Pages

Wednesday, November 11, 2009

మా వూరి గ్రంథాలయం కబుర్లు!

కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే మా వూర్లో లైబ్రరీ గురించి చెప్పకపోతే మాకు పాపం చుట్టుకుంటుంది. అందుకే మొన్నీమధ్య సెలవులకు వెళ్ళినపుడు కాస్తంత భోగట్టా చేద్దామని వెళితే అక్కడ లైబ్రరీ లేదు. నా గుండె ఆగిపోయింది.

అప్పుడెప్పుడో చాన్నాళ్ల క్రితం ప్రభుత్వం ఈ శాఖా గ్రంథాలయాలని ఎత్తేయాలని అనుకుందట. నేను లేకుండా చూసి అలాంటి కుట్రేమన్నా చేశారా అనుకున్నా!అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది.వాళ్లనడిగితే లైబ్రరీ ఏమిటన్నారు. వాళ్ళు హోటల్ పెట్టేనాటికి అది లేదన్నారు(ఏడిసినట్టుంది. అదుంటే వీళ్ళు హోటలెలా పెడతారు?)

ఇంట్లో అడక్కుండా వచ్చినందుకు చింతిస్తూ అన్నయ్యకు ఫోన్ చేసి "శాఖా గ్రంథాలయం ఇక్కడ లేదేంట్రా" అంటే వాడు "తీసేశారు" అన్నాడు క్లుప్తంగా!  

"తీసేశారా, మరి ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు? "నిర్ఘాంతపోయాను మరో పక్క మనసులో అత్యాశపడుతూ!(ఆ పుస్తకాలన్నీ ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయనే నమ్ముతూ)

" తొందర పడొద్దు!  ఎత్తేశారన్లేదు నేను. అక్కడినుంచి తీసేశారు.  మన సత్యనారాయణ టాకీసు పక్కనే కట్టారిప్పుడు కొత్త బిల్డింగ్"  వాడు.

అక్కడికెళ్ళి చూద్దును కదా, ఇదిగో ఇదే లైబ్రరీ!



ఇంత పెద్ద బిల్డింగ్ ని లైబ్రరీగా చూస్తామని ఎప్పుడూ కల కూడా కనలేదు. ఎప్పుడూ అరండల్ పేటలోనే ఏదో ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని నడిపిస్తుండేవాళ్ళు. కాకపోతే కండిషన్ ఏమిటంటే వాళ్ళు అద్దెకు తీసుకునే ఇంటికి పొడుగాటి వరండా ఉండాలి. పేపర్లు చదువుకునే వాళ్ళకోసం!


మా నరసరావుపేట శాఖాగ్రంథాలయం 1956 లో స్వల్ప సంఖ్యలో పుస్తకాలతో ప్రారంభమైంది. ఇప్పుడున్న పుస్తకాల సంఖ్య దాదాపు యాభై వేలు.  దీనితో  దాదాపు మా వూర్లోని విద్యార్థులందరికీ మర్చిపోలేని మధుర  స్మృతులున్నాయి. మధుసూదన రావు గారు లైబ్రేరియన్ గా ఉన్నపుడు శాఖా గ్రంథాలయం అరండల్ పేటలో పాత LIC ఆఫీసు పక్కన ఉన్న ఒక పెద్ద ఇంట్లో ఉండేది. మునిసిపల్ హై స్కూల్లో ఏ పాటి గ్రంథాలయాలుంటాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము వారంలో రెండు మూడు సార్లన్నా లైబ్రరీకి వెళ్ళి సాధారణ పరిజ్ఞాన సముపార్జన చేస్తుండేవాళ్లం! స్కూల్లో ఖాళీ పీరియడ్స్ లో అలా వెళ్లడానికి మాకు పర్మిషనుండేది.


