ షొలకన్న ఎంతో మిన్న..ఎంతో దగ్గరగా ఉన్నా ఆ కోటయ్యని దర్శించుకొనే భాగ్యం నాకు దొరకలేదు..మా పూర్వీకులు వైష్ణవ భక్తులవటమే దీనికి కారణమేమో..కాలంతో పాటు మేమూ మారాము..మీ వర్ణన చాల బవుంది..ఈ శివరాత్రికి కోటేశ్వరుని దర్శించుకొనే భాగ్యం కలుగుతుందని అనుకుంటున్నాను..

raj said...
This comment has been removed by a blog administrator.
సుజాత said...

Raj,

"ఈ ప్రభల మీద రికార్దింగ్ డాన్సులు జరుగుతుండేవి..అవి ఈ రొజుల్లొ టివిల్లో జరిగే రియాలిటీ షొలకన్న ఎంతో మిన్న"...ఎంత బాగా చెప్పారండీ!

Anonymous said...

ఫొటోలు నిజంగానే అదిరిపోయేలా ఉన్నాయండీ! చాలా అందమైన ప్రదేశం కదూ! తప్పక చూడాల్సిందే! మెట్లదారిలో వెళ్ళలేకపోయినా ఘాట్ రోడ్లో అయినా వెళ్ళి కోటప్ప గారిని చూడాల్సిందే!

అరుణాంక్ said...

శివరాత్రి సమయం లో వెళ్ళ లేదు .ఎక్కువ వత్తిడి గా ఉంటుంది అని వెళ్ళ లేదంటే సబబుగా ఉంటుంది .కోడెల బాగానే డెవెలప్ చేసాడు.ఫోటోలు బాగున్నై .నరసరావు పేట అని చూడగానే పోస్ట్ క్లిక్ చేసాను.

సుజాత said...

మైత్రేయి గారు,
అబ్బాయిల వెర్షన్ అంటే చాలామంది వచ్చేస్తారేమోనండీ! మా వూరోళ్ళు, వూరి చుట్టుపక్కలవాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు!

కౌటిల్య said...

సుజాత గారూ,
నాక్కూడా కోటయ్య సామితో చిన్నప్పట్నుంచీ చాలా అనుబంధం...ఇంట్లో తాతయ్యలూ,నాన్నమ్మలూ చెప్పే తిరణాల సంబరాల కథలినీ,ఇనీ(ముఖ్యంగా గొల్లభామ కథ)... ప్రతి తిరణాలకీ వెళ్దామని నాన్నని అడగటం,నాన్న వద్దని సున్నితంగా మందలించటం..బాగా గుర్తు...కాని కార్తీకమాసంలో మాత్రం తీసుకెళ్ళేవారు...ఇంత బాగుందిగా తిరణాలప్పుడెందుకు తీసుకురారా అనుకునేవాణ్ణి....ఇప్పటికీ ఊర్నుంచొచ్చేప్పుడు,వెళ్ళేప్పుడు బస్సు చిలకలూరిపేట దగ్గరకి రాగానే,ఎవరో తట్టినట్టు నిద్రలేచి,గబగబా చెప్పులు విప్పి దూరంగా మంచుతెరల మధ్య త్రిశూలాకారంలో దర్శనమిచ్చే త్రికోటేశ్వరస్వామికి, అదేనండీ,మన కోటయ్యసామికి,మనసారా దణ్ణఁవెఁట్టుకుంటా....కానీ నాలుగేళ్ళయింది కొండకెళ్ళి....అప్పుడు కొండమీదికి వెహికల్లో వెళ్ళినా పక్క వెహికల్లో వెళ్ళేవాళ్ళు"చేదుకో కోటయ్యా" అనరుస్తుంటే,నేను కూడా గొంతు కలిపా..."నాకూ చెయ్యందిచ్చి ఈ కష్టాల కొండలు దాటించమని"(అప్పుడు దగ్గర్లో నా మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి,అది వేరే విషయం).....

సుజాత said...

కౌటిల్య,
బావుందండీ, కోటయ్యతో మీ స్నేహం! చెయ్యి అందించే ఉండాలే మరి డాక్టర్ గారికి!

