Pages

Monday, June 7, 2010

సుబ్రహ్మైక్యం: వీ మిస్యూ స్వామీ :(

"ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా, సొంత ఊరు కన్నవారు అంతరాన ఉందురోయ్" అంటాడు ఒక కవి! అదే పాటలో "గాయ పడిన హృదయాలకు జ్ఞాపకాలే అతిధులోయ్" అని కూడా ఓదారుస్తాడు. గుళ్ళో అడుగు పెడుతుండగానే "ఏవమ్మా!"అంటూ ఆప్యాయంగా పలకరించే ఆ గొంతు ఇక వినిపించదని ఊహించుకోవడం కష్టంగానే ఉంది. తప్పించుకోలేని విషయాల్లో మరణం ప్రధానమైనది కాబట్టి మనసు వగస్తున్నా, కనులు తడుస్తున్నా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని  నిస్సహాయ స్థితి!

సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా!

వారి కుటుంబానికి, పిల్లలకు సానుభూతి!

-సుజాత
***   ***   ***
రామాయణంలో అందరికన్నా పిల్లలకు నచ్చేది హనుమంతుడు. కథ మొత్తాన్నీ చూడక పోయినా, హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సన్నివేశాన్ని మాత్రం పిల్లకాయలు తప్పకుండా చూస్తారు. అలాగే మా పిల్లకాయలకు భక్తి అనే పండుని ప్రత్యక్షంగా పంచి పెట్టే సుబ్రహ్మణ్యం గారు లేరంటే ఒక్క కన్నీటి చుక్కన్నా కార్చాల్సిందే.

 బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, యుద్ధ, అని మిగతా ఐదు కాండలకూ పేర్లిచ్చినా, హనుమంతుడు హీరో అయిన అయిదో కాండను మాత్రం సుందర కాండ అన్నారు వాల్మీకి. ఎందుకా ప్రత్యేకమైన పేరు? ఎందులోనిదా సౌందర్యం? సీతమ్మ వారు లేని శ్రీరాముని జీవితంలో లేని సౌందర్యమెక్కడిది? అడుగడుగునా రాముని దు:ఖాన్ని నింపుకున్న కిష్కింధా కాండ దాతగానే వచ్చే కథకు ఆ పేరు పెట్టటంలో ఔన్నత్యమేమిటి?

హనుమ భక్తి సౌందర్యం!
భర్త విషయం తెలుసుకున్న సీతమ్మ ఆనందం సౌందర్యం!
రావణుని కొలువులో హనుమను కాపాడిన విభీషణుని మానవత్వంలోని సౌందర్యం!
సీతమ్మ జాడ తెలుసుకున్న శ్రీరాముని ఆనందంలోని సౌందర్యం!
ఎటు తిరిగి ఎటొచ్చినా హనుమ రామ భక్తి సౌందర్యాన్ని తెలిపేది కనుకనే అది సుందర కాండ అయింది.

ఎవరైనా రామ భక్తులే. శ్రీరామ భక్తులే. ఆ భక్తి సౌందర్యాన్ని ఆవిష్కరించింది కాబట్టే అది సుందర కాండ అయింది. అలాంటి భక్తి సౌందర్యాన్నావిష్కరించి చూపిన మహానుభావులు సుబ్రహ్మణ్యం గారు.

నరసరావుపేటంటే గడియార స్థంభం, ఆంజనేయ స్వామి గుడి, సత్యనారయణా టాకీసూనూ. అఫ్కోర్స్ కల్తీ (మందులు) కూడాననుకోండీ. కానీ కల్తీ లేనిదేదైనా కావాలంటే నేరుగా మా స్టేషన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాల్సిందే. పూజారి సుబ్రహ్మణ్యం గారి ఆదరాన్ని చవిచూడాల్సిందే. మరి ఆయన మరణాన్ని మా హనుమంతుడెలా స్వీకరిస్తున్నాడో? చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, సుందర కాండ సౌందర్యాన్ని, భక్త జనానికి పంచే అలాంటి మనిషినెక్కడా చూడలేదు (మాదారంలో ఈ మధ్యన అలాంటి అభిమానాన్ని చూశాను) ఇక ముందు చూడబోము. వీ మిస్యూ స్వామీ! ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియటం లేదు.
***   ***   ***

ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి లంకను చేరాట్ట! ట్ట నే. పెద్ద వాళ్ళు చెపితేనే కదా తెలిసేది. ఆయన భక్తుడైన సుబ్రహ్మణ్యంగారు, 

భక్తి సాగరాన్నానందంగా ఈదులాడి, స్వర్గాన్ని చేరారిప్పుడు. స్వామినీ, భక్తులనూ శోకసాగరంలో ముంచి. కన్నీరు కార్చాలా? గుండె దిటవు చేసుకోవాలా? నిట్టూర్చాలా? ఏమి చేసినా, ఎన్ని చెప్పినా ఆయన లేరన్నది నిజం. ఇక ముందు ఆంజనేయ స్వామి గుడిని ఆయన లేకుండానే చూడాలి.

ఇవాళ ఉదయం ఆయన పోయారట. మధ్యాహ్నం సుజాత గారు ఫోను చేసి చెపితే తెలిసింది. ఈ మధ్యనే ఆయన పెద్ద కుమారుడు చనిపోయారని తెలిసి వెళ్ళి పలుకరించబోతే, నాకన్నా ముందు స్వామిని చేరుకున్నాడని కాస్త అసూయగా ఉందయ్యా అని నవ్వుతూ చెప్పారు. కానీ ఆయన నవ్వులో ఉన్న విషాదం నన్ను దాటిపోలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆంజనేయ స్వామి గుడంటే స్టేషన్ రోడ్డులోదే. పూజారంటే సుబ్రహ్మణ్యం గారే. వచ్చిన ఏ భక్తుడినీ అసంతృప్తిగా పోనివ్వరు. నేను ఎప్పుడు ెళ్ళినా "ఏం ఆచార్యులుగారూ, పెరుమాళ్ళకు పూజాదికాలు అన్నీ చేశారా?" అని అంటారు. నేను నవ్వుతూ "మీకన్నా బాగా చెయ్యగలమా స్వామీ," అని అంటే... నాదేముందయ్యా! అన్నీ ఆయనే చేయించుకుంటారు," అనే సమాధానం.  ఎందుకు స్వామీ అందరు దేవుళ్ళవీ గాయత్రి చదువుతారు ఇక్కడ అంటే ఆయన చెప్పిన సమాధానం నాకు బాగా నచ్చింది. అందరు దేవుళ్ళూ ఒక్కటే అనో, జనాన్నిసంతృప్తి పరచటానికో అని చెప్పి ఉంటే ఆయన గొప్పతనమిక్కడ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడికొచ్చే వారంతా స్వామి భక్తులైనా, వేరే దేవుని భక్తులైనా నా స్వామి వద్దకొచ్చే వారందరూ, నావాళ్ళే. నా వాళ్ళను సంతృప్తి పరచటం నా ధర్మం. ఎన్ని చేసినా నాకు ఆయనే దైవం. ఏ మంత్రం చదివినా నాకు కనిపించేది ఆంజనేయ స్వామే అని, నేను నమస్కారం చేసుకునేప్పుడు ఆయన  
ఓమ్ దామోదరాయ విద్మహే
రుక్మిణీ వల్లభాయ ధీమహి
తన్నో కృష్ణ: ప్రచోదయాత్!
అంటూ నువ్విక్కడికొచ్చినా హరే కృష్ణ అంటావు కదా అని నవ్వుతారు. ఆ నవ్వులు ఇక ఉండబోవు. ఆ కథలు చెప్పే మనిషి ఇక ఉండరు. ఇప్పటిదా నా అనుబంధం! ఇరవయ్యారో ఏట అడుగు పెట్టిన నాకు పాతికేళ్ళ అనుబంధం. నేను పసి వాడిగా ఉన్నప్పుడే నన్నెత్తుకుని వెళ్ళే వాళ్ళా గుడికి. ఆకు పూజంటే ఆయన చేయాల్సిందే నాకు. ఎన్ని చోట్ల ఆకు పూజ చేయించినా సుబ్రహ్మణ్యం గారు చేసినట్టు చేశారా అనే కంపారిజను. నా జీవితంలోని మూడు ముఖ్యమైన సంఘటనలక్కడ జరిగాయి. ఎన్నెన్నో ఙ్ఞాపకాలు. ఇక అవే వారి తీపి గురుతులు. 