ఈ టపా ఇప్పుడు రాయడానికి కూడా కారణం ఉంది. నవంబరు 14 నుంచి 19 వరకూ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి.అప్పుడు మా శాఖా గ్రంథాలయంలో అన్ని స్కూళ్లకీ వక్తృత్వం, వ్యాస రచన, సంగీతం,క్విజ్, గ్రూప్ డిస్కషన్ లాంటి బోలెడు పోటీలు పెట్టేవారు. మా స్కూలు నుంచి మేము ఒక గంప పట్టుకెళ్ళి గంప నిండా అన్ని స్కూళ్ళనీ చిత్తుగా ఓడించి గెల్చుకున్న బహుమతులూ, మెమెంటోలూ వేసుకుని స్కూలుకు తిరిగొచ్చేవాళ్ళం! (మల్లిక్ రాసిన సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథ గుర్తుందా? అందులో హీరోలాగా అన్నమాట)



విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన వంటి పత్రికలని జాగ్రత్తగా అట్టలు వేసి మరీ ఉంచేవాళ్ళు. రోజూ ఇక్కడికొచ్చి గంటలతరబడి చదివి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని లైబ్రేరియన్ గారే స్వయంగా చెప్పారు.జర్నలిజం చదివేటపుడు ఒక ప్రాజెక్టు కోసం నేను నెల రోజుల పాటు రోజూ ఇక్కడికొచ్చేదాన్ని ప్రాజెక్ట్ కోసం నోట్సు రాసుకోడానికి. అప్పటి లైబ్రేరియన్ శ్రీ మదార్ ఎక్కడెక్కడి పాత పేపర్లు, పుస్తకాలూ తీయించి నాకెంతో  సహాయం చేశారు. నా ప్రాజెక్ట్ "ముందుమాట"లో మదార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలుంటాయి.

నా స్కూలు రోజుల్లో  ఉదయం, సాయంత్రం పేపర్లు  చదవడానికొచ్చే రిటైర్డ్ ఉద్యోగుల ,కాలేజీ విద్యార్థుల  సైకిళ్లతో లైబ్రరీ ముందు రోడ్డంతా నిండిపోయి ఉండేది.ఇంతమంది లైబ్రరీలో గడపడానికి కారణం అప్పట్లో టీవీ వేయి తలల విషనాగులా ఇంతగా విజృంభించకపోవడమే అనుకుంటాను!


లైబ్రరీ ముందు ఉన్న విశాలమైన అరుగుల మీద కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకునే వాళ్ళూ, అక్కడినుంచి నాలుగడుగులు ముందుకేసి స్టేషన్ రోడ్డులో శంకరమఠం దాకా వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లూ...ఆ వాతావరణమే విజ్ఞానంతో నిండి పవిత్రంగా ఉండేది. పోటీ పరీక్షల కోసం చదవడానికొచ్చే వాళ్ళకు అనుభవజ్ఞుల సలహాలు కూడా ఆప్యాయంగా  లభిస్తుండేవి.




కాలేజీకి వెళ్ళాక శాఖా గ్రంధాలయానికి రావడం తగ్గింది. ఎందుకంటే మా కాలేజీకి గుంటూరు జిల్లాలో ఏ కాలేజీకీ లేనంత  పెద్ద లైబ్రరీ ఉంది.(ఇప్పటికీ)!

కొన్నాళ్ళకి లైబ్రరీ ని అక్కడినుంచి పాత LIC ఆఫీసు పై భాగంలోకి తరలించారు. మరి కొన్నాళ్ళకి అక్కడినుంచి ఆంధ్రా బాంక్ సెల్లార్ లో ఉంచారు. అంత పెద్ద లైబ్రరీని ఎలా తరలించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మా వూరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాదాపు 30 పుస్తక కేంద్రాలు ఉన్నాయి. వీటికి నెలకు యాభై పుస్తకాలు వాళ్ళకు ఇస్తుంది  శాఖా గ్రంథాలయం! రోజుకు మూడు వార్తా పత్రికలు వేయిస్తుంది. నెల తర్వాత వాళ్ళు వచ్చి పాత పుస్తకాలు ఇచ్చేసి మరో యాభై పుస్తకాలు పట్టుకెళతారు. ఇలాంటి ఒక పుస్తక కేంద్రం నరసరావుపేట సబ్ జైలులో ఖైదీల కోసం ఉందని తెలిసి ఎంతో సంతోషం వేసింది.

ఇవి కాకుండా పదో పన్నెండో  గ్రామీణ గ్రంథాలయాలు కూడా ఈ శాఖా గ్రంథాలయ నిర్వహణలోనే పని
చేస్తాయి.వాటికి స్వంతగా పుస్తకాలున్నా, పర్యవేక్షణ  అంతా ఇక్కడినుంచే! 