స్థలపురాణం రాయాలనుకోలేదు, అందుకే గొల్లభామ కథ గానీ, ఫొటోలు కానీ పెట్టలేదు.

durgeswara said...

kotappakomda goorchi amdariki baagaa ardhamayyelaa vraasaaru
dhanyavaadamulu

Vinay Chakravarthi.Gogineni said...

nice........10 days nundi raatrimbavallu kashtapadi prabhalu kadataaru........eppudu prabha katte appapuram maa baava vaalla vooru.50 moorala ettu kadataaru.ee postlo vuna aa lighting vunna prabhaki 5 lakhs ayyindi in 2008.

nenu modati saari 6th lo eddulu bandi meeda vellanu.adi excellent anubhavam.recent ga vellanu but enduko anta happy ga anipinchaledu.


aaa kotappakonda puraanam gurinchi raayaalsindi.

inkoti cheppana
kondameda asalu kaakule vundavu.daaniki edo kadha(puraanam chebutaaru).

abbayila version ante.........eddulabandior truck lonchi digani ammayilanu choostu atu itu tirugutu.........manchi age lo vunna vaallani stage meedaku pilustaaru troop vaallu vaallato dance veyamani.alane ishtamaina hero songs kosam tagaada pettukovadam.abbo ado pedda kadha.

సుజాత said...

వినయ్ చక్రవర్తి,
మీ వాళ్ళు ఐదు లక్షలు పెట్టి ప్రభ కట్టారా? అమ్మో అనిపిస్తోంది!

రీసెంట్ గా వెళ్ళినపుడు అంత హాపీగా అనిపించలేదని రాశారు. నాకూ అలాగే అనిపించింది. నా ఊహల్లో ఉండిపోయిన గుడి వేరు, ఇది వేరుగా కనిపించడం వల్ల అనుకుంటాను. ఆనాటి సందడి ఎక్కడా లేదు. మెట్ల దారి అంతా ఎవరో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్లు నిశ్శబ్దంగా, బోసిపోయినట్లు కనపడింది.

మొత్తానికి అబ్బాయిల వెర్షన్ మీరు చెప్పేశారన్నమాట.ఇలా సింపుల్ గా చెప్తే చాలదు. మీరొక పోస్టు రాయాలి ఈ బ్లాగ్ కి!

కోటప్ప కొండ కథ చాలా పెద్దది. ఫొటోలే చాలా ఎక్కువ పెట్టాను. కథ కూడా రాస్తే ఇది చాలా పెద్ద టపా అయి బోరు కొట్టిస్తుందేమో అనిపించి విరమించాను.

కొండమీద కాకులు ఉండవన్న సంగతి నేను గమనించలేదు. ఇక్కడ కాదు గానీ పొందుగల దగ్గర సత్రశాల అనే ఊరుంది చూడండి, కృష్ణా నది ఒడ్డున..అక్కడ మాత్రం కాకులు ఉండవని చెప్తారు.

సుజాత said...

మాలా కుమార్ గారు,
కోటప్ప కొండ శివుడిని ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేమండీ! ఆ అనుభూతిని నిర్వచించలేం!చివరి రోజుల్లో మీ మామగారికి బహుశా ఆయనే కనపడి పలకరించాడేమో!అందుకే కలవరించి ఉంటారు.

సుధ గారు,
థాంక్యూ! మా తిరణాల మీక్కూడా నచ్చిందన్నమాట! కోటప్ప కొండకు వస్తానని ..పాట ఊటీలో తీశారట.:-)

అప్పుడప్పుడు కొండ దగ్గర షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయండీ! బాలకృష్ణ "పల్నాటి బ్రహ్మనాయుడు" ఇంకా ఏవేవో జరిగాయి అక్కడ!

బాలు గారు,
అవును, కోటప్ప కొండ మధురానుభూతే ! థాంక్యూ!

నీలాంచల,
థాంక్యూ! ఆ రోజు అక్కడ పెద్ద వర్షం!నాకేమో పెద్ద పెట్టున జ్వరం!,మర్నాడు హైద్ రావలసి ఉండటంతో జ్వరంలోనే వెళ్ళి తీశాను ఫొటోలు!

అరుణాంక్,
అవునండి! మొత్తం డెవలప్ మెంట్ క్రెడిట్ మొత్తం కోడెలకే ఇవ్వాలి! కొండే కాదు వూరు కూడా అలాగే డెవలప్ చేశాడు.

