Pages

Monday, January 11, 2010

వేణూ శ్రీకాంత్ పదో తరగతి జ్ఞాపకాలు
బాల్యం ఎవరికైనా అమృతప్రాయమే! ఎంత వయసు వచ్చినా తీయని జ్ఞాపకంలా  మిగిలేది బాల్యమే! చదువుకున్న స్కూలు, తిరిగిన వీధులూ, గోలీలాడుకున్న రోడ్లూ, ఎక్కిన చెట్లూ, దూకిన గోడలూ, ప్రాణంగా అనిపించే ఆనాటి స్నేహితులూ, గిల్లి కజ్జాలూ, బెత్తంతో కల్లో కొచ్చే ట్యూషన్ మాస్టారూ, అంతా.....అంతా అందమే, ఆనందమే!
నాతో నేను నా గురించి. అంటూనే తన అనుభవాల్లోకి, జ్ఞాపకాల్లోకి, కబుర్లు చెప్తూ చేయి పట్టుకుని మనల్ని కూడా నడిపించుకెళ్ళే భావుకుడు, మా వూరబ్బాయి వేణూ శ్రీకాంత్ తన పదో  తరగతి జ్ఞా పకాల్ని పంచుకుంటున్నారు చూడండి. మీరూ పదో క్లాసులోకి పరుగులు తీయండి.

***                                                                   ***                                                                 ***


ప్రతి వ్యక్తి జీవితంలోనూ గోల్డెన్ ఎరా అన తగిన బాల్యాన్ని నేను ఎక్కువ భాగం నరసరావుపేట లోనే గడిపాను. ఊహ తెలిసాక ఈ ఊరు వచ్చాము. అక్షరాభ్యాసం నుండి ఆరవ తరగతి వరకు ఇక్కడే చదివాను. అమ్మా, నాన్న ఇద్దరికీ బదిలీ అవడంతో ఏడు ఎనిమిది తరగతులు పిడుగురాళ్ళ లో చదివేసి మళ్ళీ తొమ్మిదో తరగతికి నరసరావుపేట వచ్చేసాను. నాలుగో తరగతి తర్వాత ఎప్పుడూ పేరెంట్స్ నాపై చేయిచేసుకోకపోయినా ఎందుకో నేను బలవంతపు బుద్దిమంతుడుగానే మిగిలిపోయాను.


అప్పటికీ కొన్ని కోతి వేషాలు వేసే వాడ్ని కానీ సాధ్యమైనంత వరకూ ఇమేజి డ్యామేజి అవకుండా జాగ్రత్త పడే వాడ్ని :-) పిడుగురాళ్ళలో ఎంతైనా హైస్కూల్ కదా మరి చిన్నపాటి కొమ్ములు మొలిపించుకుని ఐతేనేమీ అక్కడి స్నేహాల మూలంగా పరిచయమైన కొత్త ప్రపంచం వల్ల ఐతేనేమీ చదువును అటకెక్కించేశాను. అలాగే ఎలాగో తంటాలు పడి పది వరకూలాగాను కాని అమ్మకు నామీద ఖచ్చితమైన నమ్మకం ఏర్పడిపోయింది వీడు ఇలాగే చదివితే 10th క్లాస్ లో బోర్లా పడటం ఖాయం అని.
అదుగో సరిగ్గా అలాంటి సమయం లోనే అమ్మ పాలిటి ఆపన్న హస్తం, నా పాలిటి యమపాశం లాంటి పాండురంగారావు మాష్టారి ట్యూషన్ గురించి అమ్మకి తెలిసి పోయింది. రెండో రైల్వే గేట్ నుండి సరాసరి ప్రకాశ్ నగర్ వైపు వెళ్తూ రిజిష్ట్రార్ ఆఫీస్ తర్వాత లైన్లో ఎడమ సందులోకి తిరిగి చివరికి వెళ్తే అక్కడ పాండురంగారావు గారి డాబా ఇల్లు ఉండేది. ఇల్లుచిన్నదే అయినా చుట్టుపక్కల ఇళ్ళు ఏమీ లేకపోడం వల్ల ఒంటరిగా ఠీవీగా నిలుచున్నట్లు ఉండేది. ఓ నాలుగు మెట్లు ఎక్కి లోపలికి అడుగుపెట్టగానే ఎడమ పక్క డాబా మీదకు సన్న మెట్లు, అక్కడే ఎత్తుగా కట్తిన వరండానే కాకుండా ఇంకా బోలెడంత ఖాళీ స్థలం కూడా ఉండేది అమ్మాయిలు ఆ ఎత్తైన వరండాలోనూ మేమంతా కింద కూర్చునే వాళ్ళం.పాండురంగారావు మాష్టరు గారికి పోలియో, సరిగా నడవలేరు, మెడకూడా కాస్త పట్టేసి ఉండటంతో చూడటం కూడా కాస్త వంకరగా కష్ట పడుతూ చూసేవారు మాములు వాళ్ళలా సులభంగా కదలలేరు. దీనివల్లనే మా ఊర్లో అప్పట్లో పేరుపొందిన స్వామీ, శ్రీహరి గార్లలా  కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