ఖైదీలు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుతారనీ,ఫలానా పుస్తకాలు కావాలని అడుగుతారనీ లైబ్రేరియన్ చెప్పారు.

ఊరు మారేవారో, విదేశాలు వెళ్ళేవారో తమ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకెళ్లలేమనుకుంటే శాఖా గ్రంథాలయానికి ఇచ్చేవేయవచ్చు! అక్కడ సబ్జెక్టు వారీగా సీరియల్ నంబర్లు వేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు.

చివరగా వస్తూ వస్తూ బిల్డింగ్ పేరు చూసి "ఎమ్మెల్యే గారేమన్నా విరాళం ఇచ్చారేమో బిల్డింగ్ కి" అనుకున్నా! లైబ్రేరియన్ గారిని అడిగితే ఆయన , క్లర్కూ  మొహాలు చూసుకుని "లేదమ్మా, అంతా జి.గ్రం.సం. (జిల్లా గ్రంథాలయ సంస్థ) నిధులతోనే కట్టారు ఈ భవనం"అని చెప్పారు. "మరి ఆ పేరేంటి?" అనడిగితే అక్కడే పుస్తకాలు చూస్తోన్న ఒక సీనియర్ చదువరి...

"నీటిపారుదల ప్రాజెక్టులకు వై యెస్ పేరు పెడితే ఆ ప్రాజెక్టుల డబ్బంతా ఆయన జేబులోంచి పెట్టినట్లేనా? ఇదీ అంతే! వాళ్ల ప్రభుత్వం ఉన్నన్నాళ్ళూ వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నా అడిగేవాడు లేడు"అని దేవరహస్యం చెప్పేశాడు.అన్నట్లు ఇక్కడ రీడింగ్ హాల్ పేరు కూడా దివంగత ముఖ్యమంత్రి గారిదే!

ఇదీ మా లైబ్రరీ కథ! ఇంతా చేసి ఈ ఏడాది ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలను జరపకూడదని నిశ్చయించిందట!  :-(

28 comments:

గీతాచార్య said...

ఇంతా చేసి ఈ ఏడాది ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలను జరపకూడదని నిశ్చయించిందట! :-(

LOL. ఇది మాత్రం కేక. ఇంతకీ అది ఇండీను గవర్నమెంటా లేక ఆం. ప్ర. గౌ నా? నిలిపివేసింది?

ప్రియ said...

చూట్టానికి బాగానే ఉందే? అసలు మీస్టైలే భలే ఉంటుంది. దేవ రహస్యం విని పడీ పడీ నవ్వుకున్నాను. మరి అలా రహస్యాలు చెప్పెవచ్చా అండీ?

భావన said...

మొదటి లైను చదవ గానే కిసుక్కుమని నవ్వు వచ్చింది. కోపం గా చూడొద్దండి..
నేనెప్పుడూ మీ వూరు గురించి మీరు వర్ణించినట్లు ("కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే మా వూర్లో" ) వినలేదు.. అందుకే కిసుక్కుమని కాకి పిల్ల సామెత అనుకున్నా.. అమ్మోవ్ శాంతం శాంతం... జుస్ట్ కిడ్డింగ్.. కాని పోను పోను చదువుతు పోతే వో పాపం నిజం గానే పెద్ద లైబ్రరీ అనుకున్నా.. మా వూర్లో అదే బందరు లో క్రిష్ణా జిల్లా మొత్తనికి పెద్ద లైబ్రరీ వుండేది అట తరువాత విజయవాద లైబ్రరీ ఇంకా పెద్దది అయ్యింది అట. మా లైబ్రరీలన్ని గుర్తు చేసినందుకు శిక్ష గా ఒక మంచి పుస్తకం చదివి దాని మీద పేద్ద రివ్యూ రాసెయ్యండి తొందరగా..

వేణు said...

మీ గ్రంథాలయం గురించి రాసింది, కొంచెం తేడాలుంటే ఉండొచ్చు గానీ, ఏ ఊళ్ళో ఉన్న మంచి లైబ్రరీకయినా వర్తిస్తుందనుకుంటా.

కొత్త భవనంలోకి మారిన మీ శాఖా గ్రంథాలయం చాలా బావుంది. ఫొటోలు చక్కగా ఇచ్చారు.

