Pages

Monday, January 10, 2011

పేట మున్సిపల్ హై స్కూలు!

 మా వూరి గురించి రాస్తూ మా మునిసిపల్ హైస్కూలు గురించి, మా కాలేజీ గురించి రాయకపోతే పుట్టగతులుండవు మరి!అందునా బాల్యం తాలూకు మధురానుభూతుల్లో సగానికి పైగా హైస్కూలుతోనే ముడివేసుకుని ఉంటాయేమో, స్కూలనగానే మనసు పరిమళిస్తుంది జ్ఞాపకాల పూదోటలో!

ఈ మధ్య వెళ్ళినపుడు అక్కడ అడుగు పెట్టగానే ఒక గొప్ప వణుకు వచ్చింది..బహుశా సంతోషంతో అనుకుంటా!చిన్ననాటి స్నేహితులరూపాలు,గొంతులు,గిల్లికజ్జాలు,అపార్థాలు,మరునాడే చెప్పుకున్న క్షమాపణలు!
అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో నిండిపోయాయి.
                                            ఇప్పటి  గర్ల్స్ హై స్కూలు  బిల్డింగ్

పదో క్లాసులో మా గ్రూపంతా విడిపోయి తలో సెక్షన్లోనూ పడ్డామని తెలిసి లెనినా ఏడ్చిన ఏడుపు చిత్రంగా గాల్లో తేలి వచ్చి నా చెవులకు సోకింది.సంగీతం టీచర్ హార్మోనియం,పాండురంగారావు మాస్టారి పదునైన తెలుగు ఉచ్చారణ,రామకోటి మాస్టారి మెత్తని బుజ్జగింపూ,పీ ఈ టీ రాజేశ్వరి మేడమ్ ఊదిన విజిలూ,"భామలూ"అని ముద్దు చేసే మా హెచ్చెం అన్నీ అలా కళ్ళముందు కనిపిస్తూ వినిపిస్తూ ఉండిపోయాయి.

నా హైస్కూలు చదువు నరసరావుపేట మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలో గడిచింది. ఒకటే ఆవరణలో పక్కపక్కనే అబ్బాయిల హైస్కూలు, అమ్మాయిల హైస్కూలు ఉంటాయి.(ఇప్పటికీనూ)అయితే అబ్బాయిలు అమ్మాయిల మధ్య స్నేహ సంబంధాలో మరో రకమైన ఆకర్షణలో ఉండేవి కాదు, కేవలం చదువులో పోటీ తప్ప! మా స్కూలుకు అంతగా నిధులు లేకపోవడం వల్ల కొన్ని రూములు అబ్బాయిల స్కూలు నుంచి అప్పు తీసుకుని అందులో మరి కొన్ని  తరగతులు నడిపిస్తుండే వాళ్ళు.నేను చదువుకున్నపుడు శ్రీమతి వసుంధరా దేవి హెడ్ మిస్ట్రెస్ గా ఉండేవారు. అదే స్కూల్లో చదువుకున్న భారతి అప్పుడు సోషల్ స్టడీస్ కి వస్తుండేవారు.ఇప్పుడు ఆమే ఆ స్కూలుకి హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నారు.

మా స్కూలు ఎప్పుడు ప్రారంభమైందో నా వద్ద సమాచారం లేదు. కానీ స్కూలు గేటులోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక గాంధీ విగ్రహం ఉండేది. దాన్ని గాంధీ హత్యకు గురైన  ఇరవై రోజులకే 1948 ఫిబ్రవరి 20 న  ప్రతిష్టించారని ఫలకాన్ని బట్టి అర్థమైంది. అంటే అంతకు ముందునుంచే ఆ స్కూలు ఉందన్నమట.