దుర్గేశ్వర గారూ,
శివరాత్రికి మీరు వెళ్ళడం లేదా ఈ సారి! వెళ్ళి మా తరఫున కూడా నమస్కారాలు అందించండి.మీరు ఇస్తే మేము రాలేదనే కోపం పెట్టుకోకుండా తప్పక తీసుకుంటాడు కోటేశ్వరుడు.

Vinay Chakravarthi.Gogineni said...

i don't have writing skills....

s... kodela did nice work........

just for lighting we spent 2.5L ,most of the time we(Appapuram) got best award from collector.

cherukulu mension cheyaledu.manaki takkuvaga dorukutaayikada anduke naaku,tiranaala ante chaala ishtam vundedi.


really u did excellent job........
Thx.

సుజాత said...

చెరుకుల గురించి రాశానుగదండీ! అంటే వివరంగా రాయలేదు.కొండ దగ్గరి నుంచి చెరుకు గడలు కొని ఇంటికి తెచ్చుకుని ముక్కలు గా నరికి, నాలుక చిరిగి పోయేదాకా తినడం ఇంకా గుర్తుంది.ఏడాదికోసారే అన్ని చెరుకులు ఒక్కసారి చూస్తాం కాబట్టి అంత అబ్బురంగా అనిపిస్తుంది. కొండకెళ్ళిన వాళ్ళు చెరకుల్లేకుండా ఇంటికి రావడం ఎక్కడన్నా ఉందా?

స్రవంతి said...

మాది కుడా మీ పక్క ఊరేనండి సుజాత గారు కాకపోతే ప్రకాశం జిల్లా. మా నాన్నగారు కూడా 10 సంవత్సరాల క్రితం వరకు కోటప్ప కొండ తిరునాళ్ళ కి ప్రతి సంవత్సరం వెళ్ళేవారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలసి మాకు మాత్రం చెరుకు గడలు తెచ్చేవాళ్ళు . ఈ మద్య ఎక్కువ గా వెళ్ళడం లేదు ఎందుకో?. అలాగే మార్చి లో సింగరకొండ తిరణాల (అద్దంకి దగ్గర),ఏప్రిల్ లో చదలవాడ తిరణాల ,మే లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వరుసగా వచ్చేవి తదియ రోజు అనుకుంటా నెలలు వేరే కాని తారీకు ఒకటే ఉండేది తిది కలిస్తే. మేము బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం వేసవి సెలవల్లో. కోటప్ప కొండ కి వెళ్లలేదని మీ ఫొటోస్ చూసి చాలా ఫీల్ అవుతున్నాను .

గీతాచార్య said...

పెబెనక పెబను పెట్టి పదారు పెబలు గట్టీ... :-)

బాగుందండీ. ఇప్పుడెందుకో అంత ఆసక్తి లేదు గానీ, చిన్నప్పుడు ప్రభలు గట్టుకుని మరీ వెళ్ళిన సందర్భాలున్నాయి. అక్కడ బొమ్మల కోసం చేసిన గోలా, కొన్న చెరుకుని ఉన్నదున్నట్టు ఇంటికొచ్చేలోగా తినెయ్యాలనుకునే పందేలు, ఏకాదశి నాటి మెట్ల పందేలు... (మెట్లెక్కుతూ, ఎవరు ముందెళ్ళాలనే కాకుండా, మెట్లు కూడా లెక్కబెట్టాలి. రెండో వాళ్ళు చెప్పిన గుర్తు దాకా), ఆహా భలే ఉంటాయి.

ఇవన్నీ కామెంటే బదులు వ్రాసేస్తే ఒక టపా పడుతుంది కదా...

Srujana Ramanujan said...

బాగున్నాయండీ. బాగుందనిగాక వేరే ఏమని చెప్తాం? అసలే ఇది పేట్రియాటిక్ బ్లాగాయే...

ఫొటోలు నిజంగానే అద్దిరిపోయాయి. ;-)

పానీపూరి123 said...

మేము కోటప్పకొండ తిరునాళ్ళకి ఒకటి,రెండు సార్లు వెళ్ళాము...
ఇంక ఆ పెబల దగ్గర డాన్స్... నా సామిరంగ... జజ్జనక జనారే...జజ్జనక జనారే..

వేణు said...

కోటప్ప కొండ ‘తిరణాల’అప్పుడెలా ఉండేదో, ఇప్పుడెలా మారిపోయిందో అక్షరాలా కళ్ళకు కట్టేశారు.