> ఇంతమంది లైబ్రరీలో గడపడానికి కారణం అప్పట్లో టీవీ వేయి తలల విషనాగులా ఇంతగా విజృంభించకపోవడమే అనుకుంటాను!

చదివేవాళ్ళను మీ ఊళ్లోకీ, నాటి స్మృతుల్లోకీ తీసుకువెళ్లేలా లైబ్రరీ కథ చెప్పారు. సరదాగా రాస్తూనే, ‘దేవ రహస్యం’చెప్పటం విస్మరించలేదు! అభినందనలు!

సుజాత వేల్పూరి said...

అల్లో అల్లో అల్లో భావనా,
మీ కిసుక్కు ఇక్కడిదాకా వినపడుతోంది. మరి ఇక్కడ "పట పట" వినపడుతున్నాయా? అదేంటో తెలుసా? పేట్రియాట్స్ పళ్ళు నూరే శబ్దం! సాంస్కృతిక రంగంలో మా వూరి చరిత్ర ముందు ముందు మీకే తెలుస్తుంది చూడండి! నిరూపిస్తాను. ఇదే నా ...నా ...నా ప్రతిజ్ఞ!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది సుజాత గారు, పాత లైబ్రరీ నాకు బాగా గుర్తుంది, ఏంజల్ టాకీస్ ముందు రోడ్ లో డెడ్ ఎండ్ కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే వచ్చేది. నేను పదోతరగతి అయ్యాక శలవల్లో కొన్ని రోజలు క్రమం తప్పకుండా వెళ్ళే వాడ్ని. ఇంట్లో ఈనాడు వచ్చినా అక్కడకు వెళ్ళి పేపర్ మరికొన్ని ఇతర పుస్తకాలు చదివే వాడ్ని.

బయట ఉండే సైకిళ్ళ గురించి భలే రాశారు, రోడ్ మీద అంతా వరుసగా సైకిళ్ళు పార్క్ చేసి చూడటం భలే ఉండేది. కొన్నాళ్ళకు ఆ వీధిలో వెళ్తూ సైకిళ్ళు లేకపోవడం చూసి జాగ్రత్తగా గమనిస్తే మెస్ కనిపించింది, అయ్యో లైబ్రరీ మూసేసి మెస్ కి అద్దెకిచ్చారా అనుకున్నాను కానీ వివరాలు కనుక్కోలేదు.

ఇప్పుడు మన లైబ్రరీని ఇంత పెద్ద బిల్డింగ్ లో చూడటం చాలా బాగుంది. వివరాలను ఫోటోలతో సహా అందించినందుకు ధన్యవాదాలు.

గీతాచార్య said...

భావన గారు,

WE ARE SPECIAL అని ఢంకా బజాయించి మరీ మా పేట్రియాటిజాన్ని చాటాము(ను) కదా ఇక్కడ

http://narasaraopet-bloggers.blogspot.com/2009/06/blog-post_15.html

Nobody can say like this, and be like this. :-) I don't sharpen my tooth (పళ్ళు నూరటం అనుకోండి) though ;-) the no. of comments and other things show the prowess, and socio-cultural base of our నరసరావుపేట్రియాట్స్

సుజాత వేల్పూరి said...

వేణు గారూ,
పేట్రియాట్స్ బ్లాగులోకి అడుగు పెట్టినందుకు థాంక్యూలు!

అంచేత మా లైబ్రరీ పేద్ద గొప్పేం కాదంటారు! అరుగులన్నిటిలోకి ఏ అరుగు మేలు ? -- పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే మంచి లైబ్రరీలన్నింటికీ కామన్ లక్షణాలు ఉన్నా, మంచి లైబ్రరీల్లోకెల్లా మా లైబ్రరీ మేలనిపిస్తుంది మరి! :-))

మా బ్లాగులో మీ మొదటి వ్యాఖ్యకు ధన్యవాదాలు!

గీతాచార్య, I don't sharpen my teeth....(పళ్ళు నూరుట) సూపరు!

రమణ said...