కానీ తను లెక్కలు మాత్రం చాలా బాగా చెప్పేవారు, లెక్కలే కాదులెండి అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్పేవారు. అప్పట్లోనే క్లాస్ ను గ్రూపులుగా విభజించి ఆరోగ్యకరమైన పోటీ పెట్టి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి అందరినీ బాగా చదివించడానికి ప్రయత్నించేవారు. మా అమ్మగారి బలవంతమ్మీద అందులో చేరిన నేను మొదటి రోజునుండీ మొద్దబ్బాయ్ ట్యాగ్ (కనపడని) మెడలో తగిలించుకుని తిరిగే వాడ్ని.ఇంటిదగ్గర చేయమని ఇచ్చిన పని పూర్తిచేయగలిగే వాడ్ని కాదు దాంతో ట్యూషన్ మొదలయ్యే టైంకి ప్రతిరోజు బయటనుంచునే వాడ్ని. చదివినవి వేరే పిల్లలికి అప్ప చెప్పాల్సి ఉండేది నేను నిజాయితీగా మొత్తం పొల్లుపోకుండా చెప్పడానికి ప్రయత్నించి మధ్య మధ్య లో ఆగుతూ, పూర్తిచేయలేక రోజూ తిట్లు తినేవాడ్ని. అలా మొదటి యూనిట్ టెస్ట్ లు వచ్చాయి అందులో ఎవరి ప్రమేయం లేకుండా నా అంతట నేనే రాయడం కదా, నా ప్రయత్నం నేను చేశాను. దిద్దే రోజే కొందరు క్లెవర్స్ బ్యాచ్ మెచ్చుకోలుగా చూశారు, ఫలితాలలో మొదటి ఐదుగురిలో నేను ఉండటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది, మరి అప్పటివరకు చివరిబ్యాచ్ లో చివరి వాడ్ని కదా. ఈ పరీక్షల తర్వాత క్లవర్ బ్యాచ్ తో స్నేహం కుదిరింది, వాళ్ళు "బాబు అమాయక చక్రవర్తీ ఇలా నిజాయితీగా ఉండకూడదమ్మా మధ్యలో కాస్త మింగేస్తూ స్పీడ్ గా అప్పచెప్పేయాలి.." అనీ, హోమ్ వర్క్ ఎలా ఫాస్ట్ గా మ్యానిపులేట్ చేయాలి అనీ కిటుకులు చెప్పారు. అలా మెల్లగా మొద్దబ్బాయి ట్యాగ్ తొలగించుకోగలిగాను.ఆగండాగండి!  అక్కడితో అయిపోలేదు అది పాజిటివ్ సైడ్ ఆఫ్ స్టోరీ, అయితే మడిసన్నాక కూసంత కళాపోసనుండాల అని బలంగా నమ్మే మడిసిని నేను, మరి చేసిన అల్లర్లు కూడా చెప్పాలి గదా. మా ట్యూషన్ నుండి నవోదయనగర్ లోని మా ఇంటికి వెళ్ళడానికి సరాసరి రైల్వే ట్రాక్ వరకు వచ్చేసి ట్రాక్ పక్కన రోడ్ పట్టుకుని బ్లైండ్ హైస్కూల్ మీదుగా నేనూ మా ఫ్రెండ్, వాడి సైకిలు నడిపించుకుంటూ వెళ్ళే వాళ్ళం. అంటే లావుపాటి కళ్ళద్దాలు (-12D పవర్) ఉండటం వల్ల మనకి సైకిలు తొక్కడమే కాదు ఎక్కడం కూడా నిషిద్దమే. ఆ దారమ్మట అమ్మ వాళ్ళ ఆఫీసు బంట్రోతులు బోల్డుమంది తిరుగుతూ ఉండే వాళ్ళు సో ఇంట్లో తెలియకుండా "సాహసం శాయరా ఢింభకా.." అందామంటే ఆనక వాళ్ళు ఇంట్లో చెప్పి మన డిప్ప పగల గొట్టించేయగలరు అని బుద్దిగా ఉండే వాడ్ని.అలా ఓ రోజు ముందు కొందరు ట్యూషన్ అమ్మాయిలు వెనగ్గా మేము నడుస్తుండగా ఎందుకు బుద్ది పుట్టిందో ఏమో ఈల నేర్చుకోవాలి అనిపించింది. వెంటనే అది రోడ్డు, ముందు ఆడలేడీస్ వెళ్తున్నారు అన్న స్ఫృహలేకుండా, ఒకవేళ ఉన్నా "ఆ వచ్చిందా చచ్చిందా.." అనుకుని తుస్.స్.స్.స్. తుస్.స్.స్.స్.స్ మంటూ ప్రాక్టీసు మొదలెట్టాను. కాసేపయ్యాక ఏమయ్యిందో ఏమో అనుకోకుండా ఒక్కసారిగా పెద్ద పెట్టున కయ్య్.య్య్.య్.య్. మంటూ ఈల వచ్చేసింది.

