Pages

Tuesday, August 10, 2010

అయ్యో,మా వూరి గూడు రిక్షా!

మా వూరి గూడు రిక్షాలో ప్రయాణం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది!వెన్నెల రాత్రుల్లో మనం రోడ్డు మీద గూడు రిక్షాలో ప్రయాణిస్తూంటే మా వూరి ఆచారం ప్రకారం కరెంటు పోయి వీధిదీపాలన్నీ మూగవోయినపుడు..చుట్టూ వెలిగిపోతున్న వెన్నెల్లో రిక్షా చక్రాలకుండే మువ్వలు చక్రం తిరిగినపుడల్లా ఒక చక్కని టైమింగ్ తో ఘల్లు ఘల్లునే ధ్వని ఎంతో శ్రావ్యంగా ఉంటుంది.
సినిమాకెళ్ళాలన్నా, ఊళ్ళో ఉన్న చుట్టాలింటికి వెళ్ళాలన్నా , పాతూరు శివాలయానికెళ్ళాలన్నా, PWD ఆఫీసు దగ్గరలో నాగార్జున సాగర్ కుడికాలవొడ్డున ఉన్న శివాలయానికెళ్ళాలన్నా...మల్లమ్మ సెంటర్ కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా ఇంటి నుంచి నాలుగడుగులు ముందుకేసి "తిరపతీ" అనో "కొండబాబూ" అనో "మస్తాన్" అనో కేక వేస్తే చాలు ఠంగ్ మని బెల్లు కొడుతో ముగ్గుర్లో ఎవరో ఒకరు ప్రత్యక్షం అయిపోయేవాళ్ళు.

వీళ్లు ముగ్గురూ మా ఆస్థాన రిక్షా వాళ్ళు. చిన్నప్పటినుంచీ  తెలిసిన వాళ్ళు. మొన్న మొన్నటిదాకా హైద్రాబాదు నుంచి మా వూరెళ్ళినపుడు పల్నాడు బస్టాండ్ లో ఇంకా బస్సులోంచి దిగకముందే బస్సెక్కేసి సామాను అందుకుని నాకంటే ముందే దిగేసేవాళ్ళు.మా వూరి రిక్షాలన్నీ మంగళగిరిలో తయారవుతాయి. ప్రతి రిక్షాకీ అటూ ఇటూ ఎంచక్కా ఎంటీవోడూ,నాగేస్రావూ,కిష్ణా,సోబనబాబూ,వాణీశ్రీ,జైప్రదా,జైసుదా,స్రీదేవీ ఇత్యాదులంతా రంగురంగుల్లో కళకళ్లాడిపోతుంటారు. రిక్షా లోపల కూచున్నవాళ్ళు చూసుకునేందుకు అటూ ఇటూ అద్దాలూ!

 అదేంటో విచిత్రం,మంగళగిరిలో తయారయ్యే ఈ రిక్షాలు గుంటూరు దాటి మా వూర్లోనూ,పిడుగురాళ్ల ఇతర ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండే గుంటూర్లో మాత్రం ఉండవు. అక్కడ స్టాండ్ రిక్షాలు అంటే ఈ బొమ్మలో లాంటి రిక్షాలుంటాయి.నాకు మాత్రం మా వూరి గూడు రిక్షాలే హాయిగా,సౌకర్యంగా ఉంటాయి.

అర్థ రాత్రయినా అపరాత్రయినా ఎక్కడికైనా దొరికే ఏకైక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మా వూరి రిక్షా బండి!


ఇదంతా ఒకప్పటిమాట.


ఇప్పుడు ఈ బండి పరిస్థితి ఇలా లేదు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన ఆటోలు రిక్షా బండి గుండె మీదినుంచి నడుచుకుంటూ పోవడంతో దిక్కుతోచక దారి తప్పిపోయింది. వూర్లో ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్ళినా ఆటోలో(పదిమందిని ఎక్కించుకుంటాడుకదా మరి)ఆరేడు రూపాయలకు మించకపోవడం,రిక్షాకంటే వేగంగా వెళ్ళే సౌకర్యం ఉండటంతో చుట్టుపక్కల పల్లెటూళ్ళకు వెళ్ళేవాళ్ళు సైతం ఆటోలకే ఓటేశారు.