సుజాత గారు మీ గ్రంధాలయ విశేషాలు బాగున్నాయి. చాలా పెద్ద లైబ్రరీ లాగ కనబడుతుంది. నరసరావుపేట వాళ్ళు అదృష్టవంతులు. జి.గ్రం.స. నిధులతో కొత్త భవనాన్ని నిర్మించారా? గొప్ప విషయం అండీ. ఖైదీలకు పుస్తక కేంద్రం ఆశ్చర్యంగా తోచింది. చాలా మంచి విషయం. మా ఊరు పల్లెటూరు అయినా మంచి గ్రంధాలయం ఉందండీ. కానీ ఇప్పుడు శిధిలావస్థలో ఆ బాధతో ఒక టపా వ్రాసుకున్నాను.

సుజాత వేల్పూరి said...

వేణూశ్రీకాంత్,
ఏంజల్ టాకీస్ రోడ్లో వెళితే డెడ్ ఎండ్....అవును, పాత LIC ఆఫీసు పక్కన ఉన్న ఇల్లు సంగతే మీరు చెప్పింది. అక్కడే మెస్ పెట్టారనుకుంటా. ఇప్పుడు అక్కడ అన్నీ ప్రైవేట్ కాలేజీలే! అందుకే బోలెడు మెస్ లు! లైబ్రరీ అక్కడ ఉన్నప్పుడే మేము స్కూలు విద్యార్థులుగా జైత్రయాత్రలు సాగించింది.

అయితే మీరు కూడా ఈ లైబ్రరీ చదువరులేనన్నమాట! sounds great!

వెంకట రమణ గారు,
టపాలో చెప్పినట్లు ఇంత పెద్ద లైబ్రరీ బిల్డింగ్ ని అదీ సొంత బిల్డింగ్ ని చూస్తానని కల్లో కూడా అనుకోలేదండి.స్థలం మాత్రం(కోట్ల రూపాయల విలువ చేస్తుంది, మెయిన్ రోడ్లో ఉంది)మునిసిపాలిటీ కేటాయించిందనుకుంటాను.

లైబ్రరీలు శిధిలావస్థలో ఉండంటం సహించరాని విషయమండీ నిజంగా! పంచాయితే ఏమీ చేయలేదా?

నిషిగంధ said...

భావన కామెంట్ భలే :))

మీ ఊరి గ్రంధాలయంతో మీకున్న అనుబంధం అంతా కళ్ళకు కట్టినట్టుంది! ఫోటోలు చూస్తుంటే చాలా నాస్టాలిజిక్ గా అనిపించింది.. నా దృష్టిలో 'ఇంటి కన్నా లైబ్రరీ పదిలం' :-)

చిన్నప్పుడు ఒకసారి నేను మాఇంట్లో వాళ్ళ మీద అలిగి చెప్పులేసుకుని ఏడ్చుకుంటూ గబాగబా బయటకి వెళ్ళిపోయాను.. ఒక గంటా రెండు గంటలకి కూడా నేను వెనక్కి రాకపోయేసరికి బస్టాండ్, రైల్వే స్టేషన్, కాలవ గట్లు వెతికారు కానీ మానాన్న ఎప్పుడూ తనతో తీసుకెళ్ళే లైబ్రరీలో వెతకలేదు!! ఆకలేసి సాయంత్రం ఏమీ జరగనట్టు ఇంటికొస్తే అందరూ 'ఏం సినిమాకెళ్ళావో నిజం చెప్పు ' అని నిలదీసేవాళ్ళే! నామీద అంత తక్కువ అంచనాలున్నందుకు కోపమొచ్చి మళ్ళీ వెళ్ళిపోదామనుకున్నాను కానీ లైబ్రరీ మూసేసి ఉంటారని ఆగిపోయాను :-)

గీతాచార్య said...

Very sorry to hear about ur library sir. It's really condemnable.

గీతాచార్య said...

నిషి గంధ గారు,

ఇంటి కన్నా లైబ్రరీ పదిలం

నిజమేనండీ.

భావన said...