ముందు నడుస్తున్న అమ్మాయిల బ్యాచే కాకుండా వాళ్ళకుముందు నడుస్తున్న బ్యాచ్ సైతం ఒక్కసారి ఆగి వెనక్కితిరిగి ఉరిమి చూశారు... ఫోకిరివాడులారా అని తిట్లు మొదలెట్టకముందే పారిపోయే వీలు లేక హి.హి.హి. అని వెర్రి నవ్వు ఒకటి నవ్వేసి "ఈల.. ప్రాక్టీసు.. అనుకోకుండా.." అని సణిగాను వాళ్ళు మరోమారు గుడ్లురిమేసి వెళ్ళిపోయారు. మనం ఎందుకైనా మంచిది అని సేఫ్టీ కోసం రెండ్రోలు జొరం తెప్పించేసుకుని ట్యూషన్ మానేశాం.ఇక ట్యూషన్ ఎగ్గొట్టీసి మనం చేసే ఘనకార్యమేమిటయ్యా అంటే సినిమాలకి చెక్కేయడం. అప్పట్లో "ఛస్ మన ట్యూషన్ దగ్గరలో ఒక్క సినిమా హాలైనా లేదేంట్రా ఎంత ఇబ్బందైపోయింది.." అని తిట్టుకుంటూనే రెండో గేట్లోనుండి రయ్ మని ఏంజల్ టాకీసుకో లేదంటే మూడోగేటు దగ్గర చిత్రాలయకో లేదంటే బస్టాండ్ దగ్గరలో ఉండే సంధ్యాకో చెక్కేసే వాళ్ళం. అప్పుడప్పుడు చిరంజీవి సినిమాల కోసం ఈశ్వర్ మహల్ కి వెళ్ళడానికి కూడా జంకే వాళ్ళం కాము. అప్పట్లో ఇవే కానీ నేను ఇంటర్ మరియూ ఇంజనీరింగ్ కి వచ్చాక జయలక్ష్మి, రవి కళామందిర్ అనే రెండు అల్ట్రామోడర్న్ హాళ్ళు కట్టారు వాటిలో ఎయిర్ కూలర్లు రిక్లైనింగ్ సీట్లు అబ్బో ఆ కతే వేరులే, మహరాజ భోగం అనిపించేది అప్పట్లో.
ఒక వేళ సినిమా అంత సమయం లేదంటే మా మరో అడ్డా ఈశ్వర్ స్వీట్స్ (బొమ్మలో ఉన్నదే). కోర్ట్ బిల్డింగ్స్ దగ్గరలో ఉండేది దీన్లో ఓ స్వీటు ముక్క తినేసి, బాదంపాలో, గ్రేప్ జ్యూసో తాగేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళం.  (ఇక్కడ మీ నోరూరితే మీరు తిండిపోతు అనో, ఖాళీ కడుపుతో ఈ టపా చదువుతున్నారనో అర్ధమే కానీ నా తప్పేంలేదు అని గమనించ ప్రార్ధన)బాదం పాలు సేఫే కానీ గ్రేప్ జ్యూస్ తాగినపుడు వెంటనే ఇంటికి వెళ్ళకూడదు దొరికిపోతాం, ఓ అరటిపండుతినో, బోలెడు మంచినీళ్ళు తాగో నోట్లో రంగంతా పోయింది అని నిర్ధారించుకున్నాక వెళ్ళాలి. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఇక్కడి గ్రేప్ జ్యూస్ చాలా నచ్చేది నాకు చల్లగా, రుచిగా గ్లాస్ అడుగున చివర్లో రెండు ద్రాక్ష వచ్చేలా ఇచ్చేవాడు, స్ట్రా ఇచ్చేవాడు కాని నాకు ఎండన పడి వెళ్ళి గ్లాస్ తో అలాగే తాగడం మరింత ఇష్టం , మహాద్భుతం గా ఉండేది రుచి ఎన్ని చోట్ల ఎంత ఖరీదైన జ్యూసులు డ్రింక్ లు తాగినా దాని రుచి దానిదే అంటే నమ్మండి.