‘చేరుకో కోటయ్యా’ అనడం ఏమిటనే చిన్నప్పటి మీ ధర్మసందేహం నవ్వు తెప్పించింది.

ఎప్పుడూ మీ ఊరి పరిసరాల వైపు అడుగుపెట్టని వారికి కూడా దృశ్యానుభూతిని కలిగిస్తూ ఫొటోలు చూడచక్కగా ఉన్నాయి.

ఇక చివరి వాక్యం...ఎంతో హృద్యంగా ఉంది!

ఇంతకీ మీ ఊరి యాసలో పలకరించే మీ దేవుణ్ణి- రాజకీయనాయకుల ‘లెక్క తేల్చటానికి ఎంత కాలం పడుతుందో’ గట్టిగా అడగండి.

భావన said...

చాలా బావుంది సుజాత మీ వూరి తిరణాల కబర్లు. పిక్చర్స్ చూస్తే వెళ్ళాలనిపిస్తోంది. నాకు చాలా మంచి ఫ్రెండ్ ది నరసరావు పేట. ఎప్పుడు చూడు ఆ అబ్బాయి నోటీ నుంచి మీ వూరి గొప్ప విని విని తల బొప్పి కొట్టి పోయేది. వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద శివుడీ పిక్చర్ చాలా పెద్దది వుండేది నేను ఎక్కడా చూడలేదు అంత పెద్ద పిక్చర్. మా వూరు వైపు (పేట, ఇంకొల్లు)నుంచి కూడా ప్రభలు కట్టేవారని చెప్పేది మా నాయనమ్మ. అవును కదా అప్పట్లొ ఆ రంగులన్ని యమా ఫేమస్. తల్లో చేమంతి పూలు పెట్టుకోలేదా ఆ రంగులకు మ్యాచింగ్ గా? ;-)

ఉమాశంకర్ said...

నా చిన్నప్పుడు తిరనాల అంటే బొప్పూడి, కోటప్పకొండ.. అ తరువాత శింగరాయకొండ..మొదటి రెండు తిరునాళ్ళు చిన్నప్పుడే చూసేసినా కోటప్పకొండ తిరునాళ్ళకి ఇంట్లో పర్మిషను దొరకలేదు. శివరాత్రి సందర్భంగా వెళ్ళటం కుదరకపోయినా , గత నాలుగేళ్ళలో రెండుసార్లు దర్శించుకున్నాను త్రికూటేశ్వరుణ్ణి.అదొక మధురానుభూతి..ఇంత దగ్గర్లో ఉండి ఇప్పుడా దర్శించుకోవటం అనిపించింది నాకు..

రెండోసారి వెళ్ళినప్పుడనుకుంటా..గుళ్ళో కోతులు తెగ ఇబ్బందిపెట్టేశాయ్..ఒకాయన ఓ కర్రుచ్చుకొని మేమున్న కాసేపు అవి మాదగ్గరకు రాకుండా కాపలా కాశాడు..నాకాయనలో మరో శివయ్య కనపడ్డాడు :)

ఫోటోలు బావున్నాయి..పేరాపేరాకి మధ్య ఏమిటండి అంత ఖాళీ వదిలేశారు ?

ఉమాశంకర్ said...

నిద్రలో తూగుతూ రాసినట్టున్నాను పై వ్యాఖ్య :) బొప్పూడి, శింగరాయకొండ ముందే చూసేసినా కోటప్పకొండ కి మాత్రం పర్మిషను దొరకలేదు అని రాయబోయి ఏదేదో రాసేసాను :)

సుజాత said...

ఉమా శంకర్ గారు,
మీరు తప్పక ఈ టపా చూస్తే బావుండని రాస్తున్నపుడే అనిపించింది. థాంక్యూ!

కోటప్పకొండకి వెళ్లడానికి అబ్బాయిలకు పర్మిషన్ దొరక్కపోవడానికి అప్పట్లో ఉన్న "రికార్డింగ్ డాన్స్ పార్టీలు" ఒక కారణమండీ!అమ్మాయిలెలాగూ అమ్మానాన్నల్తో వెళ్ళాల్సిందే!