హి హి హి హ హ హ (ఆదిత్యా 369 లో నవ్విన మెషిన్ నవ్వు వేసుకోండి సుజాత, గీతా చార్య ఇంకా మీ నరసరావు పేట పేట్రియాట్స్ అందరు) చాలా చాల కోపమొచ్చిందే.. మీ వూరి వాళ్ళకు ముక్కున కోపమని విన్నా నేను, అది మాత్రం నిజమనిపించారే.. (ముక్కు మీద కోపమైనా మనసులు వెన్నే లే) ముక్కు మీద కోపం మీ ముఖాలకే అందం మీ బుంగమూతి చందం మా కామెంట్లకు భందం అని పాడుకోమా ఐతే... dont sharpen your teeth ఈ పదం నచ్చింది గీతాచార్య గారికి ఒక వీర తాడు. ఇక నుంచి పళ్ళు నూరటానికి వాడుకోవచ్చు.. ముందుంది ముసళ్ళ పండగ కు infront infront crocodile festival లాగా.. వూరికే అన్నాను లెండి (వూరకనే అన్నాను లే మీ కొచ్చే కోపానికి మీ వూరే బాగుండు లే అని కూడా పాడతాను కాపీ రాగం లో కావాలంటే) , కన్న తల్లి పుట్టిన/పెరిగిన వూరంటే అంత మాత్రం అభిమానం లేక పోతే ఎలా అందులోను అంత పెద్ద గ్రంధాలయం వున్న వూరు.... నన్ను ఎవరైనా క్రిష్ణా జిల్లా అమ్మాయి అంటే మనసు కలుక్కంటుంది నేను ప్రకాశం కదా అని. ఐనా మా బందరు అంటే మాత్రం చాలా ఇష్టం..


@ నిషి గంధ: కోపమొచ్చి లైబ్రరీ కు పారి పోయారా.. హ హ హ..

ప్రియ said...

Don't sharpen teeth!!!

వాహ్ క్యా ఎక్స్ప్రెషన్ హై!

మీ ఈవిల్ డెడ్ కామెంట్ గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో ఊకదంఫుడులో పతి దేవుడు కి అచ్చమైన ఆంగ్ల అనువాదం హజ్‍బెండు గాడు అన్న ఆలోచన లాగా పేలిపోయింది. చూడగానే నవ్వాగ లేదు.

గీతాచార్య కామెంట్స్ నా డల్ ;-)

భావన గారు,

మీకు కూడా ఓ వీర తాడేసుకోండి. మీ ఎంట్రీనే ఈ మాట పుట్టటానికి కారణం.

Dhanaraj Manmadha said...

చాలా బాగా రాశారు సుజాత గారు.

మాస్టర్జీ,

:-)

అడ్డ గాడిద (The Ass) said...

Tapademundandi. ekkadaina libraary okate.

kani petolla sense of humor chala bagundi. Sujatha garu baga rasaru.

bhavana garu, mundu me navvu bagundi

Unknown said...

ooruni chakkagaa gurthu chesthunnaru. chamakulu kuda bagunnai. Devarahasyam baagundi reveal cheyyatam

సుజాత వేల్పూరి said...

నిషి,
ఇప్పుడు మీక్కోపం వస్తే ఎక్కడ వెతకాలో చెప్పండి? (ఇప్పటి)మీ వూరి లైబ్రరీలోనేనా? :-))

భావన,
ముక్కు మీద కోపమైనా మనసులు వెన్నే లే! అబ్బ, ఎంత బాగా చెప్పారో!
అది సరే, మీరు ప్రకాశం అమ్మాయేమిటి? అప్పుడెప్పుడో గుంటూరన్నారుగా,మళ్ళీ ఇదేం మోసం? మీది ప్రకాశం అంటే మేమొప్పుకోం! గుంటూరే, గుంటూరే, గుంటూరే! ష్, అబ్బ, ఎవరక్కడ, మంచి నీళ్ళు..!

ప్రియా,
"పతిదేవుడు" కి ఇంతమంచి అనువాదం ఉందని తెలీక చాలా మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తోందోయ్! గీతాచార్య నాడల్...కూడా సూపరే!

గీతాచార్య said...

ఏంటీ మీరు ఒంగోల (Onegగోల e ని కొంచం అటూ ఇటూ మార్చాము లెండి) వాళ్ళా? ఐతే మా వాళ్ళే అన్నమాట. బందరైనా మాదే! కనీసం ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో, మా ఊరి గురించి చదివి, మన ఊరనుకుని adjust అయిపోండి.

గుంటూరైనా, ఒంగోలైనా అందరం ముందు మనం తెలుగు బ్లాగర్లం. How is దిస్సూ

గీతాచార్య said...

Prakasam was a part of Guntur I hope...

Nobody said...