భగవంతునికన్నా భాగవతులే ముఖ్యమని శ్రీవైష్ణవంలో చెపుతారు. ఆ లెక్కన గుడిలోని స్వామికన్నా వీరే ముఖ్యులు. 

మనం ప్రార్థించినా, చక పోయినా అలాంటి వ్యక్తి ఆత్మకు ఎల్లప్పుడే ఆ ఆంజనేయుడే అందిస్తాడు. 

ఏడ్వలేక,

గీతాచార్య
***   ***   ***

రాస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. ఫోనులో విషయం విన్న నాకు మొదట్లో పెద్దనిపించలేదు కానీ, పేట వెళ్ళి అటు వైపు చూశాక మనసు మెలిదిరిగిపోయింది నాకు. ఇక వ్రాయలేను. 

పేట్రియాట్స్! వీ మిస్ హిం కదూ... మళ్ళా ఎలాగైనా ఆయన తిరిగొస్తే బావుణ్ణు

10 comments:

Unknown said...

చదువుతున్న మాకే కన్నీళ్ళాగటం లేదు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. వారి ఆత్మకు శాంతి కలుగు గాక !

శ్రీరామ్ said...

geetha charya garu,

vaala chinna abbayi 'Anjani' prasad phone number vunte ivvagalara ?

-Sriram

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
ఇవాళ హనుమజ్జయంతి కదా! పూజలు స్వయంగా చేయించుకోవాలని ఒక రోజు ముందుగానే రప్పించుకున్నాడేమో ప్రసన్నాంజనేయుడు! ఇంత స్వార్థం పనికి రాదు స్వామీ హనుమా!

శ్రీరామ్ గారూ,
అంజనీ కుమార్ ఫోన్ నంబర్ ఇదిగో!

9949497470

Srujana Ramanujan said...

Shocking news, We used to discuss when we talk about nrt. He's a a nice person.

భావన said...

very sorry to hear that sujata and geetacharya. May his soul rest in peace.

మాలా కుమార్ said...

సుజాత గారు ,
గీతాచార్య గారు ,
మీకు ఇష్టులైన పూజారి గారి మరణానికి సంతాపం తెలుపుతున్నాను .
ఆయన ఆత్మ ఆ హనుమంతుని సన్నిధికి చేరుకోవాలని ప్రార్ధిస్తున్నాను .

Unknown said...

Sriram,
Use this number to call Anjani 9032018931

ramana said...

ayyo...subrhmanyam garu lera?
ittevala nenu narasaraopet ku vellinappudu nenu ,ramanjeya reddy gudiki vellamu -april lo. ayana hyderabad ku vellarani chinna pujari- vari bandhuveta- cheppadu.
eesari hyderabad nunchi vachinappudu kaluddamule anukunna.
kani.....?
ramana

ప్రియ said...

బాధ కలిగించే అంశం. కొన్ని అనుబంధాలు అలా పెనవేసుకుని పోతుంటాయి.

చెప్పొచ్చో లేదో కానీ, ఇది కూడా ప్రత్యేకమైన శైలుల్లో రాశారిద్దరూ

వేణూశ్రీకాంత్ said...

ఈ వార్త తెలిసి నేను కూడా చాలా బాద పడ్డాను. ఈ గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈయనతో ప్రత్యేకమైన అనుభందాన్ని కలిగి ఉంటారేమో... ఏదో మొక్కుబడిగా కాకుండా తాదాత్మ్యతతో పూజచేయడమే కాక కేవలం ఆంజనేయస్వామి తో సరిపెట్టకుండా పూజ చివరన అందరి దేవుళ్ళను స్మరించే సుబ్రహ్మణ్యంగారు ఇక లేరు అని తెలుసుకుని "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు" అని అనుకోవడం తప్ప ఎవరైనా ఏం చేయగలం.