Pages

Wednesday, May 6, 2009

మా వూరు మాకు గొప్ప!

"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అని గొప్పగా చెప్పుకోకున్నా, ఎవరు పుట్టి పెరిగిన ఊరు వారికి గొప్పగానే కనపడుతుంది.

అది రాతి నేల అయినా,సస్యశ్యామలమైనా ! (మా ఊరు పచ్చగానే ఉంటుంది).

శాంతి నిలయమైనా, ఫాక్షన్ తీరమైనా! (ఎన్నికలప్పుడు తప్ప ఫాక్షన్ మా ఊరికి రాదు!) .

అలాగే మా ఊరంటే మాకిష్టం! మా ఊరు నరసరావు పేట. ఊరు మారినా ఉనికి మారలేదని, మేమూ మా వూరు గురించి ఒక బ్లాగు రాద్దామనుకుంటున్నాం!

ఊరు గురించి అనగానే ఇదేదో మా ఊరి జనభా లెక్కలూ, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితులూ, పంటల తీరుతెన్నులూ గుర్తొస్తాయేమో! ఇవన్నీ వికీ పీడియాలోనో, ఆంధ్రప్రదేశ్ దర్శిని లోనో దొరుకుతాయి. అదేమీ కాదు. మా ఊరి చరిత్ర, కళా సాంస్కృతిక రీతులూ, కవులు, నటులు, క్రీడాకారులూ, మరియూ ఇతర ప్రముఖ వ్యక్తులు, ఇలా ఇలా. వీలైతే రాజకీయాల గురించి కూడా! ఇవే మేము ప్రస్తావించదల్చుకుంది.

గూగులమ్మని నరసరావు పేట అని అడిగితే "ఈ బ్లాగు చూడండి" అని చెప్పాలని ఆకాంక్షిస్తున్నాం. రోజుకో ఆరేడు టపాలు రాసి ఎవరికీ బోరు కొట్టించం. నెలకు రెండు,కుదిరితే మూడు టపాలు!

మా వూరు పుట్టి రెండు వందల ఏళ్లయిన సందర్భంగా 1997లో ఒక సావనీరు విడుదలైంది. అందులో అరుదైన ఫొటోలు, వ్యాసాలు ఉన్నాయి. మా బ్లాగుకోసం వాటిని కొంతవరకూ వినియోగించుకుంటున్నాం. సావనీరు అప్పటి ఎడిటరు శ్రీ కె.వి.కె రామారావు మరియు ఇతర వ్యాసకర్తలకు మా ధన్యవాదాలు.... !

ఆ ప్రాంతానికి చెందిన ఇతర బ్లాగర్లకు నరసరావుపేటతో ఉన్న బంధాన్నో అనుబంధాన్నో కనీసం పరిచయాన్నో పంచుకోవాలనుకుంటే ఇక్కడ స్వాగతం బోర్డు కడతాం!

ధన్యవాదాలు!


పేట్రియాట్స్


సుజాత,


గీతాచార్య