అసలు కన్న కొసరు ముద్దులా టపాని మించిన వ్యాఖ్యలు. అన్ని వ్యాఖ్యలొచ్చాయంటే టపా గురించి చెప్పేదేముందిక. ఎప్పుడూ చెప్పే మాటేగా... You both rock. It's more than a blog on a town. COntinue this good work

భావన said...

టాంక్ యూ టాంక్ యూ ప్రియా అమ్మయ్య నాకు కూడ ఒక వీరతాడు.. మీ మూలం గానే గీతాచార్య మాట కని పెట్టేరు అంటే.. నాకొక జోక్ గుర్తు వస్తోంది.
ఒక అబ్బాయి చెప్పేడు అట స్నేహితుడికి నేను ఫలానా సినిమా లో నటించాను తెలుసా. నాది చాలా ముఖ్య పాత్ర నేను వచ్చాకే కధ మొత్తం ఒక మలుపు తిరుగుతుంది అని.
స్నేహితుడు అడుగుతాడు: అవునా ఏంటా పాత్ర అని. పోస్ట్ మాన్ పాత్ర నేను పోస్ట్ అని అరిచి వచ్చి వుత్తరం ఇచ్చి వెళ్ళి పోతాను ఆ వుత్తరం లోని విషయం మూలం గానే సినిమా మలుపు తిరుగుతుంది నాది అంత ముఖ్య మైన పాత్ర అన్నాడట మొదటి వాడు.. ఆ జోక్ గుర్తు వచ్చింది . హి హి హి వూ వూ వూ ( ఏడుస్తున్నా కూడ నేను పోస్ట్ మాన్ ఐనందుకు) ... ;-)


సుజాతా.. గుంటూరు నాది ప్రాకాశం నాది అన్ని కలిపిని ఒంగోలు మనది.. ( వచ్చిందన్నా వచ్చాడన్న వరాల తెలుగు ఒకటే నన్నా అన్నట్లు పాడూకుంటా నేను.. ) మంచినీళ్ళు తాగేరా. కొంచం కారం తగ్గించు అమ్మయ్ పక్కనే మిరప తోట లున్నాయి కదా అని అలా దునుము కొచ్చి వాడెయ్య కూడదు మరి..

గీతా చార్య: అవును మాది చిలకలూరి పేట నుంచి నర్సరావు పేట వయా తిమ్మ సముద్రం వెళుతుంటే మధ్య లో వస్తుంది.. ఇంకొల్లు పావులూరు పక్కన.. అచ్చమైన ప్రకాశం, ఐనా అన్ని మనవే ప్రకాశం గుంటూరు ఒక్కటే కదా మీరన్నట్లు.. మా వూరు కు మీ వూరంత వెలుగెక్కడిది ఆ కారమెక్కడిది ఏదో సముద్రపొడ్డోళ్ళం (ఏడిపించటం లేదు అబ్బాయి నిజం గానే అంటున్నా అలా ఎర్ర గా చూస్తే నేనేమి చెయ్యను.. no burning burning red eyes అంటారా అదే కళ్ళెర్రబడలేదని చెపుతారా మళ్ళీ ) ;-)

@ నోబడీ గారు: ఈ గుంటూరోళ్ళ తో ఇదే నండి బాధా, బాగా మాట కారులు అలా కట్టిపడేస్తారు మనను..

Sujata M said...

ఓలమ్మోలమ్మో ! మీకింకో బ్లాగుందని నాకు తెలీనే తెలీదు. ఇవాళిపుడు ప్రియ గారి బ్లాగు ద్వారా చూస్తున్నాను. ఇదీ సూపరే ! చాలా బాగా రాసారు.

Vinay Chakravarthi.Gogineni said...

nice post............

Srujana Ramanujan said...

మీకందరికీ పుస్తకాలంటే బాగా ప్రేమే...

pp said...

The blog is very good. NRT is my ancestrol native place. Still my family stays there.
Thanks
Prabhu

ramana said...

maa ooru narasaraopet daggaraga unna ellamanda.ippudemiledu akkada.narasaraopet lo 1957-1962 varaku municipal high school lonu,ssn college lonu chadivanu.1962 bsc final year.
appudappudu narasaraopet ku velli vasthunna hyderbad nunchi.
malli repu velthunna mithrudu bhagat singh koduku pelli reception.
mee blog bagundi...chala bagundi....nenu nrt vishayalu contribute chesthanu