Pages

Saturday, March 20, 2010

ది పల్నాడు లింక్ ఎక్స్ ప్రెస్!

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు తేళ్ళు

పలనాటి సీమల పల్లెటూళ్ళుఅని శ్రీనాధుడు వాపోయాడంటే వాపోడూ! ఎప్పుడైనా హైద్రాబాదునుంచి మా వూరెళుతుంటేనో, మా వూర్నుంచి హైద్రాబాదొస్తుంటేనో పల్నాడు ప్రాంతమంతా కనపడే దృశ్యాలు....మైళ్ళకొద్దీ వ్యాపించిన సున్నపురాతి నేలలు,నేల లోంచి పొడుచుకొచ్చిన బండరాళ్ళు,కృష్ణా నది ఒడ్డున అక్కడక్కడా కనపడే సిమెంట్ ఫాక్టరీలు,వాటి ప్రభావంతో చుట్టు పక్కలంతా తెల్లటి దుమ్ము దుప్పట్లు కప్పుకున్న తుమ్మ చెట్లు,శీతాకాలంలోనూ వీచే వేడి గాలులు,ఎర్రెర్రగా పండుమిరప, కనకాంబరాల చేలు..!పెళ్ళయి... పశ్చిమ గోదావరి ఆకుపచ్చ అందాలు చూసే వరకూ పై దృశ్యాలన్నీ మామూలుగా కనిపించేవి.అయినా ఇప్పటికీ ఆ దారెంట వెళ్తుంటే సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథలో మల్లిక్ చెప్పినట్లు గుండెలో వీణలూ సితార్లూ మోగుతాయి.గట్టిగా ఆ గాలి గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది.


   పల్నాడు ప్రారంభంలోనే పలకరించే నాయకురాలు నాగమ్మ కాంస్య విగ్రహం!

తెల్లారితే పల్నాడు జనమంతా ఏవో ఒక పన్ల మీద పేటలోనే ఉంటారాయె!అందుకే మా వూరు మధ్యగా పోయే NH9 ని మేము ముద్దుగా "పల్నాడు రోడ్"అని పిల్చుకుంటాం!ఇంకా పలనాడు ట్రావెల్సూ, పల్నాడు బ్రదర్స్ పాన్ బ్రోకర్స్,పల్నాడు మడత మంచాలు అద్దెకిచ్చే డార్మెట్రీలు, పల్నాడు ఫైనాన్స్,పల్నాడు అది పల్నాడు ఇదీ.... ఇట్లా బోలెడు పల్నాడు సరుకు ఊరినిండా!


             కారంపూడి ఊరు మధ్యలో కొలువైన బ్రహ్మనాయుడు


పల్నాడు చరిత్రంతా దాయాదుల కథ కావడంతో ఎన్ని సార్లు చదివినా బోలెడు కన్ ఫ్యూజన్ తో మర్చిపోతాను. మా వూరిపక్క జనాల్లో చాలామంది (పాతవాళ్ళు) పల్నాడు చరిత్రలోని వ్యక్తుల పేర్లతో కనపడటం ఆశ్చర్యం లేదు. మాకు పాలు పోసే ఆయన పేరు "బాలచంద్రుడు"! మా అత్త పేరు పేరిందేవి! నాన్న ఆఫీస్ లో అటెండర్ అలరాజు. నాగమ్మలకైతే కొదవే లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు! పెద్ద నాగమ్మ, చిన్న నాగమ్మ! అంత పవర్ ఫుల్!పల్నాడు బయటెక్కడో ఉన్న మా వూర్లోనే ఇంతమంది ఉంటే ఇక నిజంగా పలనాడులో ఎంతమంది ఉంటారో ఇలాంటి పేర్ల వాళ్ళు!


                                        మాచర్ల చెన్నకేశవ స్వామి


మా వూరాయన ఒకాయన మా కాలనీలోనే ఉంటున్నాడని మాటల మధ్యలో తెలిసి పేరేమిటని తెలుసుకుంటే ఆయన కాస్తా బ్రహ్మనాయుడై కూచున్నాడు. అచ్చంగా పల్నాడులో నివసించకపోయినా మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయం చూడ్డం,దాచేపల్లి బ్రిడ్జ్ దగ్గర నాగులేరుని చూడ్డం, తొలేకాదశికి బ్రహ్మ నాయుడు తపస్సు చేసుకోడానికెళ్ళాడని చెప్పే గుత్తికొండ బిలం చూడ్డం(లోపలికెళ్లాలంటే మాత్రం చచ్చేంత దడ!) ఇష్టమైన పని నాకు!

ఆ బిలానికి అంతు అనేది లేదనీ, బాగా లో...పలికి వెళితే అక్కడ నిజంగానే తపస్సు చేసుకుంటూ మునులు ఉంటారనీ అంటారు. అంత దూరం ఎవరూ వెళ్ళలేదు కాబట్టి ఎంతవరకూ నిజమో మరి!ఆ మధ్య మావూరెళ్ళినపుడు తీరిగ్గా ఆగుతూ ఆగుతూ ఫొటోలు తీసుకుంటూ తిరిగొచ్చాను హైద్రాబాదు.


                          చెన్నకేశవ స్వామి ఆలయంలోని నాగశాసనం!
దాచేపల్లి బ్రిడ్జీ దగ్గర ఆగగానే అక్కడ ఒక తోపుడు బండిమీద బాగా పండి పగిలిన సీమ చింతకాయలు బోల్డు కనపడ్డాయి... తెల్లని విత్తనాల మీద గులాబీ చారల్తో!ఎగబడి కొన్నామనుకోండి! పక్కనే "శ్రీ వీరాంజనేయ కిళ్ళీ షాపు" లో గోలీ సోడా తాగాము. షాపు పక్కనే ఒక బోర్డు మీద ఇలా రాసుంది .

"ఇచ్చట పెళ్ళిళ్ళకు ,శుభకార్యాలకు కిళ్ళీలు అందంగా(?)కట్టబడును. తిరుపతి,కాళహస్తి,శ్రీశైలం వెళ్ళు బస్సులు ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఇచ్చట నుంచి బయలుదేరును"


                      మబ్బులు కమ్మిన ఆకాశం కింద సాగర్ కృష్ణ!


ఆ పక్కనే సయ్యద్ పాషాగారి బోన్ సెట్టింగ్ సెంటర్ గాజు తలుపుల మీద పవన్ కళ్యాణూ,ఇలియానా విరిగిన ఎముకలకు పిండి కట్లు వేయించుకుని ఫుల్ మేకప్ తో ఆందంగా నవ్వుతూ కనపడ్డారు.(ఇదే హైద్రాబాదులో అయితే షారుక్ ఖానూ,ఐశ్వర్యా రాయీ ఈ కట్లు కట్టించుకుని కనపడతారు)నెమ్మదిగా అలా ఆ వూర్లు దాటుకుంటూ సాగర్ అందాలు కూడా చూస్తూ ఎప్పటికో హైద్రాబాదు చేరాము.