బ్లాగర్ లో చాలా సమస్యలున్నాయి! డ్రాఫ్ట్ లో బాగానే కనిపించినా డిస్ ప్లే కి వచ్చేసరికి ఇలా పేరాల మధ్య, ఇంకా చెప్పాలంటే లైన్ల మధ్య కూడా ఖళీలు కనిపిస్తూ ఉంటాయి.పబ్లిష్ అయిన ప్రతి టపా మళ్ళీ మళ్ళీ చూసుకుని ఎడిట్ చేస్తుంటాను, సరి చేస్తుంటాను. అయినా సరే..తప్పదు.

సుజాత said...

స్రవంతి గారు,
ఈ సారి ఎప్పుడనా వెళ్ళండి కోటప్పకొండకి!సింగరాయ కొండ తిరణాలకి నేనెప్పుడూ వెళ్ళలేదు గానీ అక్కడి ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని మా వూర్లో చాలా చెప్పుకుంటారు.

సృజనా,
థాంక్యూ!

పానీపూరి,
మీరు ప్రభల మీద డాన్సులు కూడా చూశారా? అవి శివరాత్రి రోజు రాత్రి ఉండేవి.(ఇప్పుడు లేవుట లెండి)మా ఇళ్ళలో అసలు పండగ రోజు కొండ దగ్గర రద్దీ ఎక్కువ కాబట్టి అటెళ్ళడానికి పర్మిషనే ఉండేది కాదు. అంతా పెద్దోళ్ళతో కల్సి ఏకాదశి రోజే వెళ్ళాలి.

వేణు గారు,
థాంక్యూ! లెక్కలు ఎప్పుడు చూస్తావంటే కోటప్పకి తిక్క వస్తుంది. నా టైపే! ఆయనకు ఇష్టం వచ్చినపుడే ఏ పని అయినా చేస్తాడు, చూస్తాడు.

భావనా,
థాంక్యూ! ఒక్కసారైనా నిన్ను తిరణాలకు తీస్కెళ్లాలని ఉంది. మనం మెట్లదారిలో వెళదాం!

నిజంగానే నేను చెప్పిన రంగుల్లో నాకు పట్టు పరికిణీలు ఉండేవి. అవి ధరించగానే మా పిన్ని కొడుకు "పేరక్కలా తయారయ్యావే అమ్మలూ"అని ఏడిపించేవాడు.

కొండదగ్గర మేకల మందలుండేవి. లేకపోతే చేమంతులు పెట్టుకునేవాళ్ళమే రెండు జెళ్ళుండేవి కదా అప్పుడు.

స్రవంతి said...

సింగరాయ కొండ కాదండి అది సింగర కొండ, సింగరాయ కొండ అంటే ఒంగోలు కి కావలి మద్యలో ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటుంది.మాకు బాగా ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ప్రతి సంవత్సరం వెళ్తాము.అక్కడ కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా ఉందండి

sivaprasad said...

nenu kotappakonda ki vellali anukuntunnu tirunalla roju ,,,becoz i am nrt

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు సుజాతా. బోలెడన్ని ఙ్ఞాపకాలను కదిలించారు. నేను నాన్న తో కలిసి ఒక్కసారే వెళ్ళాను కొండకి కానీ తిరణాల హడావిడి పెద్ద మార్కెట్, చిత్రాలయ దగ్గర కోటప్ప కొండ రోడ్ అంతా కూడా ఉంటుంది కదా అక్కడికి ప్రభలు చూడటానికి ఖచ్చితంగా వెళ్ళే వాడ్ని. ప్రత్యేకించి ప్రభలు కొండకి వెళ్ళే రోజూ వచ్చే రోజూ. ఆ హడావిడి మాటల్లో చెప్పలేం.

Nobody said...

మీ పేట్రియాటలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బాగా రాశారని అందరూ చెప్పేశారు కదా :)

రాంగోపాల్ said...

చాలా బాగా రాశారు.

ramu said...

Ramu

chala bhaga rasu, madi Narasaroapet pakkane una na yallamanda, Nakku Narasaraopet ante chala estam

Siddhu The Young Leader! said...

hi very good article..... ekkadiki vellina prasadam addu no edo untundi kaani mana kotappa entho ishtamaina ariselu prasadanga istharu

Siddhu The Young Leader! said...

very good article manam e gudiki vellina prasadam common ga untundi okka kotappa konda(ariselu) annavaram thappa(ravva) abba thaluchukuntene nuru uruthundi sujathagaru madi piduguralla.
thanks for the article