                                                శిధిలావస్థ  లోని పాత స్కూలు

అబ్బాయిలు, అమ్మాయిల స్కూళ్ళలో భయంకరమైన క్రమశిక్షణ ఉండేది! ఇంటర్వల్ లో అబ్బాయిలెవరైనా  ఇటువేపొస్తే మోకాళ్ళు విరిగేలా దెబ్బలు పడేవి. అలాగే ఆడపిల్లల క్లాసులో కానీ అసెంబ్లీలో గానీ రెండు జడల్లో పొరపాటున ఒకటి ముందుకు పడిందా....ఠప్పున మొట్టికాయ పడాల్సిందే! లెక్కలు తప్పు చేస్తే జయమణి టీచర్ మొహమాటం లేకుండా చేయి వెనక్కి  తిప్పి స్కేలుతో ముణుకులు విరగ్గొట్టేది. మా పీ ఈ టీ రాజేశ్వరి..అబ్బ నామిని మాటల్లో చెప్పాలంటే బలే కటీనురాలు. ఆ షాట్ పుట్ లూ, జావొలిన్ లూ ఎంతెంత దూరాలు వేయించేదో(చనువు కొద్దీ,ప్రేమకొద్దీ ఏకవచనాలు).ఎంతెంత దూరాలు పరిగెత్తించేదో !

అలాగే జోసెఫిన్ టీచర్(ఎన్నెస్),మావుళ్ళమ్మ(తెలుగు),జయమణి (లెక్కలు),వీళ్ళందరినీ ఎప్పటికీ మరవలేం! కాలేజీలో కొంతమంది లెక్చెరర్ల పేర్లు గుర్తు లేవు గానీ స్కూల్లో ఆయాలతో సహా అందరూ గుర్తే! నాగమ్మ,బీబీ అని ఇద్దరు ఆయాలు, జనార్దన్ అనే అటెండర్ ఉండేవాళ్ళు.  నాగమణి,హుస్సేన్,నాగేశ్వర్రావు నాన్ టీచింగ్ స్టాఫ్! (అమ్మో,నాకు అందరి పేర్లూ  గుర్తున్నాయి..వావ్)

చదువులో మా స్కూలెప్పుడూ ఫస్టే! ఇతర విషయాల్లో కూడా అసలు మా బాచ్ సంపాదించినన్ని షీల్డులు, కప్పులు బహుమతులు ఇంకే బాచ్ అయినా సంపాదించిందా అని సందేహం! శాస్త్రీయ సంగీతం,లలిత సంగీతం,క్విజ్ లు,వ్యాసరచనలు,వక్తృత్వం,ఆటలు అన్నింటిలోనూ గంపల కొద్దీ ప్రైజులు సంపాదించేవాళ్ళం!అవి ఇప్పటికీ మా హెడ్ మిస్త్రేస్  రూములో భద్రంగా ఉన్నాయి.

                                                  ప్రస్తుతం గురజాడ కళామందిరం
మా హెడ్ మిస్ట్రెస్ వసుంధర మేమలా ప్రైజులు సంపాదించి రాగానే మాకు స్వీట్లు తనే తినిపించి నాగమ్మ చేత దిష్టి తీయించేవారు. "అమ్మో, పిల్లలకు ఎంత దిష్టి తగిలిందో, అందరి కళ్ళూ మన పిల్లల మీదే"అనేవారు(ఆమెకు పిల్లలు లేరు) మేమలా బహుమతులు సంపాదిస్తుంటే ఊర్లో పెద్దలంతా మా హెచ్చెమ్ ని మెచ్చుకునేవాళ్ళు.దానితో ఆమె మమ్మల్ని మరింత గారాబం చేస్తుండేది.

ఇప్పటి స్కూళ్ళలో టీచర్లను పిల్లలను చూస్తుంటే చనువు ఉన్నా, ఇద్దరి మధ్యా అప్పటి అనురాగం,ఆప్యాయత లేవేమో అనిపిస్తుంది.ఇద్దరి మధ్యా ఒక సన్నని సరిహద్దు లేఖ కనిపిస్తూ ఉంటుంది.