రిక్షా చక్రం తిరగబడింది.

ఇప్పటికీ మా వూర్లో రిక్షాలున్నాయి! కానీ ఇదివరకటి సంఖ్యలో మాత్రం కాదు!


ఎప్పుడు వూరికెళ్ళినా ఆటోలోవద్దనీ,రిక్షాలోనే తిరుగుదామనీ ఏడ్చి గొడవపెట్టే మా పాపకోసం తిరపతినో,మస్తాన్ నో అందుబాటులో ఉండమని చెప్తాను. ఆ మధ్య వూరికెళ్ళినపుడు తిరపతి రోడ్డుమీద కనపడితే రిక్షా ఏదీ అనడిగాను.


                   రిక్షాలో ఉంది మా పాప సంకీర్తన ఏడాది వయసులో ....

                                                             
"తీసేశానమ్మా! ఇప్పుడేవరూ రిచ్చా ఎక్కట్లేదు తల్లా! అంతా ఆటోలమీద తిర్గేవాళ్ళే! అద్దె కట్టలేక తీసేశాను"అన్నాడు.


"మరెలా ?(బతుకుతున్నావూ)?" అన్నాను ఇంకేమనాలో తోచక!


"పంటల కాలంలో పొలాలకు కావలి ఉంటున్నాను!పంటలు లేనికాలంలో సత్యనారాయణ స్వామి గుడి ఊడ్చి,తోటపని సూస్తన్నా"అన్నాడు తిరపతి ఏ భావమూ లేకుండా!


"మరి మస్తానో?"

"మస్తానుకు గుండెజబ్బమ్మా! రిచ్చా తొక్కుదామన్నా ఎక్కేవాళ్ళు లేక వాడూ తీసేశాడు. శీనయ్య చిల్లరకొట్లో పొట్లాలు కడతన్నాడు.మందులకన్నా కావాలగా?"అన్నాడు తిరపతి సుబ్బారావు కొట్లో బీడీలు తీసుకుంటూ!

గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు భారంగా ఉంది. ఏడుపేమో రాదు. బాధేమో తగ్గదు.

ఏమి చేయగలం ఈ నిర్భాగ్యుల కోసం! ఇన్నాళ్ళు రిక్షాని నమ్మి ఇపుడు సడన్ గా ఇలా దిక్కు లేని పక్షుల్లా...

ఎందుకో చెప్పలేనంత దిగులేసింది.


రిక్షాల సంఖ్య ఇప్పుడు మా వూర్లో బాగా తగ్గిపోయింది.అప్పుడెప్పుడో నేను పుట్టకముందు రిక్షాల పోటీలు కూడా జరిగేవంట!


ఇప్పటికీ మా వూరెళితే ,ఎక్కడికెళ్ళాలన్నా మా అమ్మాయి డిమాండ్ మేరకు గూడు రిక్షానే ఎక్కి తిరుగుతాం!ఒకసారి ఒక కథ చదివాను. కృష్ణా నది కి రెండువైపులా ఉన్న రెండు వూళ్లవాళ్ళు వంతెన లేక నానా ఇబ్బందులూ పడుతుంటారు.నాటుపడవలే గతి అవతలితీరం చేరాలంటే! ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కృషి ఫలితంగా ఎలాగో వంతెన వస్తుంది.రెండు వూళ్ళ మధ్యా దూరం రెండు కిలోమీటర్లకు తరిగి పోతుంది.కానీ ఇదివరలో పడవలు నడుపుతూ పొట్టపోసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు పని లేక రాళ్ళెత్తేపనికి పోతూ ఉంటారు.


ఈ కథ ఎవరు రాశారో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి!


తిరపతి మాటలు వింటుంటే ఈ కథే గుర్తొచ్చింది. ఏమీ చేయలేని అశక్తతతో చిన్నప్పుడు స్కూలు కు తీసుకెళ్ళినందుకు   కృతజ్ఞతగా(అనుకుంటూ) తిరపతికీ,మస్తానుకూ కొంత డబ్బు మాత్రం ఇచ్చి రాగలిగాను.

పై ఫొటోలో రిక్షా కర్టెసీ తిరపతి