Pages

Friday, January 27, 2012

మూగవోయిన మా వూరి వేణువు ...ఏల్చూరి విజయరాఘవ రావు...!
 కళాకారులు మనల్ని దాటిపోయేదాకా నిరామయంగా ఊరుకుని.వారు గతించగానే వారి గొప్పను తల్చుకుని కన్నీళ్ళెట్టుకోడంలో నాక్కూడా మినహాయింపు లేదు. వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కవి,నాట్యకారుడు స్వర్గీయ శ్రీ ఏల్చూరి విజయ రాఘవ రావు గారి గురించి....మా వూరి మనిషి గురించి ఆయన మరణించాక ఈ బ్లాగులో రాద్దామని నేను అనుకోలేదు. కానీ .......మరణించాకే రాస్తున్నా!
                                                                 శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం దంపతులతో 
ఆయన మరణించిన సంగతి కూడా వెంటనే పత్రికల్లో రాకపోవడం వల్ల ఆ వార్త కూడా అందర్లాగే నాకూ ఆలస్యంగానే తెలిసింది. చాలామందికి ఆయన గుర్తే లేరు. ఆయన దశాబ్దాలుగా విదేశాల్లో స్థిరపడి పోవడమూ,కళ్ళ ముందు రోజూ హడావుడి చేస్తుండేవాళ్లను తప్ప మీడియా పట్టించుకోకపోవడమూ,ముఖ్యంగా ఆయన తనదైన అలౌకిక ప్రపంచంలో కీర్తి కిరీటాలకు దూరంగా ఉండటమూ ఇవన్నీ ఆయన మనకు దూరంగా జరిగిపోడానికి కారణాలు కావొచ్చు!

ఇతర పనుల్లో బిజీగా ఉండి ఈ బ్లాగుని రాతల్ని కొద్ది నెలలుగా వాయిదా వేస్తూ ఉండటం వల్ల నేనూ ఇప్పుడు రాయవలసి వచ్చింది.

"సూర్య" దినపత్రికలో అక్కిరాజు రమాపతి రావు గారు రాసిన వ్యాసం చదివే వరకూ, నాకు విజయరాఘవ రావు గారి గురించి చాలా విషయాలు తెలీవు. మా తరానికి కాస్త ఊహ తెలిసే సమయానికి ఆయన దేశమే విడిచి పెట్టారాయె!

గాంధీ అన్న పేరు వినగానే స్ఫురించే "రఘుపతి రాఘవ రాజారాం" ని ఆయనే స్వర పరిచారని, సర్దార్ పటేల్ అనారోగ్యంతో ఉన్నపుడు విజయ రాఘవ రావు గారు తన సంగీతంతో ఆయనకు సాంత్వన చేకూర్చారని,విజయరాఘవ రావు గారు అంగీకరిస్తే కోట్ల రూపాయల ఖర్చుతో ఒక సంగీత కళా నిలయాన్ని పండిట్ రవి శంకర్ ఢిల్లీలో స్థాపిస్తానని అన్నారని.........ఏమీ తెలీవు! 
శ్రీ విజయరాఘవ రావు గారు శ్రీ ఏల్చూరి రామయ్య,సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానం.1925, నవంబర్ 3 న జన్మించారు.   ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి కాలం చేశారు.  వీరి అన్నగారు నయాగరా  కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు.  తండ్రి గారి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.

 ఆ రోజుల్లో నరసరావుపేటలో ఎకరాల కొద్దీ విస్తరించిన పెద్ద చెరువు నిండుగా నీళ్లతో తొణికిసలాడుతూ పలనాడు రోడ్డు వెంబడే ఉండేది. (అయితే నాలుగు దశాబ్దాల క్రితమే దానిలోకి నీరు చేరే అన్ని మార్గాలను మూసి వేసి పూర్తిగా ఎండగట్టి దాన్ని నివాస ప్రదేశంగా మార్చారు). చెరువు కట్ట దగ్గర్లోనే ఏల్చూరి రామయ్య గారి ఇల్లు రాళ్ళబండి వారి వీధిలో ఉండేది. కొణిదెన వారి ఇంటి పక్కగా! ఇప్పుడు రాళ్లబండి వారి వీధి వీధంతా ఆసుపత్రులే! ఏల్చూరి వారి ఇల్లు డాక్టర్ గడ్డం హరిబాబు, డాక్టర్ సునీత ల ఆసుపత్రిలో భాగంగా మారిపోయింది.

ఆ వీధికి పక్కగానే యాదవుల వీధి(పాతూరు శివాలయానికి వెళ్ళే రోడ్డు) ఉంది. చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయరాఘవరావు గారికి  ప్రాథమికంగా   గురువు ఎవరూ లేరంటే ఆశ్చర్యమే!అయితే గొల్ల పిల్లలతో చేరి కూడా అల్లరి చేయకుండా విద్యను మాత్రమే గ్రహించే వారు. తర్వాతి రోజుల్లో శాస్త్రీయ సంగీత కచేరిలు చూసి, ఇంటికి వచ్చి సాధన చేసేవారట. 

అలా చెరువు కట్ట మీద రావి చెట్టు కింది అరుగు వారి సంగీత సాధనకు వేదికైందన్నమాట. ఆ సంగీతానికి శ్రోతలుగా అనిసెట్టి కృష్ణ, నరసరావు పేటలోని కన్యకా పరమేశ్వరీ గ్రంథాలయాన్ని జాతీయ గ్రంథాలయాలతో సమానంగా తీర్చి దిద్దిన విద్యావేత్త మస్తాన్ గార్లు ఉండేవారు.  అనిసెట్టి కృష్ణ గారి ప్రేరణతో ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీ అరండేల్ గారి వద్ద భరత నాట్యం అభ్యసించారు.అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ గారి దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందం లో  నర్తకుడిగా దేశ విదేశాలూ తిరిగారు.  ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో  నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచారు.  ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ గారి సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అక్కడితో ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.

తర్వాత వారు నరసరావు పేట బిడ్డ అయినా కళామతల్లి ముద్దుబిడ్డగానే పెరిగారు. ఎన్నెన్నో కీర్తి ప్రతిష్టలారించారు. ఎన్నో శిఖరాలెక్కారు. 

అయినా మా నరసరావు పేట పట్టణం పధ్నాలుగేళ్ళ క్రితం రెండు వందలేళ్ళ పండగ చేసుకున్నపుడు ఆయన మా వూరి బిడ్డ గా తల్లి ఒడికి చేరాలన్న తపనతో మా వూరికి వచ్చారు. 

ఆ సందర్భంలో వారికి సన్మానం చేసి, వూరు వూరంతా గర్వపడి,పరవశించింది. ఆయన మాత్రం? ఎన్నో ఏళ్ళకు తల్లిని చూసిన బిడ్డలాపరవశించి, ఈ వూరితో తన అనుబంధాన్ని పంచుకుని ప్రసంగించారు  . ఆ రోజు వారి గురించిన ఒక ప్రత్యేక వ్యాసం కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది. అలాగే ఆనాటి సన్మాన సభ వివరాలున్న వార్త క్లిప్పింగ్ కూడా ఇక్కడ పంచుకుంటున్నాను!
ఈ మాట పత్రికలో కొడవటి గంటి రోహిణి ప్రసాద్ గారు రాసిన వ్యాసం  ఇక్కడ.

విజయరాఘవ రావు గారి స్మృతికి మా వూరి ప్రజలందరి తరఫునా శ్రద్ధాంజలి!