అప్పుడప్పుడూ ఈశ్వర్ స్వీట్స్ నుండి వస్తూ వస్తూ రెండోగేటు దగ్గర శంకరమఠం దగ్గర కాసేపు ఆగే వాళ్ళం, నేను మాత్రం గుడిని దానిలో అమ్మవారిని చూడటానికి వెళ్ళేవాడ్ని. మా ఫ్రెండ్స్ మాత్రం కాంపౌండ్ లోనే ఆగిపోయే వారు ఎందుకో తెలిసేది కాదు, అంటే దర్శనమయ్యాక నేనూ వాళ్ళతో కలిసే వాడ్ననుకోండి :-) అది వేరే విషయం. ఇతిహిః 10th క్లాసహః కొన్నిహిః ఙ్ఞాపకహః ... !!

17 comments:

సుజాత said...

మీ జ్ఞాపకాలు ఎంతోమంది జ్ఞాపకాలను తట్టి లేపేలా ఉన్నాయి.

పాండురంగారావు మాస్టారు మా గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ చెప్పేవారు. సంగీతమంటే ఎంతో అభిమానించేవారు. అరటీపండు వొలిచి చేతిలో పెట్టినట్లు పాఠం చెప్పేవారు.

పేద విద్యార్థుల డగ్గర డబ్బు తీసుకోకుండా ట్యూషన్ చెప్పడం,ఇవ్వని వాళ్లని గట్టిగా అడక్కపోవడం వల్ల కూడా ఆయన కమర్షియల్ గా సక్సెస్ అవలేకపోయారు.

కానీ నాకైతే పాండురంగారావు మాస్టారు ఒక అద్భుతం! అంత నాలెడ్జ్ నాకు తెల్సి ఇంకెవరి దగ్గరా చూడలేదు.

ఎంతైనా మీరు అదృష్టవంతులు, మాస్టారి దగ్గర చదువుకున్నారు.

Anonymous said...

చాలా బావున్నాయి మీ అనుభవాలు. చల్లగా, వెన్నెల్లాగా!

స్కూలు రోజుల్లో ట్యూషనుకెళ్ళడం ఒక మధురానుభవమే!

నిషిగంధ said...