ఇక అబ్బాయిల స్కూలు (మరి రెండూ ఒకే ఆవరణలోనే ఉన్నాయి కదా,ఆ స్కూలు గురించి కూడా చెప్పుకోవాలి )సంగతికొస్తే ప్రతి హెడ్ మాస్టరూ చండశాసనుడే అక్కడ! హెడ్ మాస్టర్ దాకా ఎందుకు మాస్టర్లంతా బలే కటీనులు! వాళ్ల స్కూలు H ఆకారంలో ఉండేది.మధ్య గీత లో హెడ్ మాస్టర్ రూము! అందువల్ల ఏ క్లాసులో ఏం జరుగుతుందనేది ఆయనకు స్పష్టంగా  కనిపిస్తుందన్నమాట.

 మా నాన్నగారు,మామయ్యలు అంతా ఇదే స్కూలు! ప్రముఖ కవి శ్రీ నాయని సుబ్బారావు గారు ఈ స్కూలుకు హెడ్ మాస్టర్ గా పని చేసిన రోజుల్లో వాళ్ళమ్మాయి నాయని కృష్ణ కుమారి గారు అదే స్కూల్లో చదువుతుండేవారు. అబ్బాయిల స్కూల్లో అమ్మాయిలకు కొద్ది సీట్లు ఇచ్చేవారుట. ప్రముఖ విమర్శకుడు చేరా,వేణుగాన విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావు,విజ్ డమ్ అంతరజాతీయ  మాసపత్రిక కు సంపాదకులుగా పని చేసిన కె.వి గోవిందరావు ,ప్రముఖ రచయిత అనువాదకుడు స్వర్గీయ రెంటాల గోపాల కృష్ణ కూడా మా మునిసిపల్ హై స్కూల్లో చదువుకున్నారు.


మునిసిపల్ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కళావేదిక "శ్రీ గురజాడ కళామందిరం"! పెద్ద స్కూలు గ్రౌండ్ కాబట్టి, ప్రైవేటు ఆస్థి కాదు కాబట్టి ఇక్కడ ఎన్నో కళా ప్రదర్శనలు జరిగేవి.రంగస్థలి సంస్థకు ఇది శాశ్వత వేదిక. మా నాన్నగారు రంగస్థలికి చందాదారు కావడంతో ఇక్కడ మేము బలవంతంగా అప్పుడప్పుడు నాటకాలు చూస్తుండేవాళ్ళం! చందాదారులకు టికెట్లు వస్తాయి కదా మరి!  గురజాడ కళామందిరం కూడా పూర్తిగా శిధిలావస్థలో ఉంది.అయితే స్కూలు బిల్డింగులు మొత్తాన్నీ  నవీకరిస్తుండటంతో దాన్ని కూడా కొత్తగా నిర్మిస్తారని ఆశైతే ఉంది.
                                            రూపు దిద్దుకుంటున్న కొత్త స్కూలు బిల్డింగ్


గత కొద్ది ఏళ్ళుగా మా బాలికోన్నత పాఠశాలకు నిధులు సమకూరడం వల్ల కాబోలు కొత్త భవనాలు అమరాయి.బాయ్స్  స్కూలు కూడా మరీ పాతపడిపోవడం వల్ల కొద్ది కొద్దిగా పాత బిల్డింగ్ లను  తొలగించి కొత్త వాటిని  నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్కూలు గేటుకు ఎదురుగా ఉండే గాంధీ విగ్రహాన్ని తొలగించవలసి వచ్చినట్లుంది. అతి పురాతనమైన గాంధీ విగ్రహం అక్కడ నుంచి మాయమైంది.   :-((

అక్కడినుంచి బయటపడుతూ మాత్రం  ఏ టీచర్లు ఎలా ఉన్నారు?అనే ప్రశ్న మాత్రం ఎవరినీ అడగలేదు. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లోనే  రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నవారు ఇప్పుడెలా ఉన్నారో, అసలున్నారో లేరో తెలుసుకోవాలని నాకు నిజంగా అనిపించలేదు. వాళ్ళు నా ఊహల్లో ఎప్పటికీ మా పాత స్కూలు బిల్డింగ్ లాగే సజీవంగా ఉండాలనే దురాశతో ఆ ప్రశ్న మాత్రం అడక్కుండానే వచ్చేశాను.