చక్కని టపాతో నన్నూ మా మేష్టారింటికి తీసుకెళ్ళారు వేణూ.. పదోతరగతి చివరి 2,3 నెలల్లో మా అమ్మకి నా మీద సడెన్ గా ఎందుకు డౌట్ వచ్చిందో ఇప్పటికీ తెలీదు కానీ శర్మగారి దగ్గర ట్యూషన్ జాయిన్ చేసింది.. అక్కడ కూడా అచ్చు మీరు చెప్పినట్లే అమ్మాయిలు వరండాలో, అబ్బాయిలు వరండా ముందు గచ్చు చేసిన వసారాలో కూర్చునేవాళ్ళు.. ఇక పాఠాలు ఒకళ్ళనొకళ్ళు అప్పచెప్పించుకోవడాలు.. మధ్య మధ్య ఫ్రెండ్స్ కి కన్సెషన్స్ ఇచ్చేయడాలు అన్నీ సేం సేం :-)

btw,"దీనివల్లనే మా ఊర్లో అప్పట్లో పేరుపొందిన స్వామీ, శ్రీహరి గార్లలా (ఇక్కడ మీ నోరూరితే మీరు తిండిపోతు అనో, ఖాళీ కడుపుతో ఈ టపా చదువుతున్నారనో అర్ధమే కానీ నా తప్పేంలేదు అని గమనించ ప్రార్ధన) కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు. "

ఇక్కడ బ్రాకెట్లలో చెప్పిన విషయం రాంగ్ ప్లేస్లో ఉన్నట్లుంది.. ఒకసారి చూడండి :-)

సుజాత said...

నిషిగంధ,
మీ సందేహమే నాకూ వచ్చింది. మీరన్నాక బలపడి, మార్చాను. థాంక్యూ!

Venu said...

ఎప్పటిలాగే మీ జ్ఞాపకాలని చక్కగా మాతో పంచుకున్నారు వేణూ.. నేను కూడా అలా మా ఊరి బడి దగ్గర, ట్యూషన్ దగ్గర కాసేపు తిరిగొచ్చాను.

మొన్ననే అనుకున్నాను, నా జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు మాష్టార్లు అనే టైటిల్ తో ఓ పోస్ట్ వేద్దామని.

అంతా బానే ఉంది కానీ, మొదట్లో పెట్టిన ఆ 10th Class certificate ఎవరిది?

సుజాత said...

వేణు గారూ,
ఆ సర్టిఫికేట్ వేణూ శ్రీకాంత్ ది కాదండీ! గూగుల్ ఇమేజెస్ లో ఎవరో పారేసుకుంటే సమయానికి దొరికిందని పెట్టాను!

జయ said...

వేణు గారు, మొత్తానికి బాల్యమంతా పరిపూర్ణంగా ఆనందించారన్నమాట. బాగున్నాయి మీ అనుభవాలు. ప్రతిఒక్కళ్ళు ఇటువాంటి జీవితన్నే కదా కొరుకునేది.

aswin budaraju said...

Cool undi

వేణూ శ్రీకాంత్ said...

సుజాత గారు నెనర్లు. "ఎంతైనా మీరు అదృష్టవంతులు, మాస్టారి దగ్గర చదువుకున్నారు." అప్పట్లో అంతగా తెలియలేదు కానీ తర్వాత చాలా సార్లు అనుకున్నానండీ ఈ మాట.

నీలాంచల గారు నెనర్లు. మీపేరు చాలా బాగుంది.

నిషిగంధ గారు నెనర్లు. హ హ అమ్మలకి అంతేనండీ అలా హఠాత్తుగా అనుమానాలొచ్చేస్తుంటాయ్. అప్పట్లో వెళ్ళడం మా చెడ్డ చిరాకుగా అనిపిస్తుంది కానీ ఆ అనుభూతులు ఇప్పుడు తలుచుకుంటే ఆ విలువ తెలుస్తుంది. అన్నట్లు కరెక్ట్ చేసినందుకు మీకూ సుజాత గారికీ ధన్యవాదాలు.

వేణు గారు నెనర్లు. మరి అర్జంట్ గా రాసేయండి నేను ఎదురు చూస్తున్నాను.

జయ గారు నెనర్లు. నిజమేనండీ ప్రతి ఒక్కరూ ఇలాటి జీవితాన్నే కోరుకునేది.

అశ్విన్ బూదరాజు నెనర్లు. ఆఫీసు లో వాళ్ళు స్ట్రా వేసుకుని మరీ మీ రక్తం పీల్చేస్తున్నారా ఏంటి బొత్తిగా నల్లపూసైపోయారు. మీ టపా చదివి రెండ్నెల్లు పైనే అవుతుంది అర్జంట్ గా రాసేయాలి మరి.

భావన said...

బాగున్నాయి బాల్యమంటే భాద్యతలు లేని బంగారు లోకం మళ్ళీ అందులోనే ఆ లెవెల్ కు తగ్గట్లు గొడవలు బాధలు.. బాగున్నాయి మమ్ములను కూడా తీసుకు వెళ్ళేరు మీ బాల్యానికి. ఏట్లా ఐనా మీ నరసరావు పేటోళ్ళు అసాధ్యులు సుమా.

వేణూ శ్రీకాంత్ said...

భావన గారు నెనర్లు. నిజమే ఆ బంగారులోకానికి మళ్ళీ ఓ సారి వెళ్ళిరావాలి అనుకోని మనిషి ఉండరేమో.

Srujana Ramanujan said...

వేణూ శ్రీకాంత్ గారూ,

బాగా రాశారండీ. మీ ఈశ్వర్ కూల్ డ్రింకు షాపులో తాగిన బాదంపాలు ఇంకా గుర్తున్నాయి. :-) మీకన్నా ముందే మీ ఊరి గురించి రాశా కదా ;-)

ఎంతైనా పిల్లగాళ్ళకి ఫిజిక్సోల్లే గుర్తుంటారేమో...?
***

>>>ఎందుకో నేను బలవంతపు బుద్దిమంతుడుగానే మిగిలిపోయాను.

:-)))

సుజాత said...

ఈశ్వర్ కూల్ డ్రింక్స్ వాళ్ళ చివరి అబ్బాయి అనుకుంటాను నాకు సీనియర్ కాలేజీలో! అందువల్ల ప్రతి ఫంక్షన్ కీ అక్కడినుంచే డ్రింకులూ, వగైరాలూ! అక్కడ బాదం పాలు మాత్రం సూపర్, తాగేశాక గ్లాసు అడుగున కొన్ని బాదం పప్పు ఊరిస్తూ...వదలబుద్ధి కాకుండా! తల్చుకుంటే అర్జెంటుగా ఊరెళ్ళి ఓ గళాసు తాగి రావాలనిపిస్తోంది!

వేణూ శ్రీకాంత్ said...

సృజన గారు నెనర్లు. ఓ బ్రహ్మాండంగా గుర్తుంది మీరు మా ఊరి గురించి రాసిన టపా :-)

బలవంతపు బుద్దిమంతుడు భలే పట్టుకున్నారు :-) అప్పుడప్పుడూ ఫ్లో అలా కొన్ని నిజాలు బయట పడిపోతుంటాయి :-)

మా మాష్టారు నాకు ఫిజిక్స్ టీచర్ గా కంటే ట్యూషన్ మాష్టారిగానే గుర్తున్నారండీ ఇంకా చెప్పాలంటే నాకు తను లెక్కలు చేయించే పద్దతి ఇష్టం. మీరు చెప్పింది కూడా నిజమే ఫిజిక్స్ చెప్పే సార్లు అందరికీ నేను పంకానే, వాళ్ళంతా భలే ప్రత్యేకంగా ఉంటారు అసలు ఆ సబ్జక్టే అలాటిదేమో. అర్జెంట్ గా మా ఫిజిక్సు సార్లమీద ఓ టపా రాసేయాలి. ఐడియా ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు :-)

Dhanaraj Manmadha said...

Very nice post. In one word, you forced me to write another post immediately. But am on a vacation

Dhana & G

వేణూ శ్రీకాంత్ said...

Thanks a lot Dhana and Gitacharya. Hope you are having a great time.

srinu said...

సుజత గారు
చంద్రబాబు అన్నట్టు అయనది తెరిచిన పుస్తకం కాదు

మీదే తెరిచిన పుస్తకం, రంగు రంగుల బొమ్మల పుస్తకం, అందమైన గ్నాపకలపుస్తకం, బ్లాగుపుస్తకం,